ఆమె తిట్లకు ఏడ్చేశా..!

జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు.. . దారిలోని ముళ్లూ, రాళ్లూ... దాటుకుని ముందడుగు వేయాల్సిందే...! అదే చేస్తున్నారు కృతి సనన్‌. నటిగా కెరియర్‌ని ఎంచుకున్నాక...ఎన్నో ఆటుపోట్లను చూశారు. జయాపజయాలను సమంగా తీసుకున్నారు. ఇది మాత్రమే భవిష్యత్తుకి భరోసా ఇవ్వదని... తన అభిరుచుల్నీ, సంపాదననూ వ్యాపార రంగంలోకి మళ్లిస్తున్నారు.

Published : 29 Mar 2024 02:19 IST

జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు.. . దారిలోని ముళ్లూ, రాళ్లూ... దాటుకుని ముందడుగు వేయాల్సిందే...! అదే చేస్తున్నారు కృతి సనన్‌. నటిగా కెరియర్‌ని ఎంచుకున్నాక...ఎన్నో ఆటుపోట్లను చూశారు. జయాపజయాలను సమంగా తీసుకున్నారు. ఇది మాత్రమే భవిష్యత్తుకి భరోసా ఇవ్వదని... తన అభిరుచుల్నీ, సంపాదననూ వ్యాపార రంగంలోకి మళ్లిస్తున్నారు. ఆ ప్రయత్నమే ఆమెను ‘ఫోర్బ్స్‌ సెల్ఫ్‌మేడ్‌ విమెన్‌’ జాబితాలోనూ స్థానం సంపాదించుకునేలా చేసింది. తాజాగా ‘క్రూ’ సినిమాతో అలరించనున్న సందర్భంగా కృతి గురించి...

సినీనేపథ్యం లేకపోయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కృతి సనన్‌. అయితే ఆ స్టార్‌డమ్‌ వెనక ఆమె కఠోర శ్రమ ఉంది. ‘చేసే పనిని ఇష్టపడితే అందులోని కష్టం మనపై ప్రభావం చూపదు. ఈ రోజు నేను స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగినా.. వ్యాపారవేత్తగా మారినా.. అన్నింటికీ ఇదే కారణం. నేను నా పనిని ప్రేమిస్తా’ అనే కృతి... పుట్టిపెరిగిందంతా దిల్లీలోనే. అక్కడే ఆర్కే పురంలోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్లో చదివారామె. నోయిడాలో ఉన్న జేపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చేశారు. వారిది మధ్యతరగతి కుటుంబం. వాళ్లమ్మ ప్రొఫెసర్‌. తండ్రి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిపెరిగిన కృతి నటి అవుతానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదట. అనుకోకుండా మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టి తరవాత యాక్టింగ్‌తో ప్రేమలో పడ్డానంటారు కృతి.

ఎన్నో అవమానాలు...

కృతి మోడలింగ్‌ కోసమే ముంబయికి  వచ్చినా... తరవాత సినిమాల్లో అవకాశాల కోసమూ ప్రయత్నించారు. అయితే, ఆమె అదృష్టమో ఏమో కానీ ఒకేసారి తెలుగులో వన్‌: నేనొక్కడినే, హిందీలో ‘హీరోపంతీ’ సినిమా అవకాశాలు ఒకేసారి వచ్చాయి. ‘ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టడం వల్లనేమో ఆరంభంలో కొంత ఒంటరితనాన్ని అనుభవించా. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే రెట్టింపు శ్రమించాలని అప్పుడే అర్థం చేసుకున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో అపజయాలు, అవమానాలు పలకరించాయి. అప్పుడు జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతుంది. కెరియర్‌ తొలినాళ్లవి. ర్యాంప్‌షోలో పాల్గొనడానికి లాన్‌లో క్యాట్‌వాక్‌ సాధన చేస్తున్నా. అకస్మాత్తుగా నేను వేసుకున్న హీల్స్‌ గడ్డిలో కూరుకుపోయాయి. కాస్త గందరగోళానికి గురై... మధ్యలోనే ఆగిపోయా. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసినామె అందరి ముందూ నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చా. ఆపై కొన్నాళ్లకి సినిమా అవకాశాలు వచ్చినా.. నెపోటిజంతో పలు చిత్రాల్లో అవకాశాలు కోల్పోయా. తరవాత గెలుపోటముల్ని సమంగా తీసుకున్నప్పుడు అవి మనల్ని కుంగదీయలేవనే విషయాన్ని అనుభవంతో అర్థం చేసుకున్నా. ఇప్పుడు వాటన్నింటినీ దాటి చాలా ముందుకు వచ్చేశా’ అనే కృతి తనకి ఎదురైన ఇబ్బందుల నుంచే పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకి సోపానాలు వేసుకున్నారామె. ‘బరేలీకి బర్ఫీ’లో అల్లరి అమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ 2021లో వచ్చిన ‘మిమీ’ సినిమాలో ధైర్యవంతురాలైన తల్లిగా మెప్పించింది. ఈ చిత్రానికి నేషనల్‌, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకోవడమే కాదు విమర్శకుల ప్రశంసలూ దక్కించుకోవడంతో ఆమె కెరియర్‌ మలుపు తిరిగింది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఓటీటీ వేదికగా పలు చిత్రాలనూ నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం కాజోల్‌తో కలిసి ‘దోపత్తి’లో నటించారు.

వ్యాపారంలోనూ రాణిస్తూ...

నటనలో సత్తా చాటుతూనే, అభిరుచుల్నీ, భవిష్యత్తుపై ఆశల్నీ నిర్మాణాత్మకంగా మలచుకుని వ్యాపారవేత్తగానూ మారారామె. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి, మరో ఆంత్రప్రెన్యూర్‌ వైశాలి గుప్తాతో కలిసి హైఫిన్‌ పేరుతో మరో స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ని తెచ్చారు. మరొకరైతే పెట్టుబడి పెట్టేసి వ్యాపార వ్యవహారాలు ప్రొఫెషనల్స్‌కు వదిలేసేవారు. కృతి అలా కాదు. తయారీ నుంచి క్వాలిటీ చెక్‌ వరకు ప్రతి విభాగాన్నీ పర్యవేక్షిస్తారు. తమ సంస్థ తయారుచేసే సౌందర్య సాధనాలనే వాడతారు. ఇది కాకుండా ‘మిస్‌ టేకెన్‌’ అనే ఫ్యాషన్‌ లేబుల్‌ కూడా ఉంది. కృతి తన సోదరి నూపూర్‌ సనన్‌తో కలిసి ‘బ్లూ బటర్‌ఫ్లై’ ఫిల్మ్స్‌ అనే ప్రొడక్షన్‌ హౌస్‌నూ ప్రారంభించారు. ‘ద ట్రైబ్‌’ పేర ఫ్యాషన్‌ బ్రాండ్‌ సృష్టించారు. అలాగే ట్రింగ్‌ అనే టెక్‌ స్టార్టప్‌లో ప్రధాన పెట్టుబడిదారు కూడా. 2019లో ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రెటీ-100 జాబితాలోనూ చోటు దక్కించుకుంది కృతి సనన్‌ కేవలం సినిమా నటిగానే కాదు... దేశంలోని కొన్ని అతిపెద్ద బ్రాండ్‌లకు అంబాసిడర్‌ కూడా. తాజాగా కృతి మహిళా నేపథ్య చిత్రం ‘క్రూ’లో కరీనా కపూర్‌, టబూలతో కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్