రోజంతా నడిచి... కిలిమంజారోను అధిరోహించి..!

ప్రకృతిపై ప్రేమ.. చదువుకున్నప్పుడు చేసిన అటవీప్రాంత పర్యటనలు... ఆమె మనసులో చెరగని ముద్ర వేశాయి. దేశసేవ చేయాలనే కల ఆమెను సివిల్స్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరేలా చేసింది. కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణిగా విధులు నిర్వర్తిస్తూ... పర్వతారోహణపై ఆసక్తితో ఆఫ్రికాలో అతి ఎత్తైన కిలిమంజారో అధిరోహించారామె.

Published : 25 Mar 2024 01:37 IST

ప్రకృతిపై ప్రేమ.. చదువుకున్నప్పుడు చేసిన అటవీప్రాంత పర్యటనలు... ఆమె మనసులో చెరగని ముద్ర వేశాయి. దేశసేవ చేయాలనే కల ఆమెను సివిల్స్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరేలా చేసింది. కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిణిగా విధులు నిర్వర్తిస్తూ... పర్వతారోహణపై ఆసక్తితో ఆఫ్రికాలో అతి ఎత్తైన కిలిమంజారో అధిరోహించారామె. తనలాంటి మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్‌.భరణి తన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారిలా...

మాది తమిళనాడులోని కోయంబత్తూరు. నాన్న సాథూర్‌ స్వామి ఆర్మీ ఆఫీసర్‌. అమ్మ పద్మ టీచర్‌. నాన్న ఉద్యోగరీత్యా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో నా చదువు కొనసాగింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌ టూర్‌కెళ్లాం. బేరిజమ్‌ లేక్‌ ప్రాంతంలో వారం రోజులు గడిపాం. ఆ దట్టమైన అటవీ ప్రాంతం, సరస్సులు, కొండలు నా మనసునెంతో ప్రభావితం చేశాయి. కొండలెక్కాలనే ఆసక్తి నాకు అప్పుడే మొదలైంది. అదే నన్ను పర్వతారోహణవైపు అడుగులేసేలా చేసింది. దాంతో కొండలున్న ప్రాంతాలకెళ్లినప్పుడల్లా పర్వతారోహణకు కావాల్సిన మెలకువలను నేర్చుకునేదాన్ని. చదువుతోపాటు క్రీడల్లోనూ చురుకుగా ఉంటూ... పరుగులోనూ పతకాలు సాధించా.

పట్టు వదలకుండా...

తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో బీఎస్సీ చేశా. ఎన్‌సీసీలో చేరి సీనియర్‌ అండర్‌ ఆఫీసర్‌ స్థాయికి చేరుకున్నా.  ఎన్‌సీసీ క్యాంపుల్లో భాగంగా పర్వతాలు, నదులు, మైదాన ప్రాంతాల సందర్శన సమయంలో మొక్కల సంరక్షణపై ఆసక్తి పెరిగింది. డిగ్రీ తరవాత ఎయిర్‌ఫోర్స్‌ లాజిస్టిక్‌ విభాగంలో ఉద్యోగం వచ్చింది. సివిల్స్‌ సాధించాలని దాన్ని వదులుకున్నా. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నరేంద్రన్‌తో పరిచయం ప్రేమగా మారి 2018లో వివాహం చేసుకున్నాం. 2019లో సివిల్స్‌కు ఎంపికై ఐఎఫ్‌ఎస్‌ సాధించా. ఆ సమయంలో నిండు గర్భిణిని. అందుకు నా కుటుంబమెంతో సహకరించింది.  ప్రసవమైన 24 రోజులకే సివిల్స్‌ ఇంటర్వ్యూకి హాజరై ఎంపికయ్యాను. డార్జిలింగ్‌లో 16 నెలలపాటు శిక్షణ తీసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సబ్‌ డీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టాను.

ప్రమాదకరమని తెలిసీ..!

ఉద్యోగంలో చేరినా, చిన్నప్పటి నుంచీ పర్వతారోహణపై ఉన్న మక్కువ పోలేదు. సబ్‌ డీఎఫ్‌ఓగా విధులు నిర్వర్తిస్తూనే గత ఏడాది మే నెలలో డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణశాఖ నిర్వహిస్తున్న హిమాలయన్‌ మౌంటనరీ ఇన్‌స్టిట్యూట్‌లో నెలరోజుల కోర్సు పూర్తి చేశా. తొలి ప్రయత్నంగా లద్దాఖ్‌లోని కాంగ్‌యాప్సే పర్వతారోహణ చేస్తుండగా, 6,200 మీటర్ల ఎత్తుకు చేరుకునేటప్పటికి వాతావరణం అనుకూలించలేదు. శిఖరాగ్రాన్ని చేరుకోగలిగే దూరం కొన్ని మీటర్లే ఉందన్నప్పుడు అధికారుల సూచనలు పాటించి వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తరవాత ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతారోహణలో 5,895 మీటర్ల ఎత్తును అధిరోహించేందుకు ఈ నెల 2న ప్రయాణం మొదలుపెట్టా. 7న ఉహురు పాయింట్‌కు చేరుకున్నా. 28 కిలోలకుపైగా బరువున్న బ్యాగును వీపుపై మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలపై అడుగులేయడం ఎంతో ప్రమాదకరమైన ప్రయాణమనీ... ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనీ తెలుసు. అయినాసరే, శిఖరాగ్రం చేరుకోవడానికి 24-26 గంటలపాటు ఆగకుండా ప్రయాణించా. శారీరకంగా మానసికంగా అలసిపోయినా పర్వతశిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది. అవరోధాలన్నింటినీ దాటి అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించగలిగా. నేను సాధించిన ఈ విజయం మహిళలందరికీ అంకితం. స్త్రీశక్తికి గుర్తుగా ఆ దేశ ప్రభుత్వం నుంచి ధ్రువపత్రం అందుకోవడం సంతోషంగా ఉంది. ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైనవాళ్లల్లో కిలిమంజారో పర్వతారోహణ చేసింది నేనొక్కదాన్నే కావడం గర్వంగా ఉంది. గతేడాది ఛండీగఢ్‌లో అటవీశాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో హైజôప్‌లో కాంస్య పతకాన్నీ అందుకున్నా. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇవన్నీ సాధించగలుగుతున్నానంటే మావారితో పాటు కుటుంబ సభ్యుల సహకారం ఎంతో!

మామిడిపల్లి రాజేష్‌, కాకినాడ


తొలి మహిళ

అన్నా చాందీ... దేశంలో మొదటి మహిళా న్యాయమూర్తిగా కేరళ హైకోర్టులో పనిచేశారు. త్రివేండ్రంలో జన్మించిన ఈమె అక్కడ ప్రభుత్వ కాలేజీ నుంచి న్యాయ పట్టా పొందారు. 1930లో ‘మిసెస్‌’ అనే పత్రికను స్థాపించి, మహిళా సమస్యలపై ఎన్నో కథనాలు రాశారీమె.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్