‘డెలివరీ’ అమ్మాయి వచ్చింది!

కాలు బయటపెట్టకుండానే కోరుకున్నవన్నీ గుమ్మం ముందుకొచ్చేస్తున్నాయి... అంతా ఆన్‌లైన్‌ మహిమ! ‘అరెరె మర్చిపోయానే’ అనుకున్నా, ‘అయిపోయిందే’ అని కంగారుపడుతున్నా నిమిషాల్లో తెచ్చిచ్చే సేవలూ బోలెడు.

Updated : 02 Apr 2024 06:56 IST

కాలు బయటపెట్టకుండానే కోరుకున్నవన్నీ గుమ్మం ముందుకొచ్చేస్తున్నాయి... అంతా ఆన్‌లైన్‌ మహిమ! ‘అరెరె మర్చిపోయానే’ అనుకున్నా, ‘అయిపోయిందే’ అని కంగారుపడుతున్నా నిమిషాల్లో తెచ్చిచ్చే సేవలూ బోలెడు. అయితే... ‘మేడమ్‌ మీ ఆర్డర్‌’ అంటూ ఎప్పుడూ మగ గొంతే ఎందుకు వినిపిస్తోంది? మహిళలు ఈ రంగంలో ఎందుకు లేరు అన్న సందేహం ఎప్పుడైనా వచ్చిందా? ‘డ్రైవింగ్‌ రావాలి కదా’ అన్న సమాధానం వద్దు... అందులోనూ అమ్మాయిలు ముందే ఉన్నారు. మరింకేంటి సమస్య అంటే...

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఉనికి ఎప్పుడో ప్రారంభమైనా... అత్యంత వేగంగా పుంజుకున్నది మాత్రం కొవిడ్‌ తర్వాతే. నిజానికి బయటకు వెళ్లే తీరిక లేకో, పిల్లలను వెంట తీసుకెళ్లే ఓపిక లేకో, తేలికనో, సమయం కలిసొస్తుందనో ఈ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటోందీ మన ఆడవాళ్లే. పైగా ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ను ఎంచుకుంటున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది కూడా. అలా పరోక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలకూ కారణమవుతున్నాం. అంత డిమాండ్‌ ఉన్న రంగంలో మన ఉనికి లేదేంటి అన్న సందేహమొద్దు. దేశవ్యాప్తంగా 80 వేలకు పైగా మహిళలు డెలివరీ సర్వీసుల్లో ఉన్నారు. కానీ మొత్తంగా చూస్తే 15శాతం మాత్రమే.

అవకాశాలతో...

‘ఏదైనా పనిని నిజాయతీగా, అత్యంత శ్రద్ధతో, పక్కాగా పూర్తిచేయగలిగేది మహిళలే. వీరున్న చోట ఉత్పాదకతా పెరుగుతుంది. ఒకదాని నుంచి మరొకదానికి మారాలన్న ఆలోచనా త్వరగా చేయరు. పైగా పని ప్రదేశంలో సమన్వయం రావాలంటే మహిళల పాత్రా ఉండాలి. అందుకే వీరి ప్రాధాన్యం ఏటా పెంచుతూ వెళ్లాలనుకుంటున్నాం’ సంస్థలు చెబుతున్న మాట ఇది. ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌ కేవలం మహిళలతో ప్లాంట్‌లను నిర్వహిస్తోంది. అమెజాన్‌ ఉత్తర భారతదేశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘ఆల్‌ విమెన్‌ డెలివరీ స్టేషన్‌’లను ప్రారంభించింది. మహీంద్రా లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ ‘డైవర్సిటీ- ఈక్విటీ- ఇన్‌క్లూజన్‌’ సూత్రంగా తన ఈ-బైక్‌ డెలివరీల బాధ్యతలో అమ్మాయిలను భాగస్వాములను చేసింది. ‘సాఫ్ట్‌ స్కిల్స్‌లో అమ్మాయిలది అందెవేసిన చేయి. మృదువుగా మాట్లాడుతూనే అవతలివాళ్లను ఒప్పించేలా చేయడం వీరి నైపుణ్యం. ఇక ఓపిక సంగతి సరేసరి. అందుకే వీళ్లకీ అవకాశం’ అంటోందీ సంస్థ. జిప్‌ ఎలక్ట్రిక్‌ అయితే సమాన అవకాశాలను ఇస్తోంది. వారి శిక్షణ బాధ్యతనీ సంస్థే తీసుకుంది. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, షాడోఫాక్స్‌... ఇలా చెప్పుకొంటూ వెళితే జాబితా పెద్దదే! నైట్‌ షిఫ్ట్‌ల్లో పనిచేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి.

మరి... రక్షణ మాటేంటి?

ఆడవాళ్లు... పైగా వేళకాని వేళల్లో పనిచేయాల్సి రావొచ్చు. అది ఎంతవరకూ సురక్షితమన్న ప్రశ్న తలెత్తడం సహజమే! అందుకే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు యాంటీ సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ పాలసీలు తీసుకొచ్చాయి. కొన్నిసంస్థలైతే రాత్రివేళ రవాణా, లైవ్‌ మానిటరింగ్‌, ట్రాకింగ్‌ సిస్టమ్‌ సౌకర్యాలతోపాటు స్వీయరక్షణ, రోడ్‌ సేఫ్టీ, లైంగిక వేధింపులను ఎదుర్కోవడం వంటివాటిపై ప్రత్యేక శిక్షణనీ ఇస్తున్నాయి. వేర్‌హౌజ్‌ల్లో, లావాదేవీలు నిర్వహించే రెస్టరంట్లు, హోటళ్లలో తమ ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా వాష్‌రూమ్‌ సౌకర్యాన్నీ కల్పిస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో నెలవారీ ‘పీరియడ్‌ లీవ్‌’నీ ఇస్తున్నాయి. నిర్ణీత వేళల్లో పనిచేసుకునే వీలును కొన్ని సంస్థలు కల్పిస్తోంటే... నడపడం వచ్చి వాహనం, లైసెన్సులు లేని వారికీ కొన్ని సంస్థలు సాయం చేస్తున్నాయి. జిప్‌ తమ వద్దే అద్దెకు తీసుకునే అవకాశమిస్తే... ఫుడ్‌ డెలివరీ సంస్థలు దగ్గరి దూరాలకు సైకిల్‌ మీదైనా డెలివరీ ఇచ్చే అవకాశమిస్తున్నాయి. సంప్రదాయాలకు విలువనిచ్చే వారికి అనుగుణంగా సౌకర్యవంతమైన దుస్తుల్లో ‘యూనిఫాం’ డిజైన్‌ చేస్తున్నాయి. తాజాగా జొమాటో కుర్తీల రూపంలో యూనిఫాం డిజైన్‌ చేసి మన్ననలు అందుకుంది కూడా! మోవో, మోవోఫ్లీట్‌ వంటి సంస్థలు ఉచితంగా డ్రైవింగ్‌ నేర్పడమే కాదు, ఆసక్తి ఉన్నవారికి రక్షణతో కూడిన పని ప్రదేశాలనూ చూపిస్తున్నాయి. ఇక ‘ఇన్‌స్టంట్‌’ డెలివరీలకూ సంస్థలు మహిళలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఏకంగా ఆ శాతం 30-35 వరకు ఉంటోంది. సమాన వేతనాలు,  సౌకర్యాలపైనా సంస్థలు దృష్టిపెడుతున్నాయి. అంటే అవకాశాలు, సదుపాయాలు బాగానే ఉన్నాయి. అందుకోవడమే మన వంతు అన్నమాట!


రుచి చూడటంలో...

వంటలు చేసే సంగతెలా ఉన్నా రుచి చూడడంలో మాత్రం మనకు మనమే సాటి అని యేల్‌ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా నలుగురిలో ఒక్కరే రకరకాల రుచుల్ని స్పష్టంగా పసిగడతారట.

అలాంటి వారు మహిళల్లో 35శాతం ఉంటే, పురుషుల్లో 15శాతం మాత్రమే ఉన్నారని ఈ అధ్యయనం చెబుతోంది. అందులోనూ గర్భధారణ సమయంలో రుచి మరింత స్పష్టంగా తెలుస్తుందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్