తీపిపై మమకారం... కోట్లలో వ్యాపారం!

ఫుడ్‌ అంటే ఇష్టమున్న అమ్మాయి... కానీ హార్మోన్ల సమస్యతో నచ్చినవి తినలేని పరిస్థితి. దాంతో తన జీవనశైలిని మార్చుకోవటమే కాదు ‘ది సినమన్‌ కిచెన్‌’ ప్రారంభించి డయాబెటిస్‌, పీసీఓఎస్‌ ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా స్వీట్లు తయారుచేస్తోంది.

Updated : 29 Feb 2024 03:36 IST

ఫుడ్‌ అంటే ఇష్టమున్న అమ్మాయి... కానీ హార్మోన్ల సమస్యతో నచ్చినవి తినలేని పరిస్థితి. దాంతో తన జీవనశైలిని మార్చుకోవటమే కాదు ‘ది సినమన్‌ కిచెన్‌’ ప్రారంభించి డయాబెటిస్‌, పీసీఓఎస్‌ ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా స్వీట్లు తయారుచేస్తోంది. ఏటా రూ.కోట్లలో ఆదాయం అందుకుంటోందీ యువ వ్యాపారవేత్త ప్రియాషా సలూజ...

వ్యాపారవేత్తగా రాణించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయన్నది నిజమే కానీ పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అన్నది నోయిడాకి చెందిన ప్రియాషా నమ్మిన సూత్రం...ఆమె ఫుడ్‌ లవర్‌. తీపంటే మరీ మక్కువ. పదమూడేళ్లప్పుడు ఆమెకు పీసీఓఎస్‌ ఉందని తెలిసింది. శరీరంలో అనేక  మార్పులు. ఆ సమయంలో దానిపై అవగాహన తక్కువ. దాంతో తను చాలా సవాళ్లనే ఎదుర్కోవాల్సి వచ్చిందట. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన ప్రియాషా అడ్వర్టైజింగ్‌ రంగంలో చేరి పార్లే, ఐటీసీ వంటి బ్రాండ్‌లకూ పనిచేసింది. అయితే ఆరోగ్య సమస్య వల్ల ఇష్టమైన స్వీట్లను తినలేకపోయేదట. ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంది. క్రమంగా శరీరంలో వచ్చిన తేడా గుర్తించింది. తన ఆరోగ్యకరమైన అలవాట్లను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్టు చేసేది. ఆ వీడియోలు చూసి, 2019లో ముంబయిలోని ఓ బ్రాండ్‌, వాళ్ల ఈవెంట్‌లో ఫుడ్‌స్టాల్‌ను ఏర్పాటు చేయమని ఆహ్వానం పంపింది. ఆమెకు ఇదో మంచి అవకాశం. వారాంతంలో లోగో క్రియేషన్‌, డిజర్ట్‌ మెనూ...వంటి వాటిని సృజనాత్మకంగా తయారు చేసింది. ఆ ఈవెంట్‌ సూపర్‌ హిట్‌! తనపై తనకు నమ్మకం కుదిరింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, రూ.50వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టింది. మొదట్లో వారానికి రెండు, మూడు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. దాంతో మొదట కంగారు పడినా, వెనక్కి మాత్రం తగ్గాలనుకోలేదు. క్రమంగా రోజుకి రెండు మూడు ఆర్డర్ల నుంచీ పది ఆర్డర్ల స్థాయికి ఎదిగింది.

ఆరోగ్యానికి రుచి తోడై..

మొదట్లో పీనట్‌ బటర్‌ లాంటి ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విక్రయించేది. అయితే అవి రెండు నెలల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కావు. దాంతో రూటు మార్చి ‘ది సినమన్‌ కిచెన్‌’ పేరుతో బేకరీ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. పీసీఓఎస్‌, డయాబెటిస్‌, కీటో డైట్‌ ఫాలో అయ్యేవారి కోసం... వీగన్‌ డార్క్‌ చాక్లెట్‌, ఖర్జూరాలు, బాదం బటర్‌, ఓట్స్‌, ఆర్గానిక్‌ బాదం పిండి, అవిసెగింజలు, కొబ్బరి పంచదార, స్టీవియా వంటి పదార్థాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారుచేసేది. కేకులు, ఫడ్జ్‌, ఫ్లోర్‌లెస్‌ ఆల్మండ్‌ కుకీస్‌, ఎనర్జీ బైట్స్‌, బ్రెడ్‌, వంటివి దిల్లీ వ్యాప్తంగా సరఫరా చేసేది. ఈ ఉత్పత్తులను బ్లింకిట్‌, అమెజాన్‌, లే మార్షే... వంటి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్లో గ్రీనర్‌, నేచర్స్‌ సోల్‌.. వంటి స్టోర్లలోనూ లభిస్తున్నాయి. మొదటి ఏడాది లక్షా నలభై వేల రూపాయల అమ్మకాలు జరిగితే, తర్వాత ఏడాది రూ.12లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఈ ఏడాది రూ.6కోట్ల దాకా అమ్మకాలు జరగొచ్చని ప్రియాషా అంచనా. తాజాగా షార్క్‌ ట్యాంక్‌ సీజన్‌ 4లోనూ కనిపించి, రూ.60లక్షల ఫండ్‌నూ అందుకుంది. ఈ స్టార్టప్‌  ఉద్యోగుల్లో 80శాతం మంది మహిళలే కావటం విశేషం. ‘నాకు తీపంటే చాలా ఇష్టం. అదే ఈ రోజు నా కెరియర్‌గా మారింది. మేము పాటించే నో షుగర్‌, నో ప్రిజర్వేటివ్స్‌ విధానం కూడా మా విజయానికి కారణం. భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత విస్తరించటమే నా ధ్యేయం’ అంటోంది ప్రియాషా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్