బంగారంతోనూ.... తేనీరు!

మనలో చాలామంది ఉదయాన్నే...పొగలు కక్కే టీ గొంతులో పడనిదే దినచర్య మొదలుపెట్టరు. మరి, దీన్ని మీకెన్ని రకాలుగా చేయొచ్చో తెలుసా? ఆయుర్వేదంలో చెప్పిన ఆకులూ, పూలూ, బెరడూ, మూలికలతో చేసిన టీల గురించి ఎప్పుడైనా విన్నారా? లేదంటే గుజరాత్‌కి చెందిన శేజల్‌ పురోహిత్‌ ‘సెవన్‌ స్ప్రింగ్‌’ పేరుతో మొదలుపెట్టిన తేనీటి ప్రయాణం గురించి తెలుసుకోవాల్సిందే.

Updated : 03 Apr 2024 03:56 IST

మనలో చాలామంది ఉదయాన్నే...పొగలు కక్కే టీ గొంతులో పడనిదే దినచర్య మొదలుపెట్టరు. మరి, దీన్ని మీకెన్ని రకాలుగా చేయొచ్చో తెలుసా? ఆయుర్వేదంలో చెప్పిన ఆకులూ, పూలూ, బెరడూ, మూలికలతో చేసిన టీల గురించి ఎప్పుడైనా విన్నారా? లేదంటే గుజరాత్‌కి చెందిన శేజల్‌ పురోహిత్‌ ‘సెవన్‌ స్ప్రింగ్‌’ పేరుతో మొదలుపెట్టిన తేనీటి ప్రయాణం గురించి తెలుసుకోవాల్సిందే.

శేజల్‌ది గుజరాత్‌. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ స్పెషలైజేషన్‌తో స్కాట్‌లాండ్‌లోని ప్రఖ్యాత స్ట్రాత్‌క్లైడ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారామె. టీ వ్యాపారంలోకి అడుగుపెట్టకముందు మోర్గాన్‌ స్టాన్లీ,   బార్క్లేస్‌, నేషనల్‌ ఆస్ట్రేలియన్‌ బ్యాంక్‌ గ్రూప్‌, మోనార్క్‌ నెట్‌వర్క్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ వంటి ప్రముఖ సంస్థల్లో పదేళ్ల పాటు పనిచేశారు. శేజల్‌ వృత్తిరీత్యా ఆర్థిక రంగంలో ఉన్నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రెండింటినీ ఒకతాటిపై నడిపించే కొత్త ఆలోచనతో బిజినెస్‌లోకి అడుగుపెట్టాలనుకున్నారు.

బరువు తగ్గించుకోవాలని...

తనకి ఇరవై ఏళ్లు ఉన్నప్పటి నుంచే అమ్మమ్మని స్ఫూర్తిగా తీసుకుని సాత్వికాహారం తీసుకోవడం ప్రారంభించారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడంతో తరవాత దాన్ని తగ్గించుకునేందుకు హెర్బల్‌ టీలను తాగడం మొదలుపెట్టారు. అవి బరువుని తగ్గించడంతో పాటు ఇతర అనారోగ్యాల్నీ అదుపు చేయడం గుర్తించి వీటి ప్రత్యేకత అందరికీ తెలపాలనుకున్నారు. బాబు చిన్నోడైనా సరే... వాడి బాధ్యతలు చూసుకుంటూనే మామ్‌ప్రెన్యూర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఇందుకోసం ముందు ప్రపంచవ్యాప్తంగా ఔషధ లక్షణాలున్న వివిధ రకాల ఉత్పత్తులను సేకరించారు. వాటిని వివిధ దశల్లో పరిశోధించారు. మరో పక్క వేదాలు, ఆయుర్వేద శాస్త్రాల్లో ప్రస్తావించిన హెర్బల్‌, ఫ్లవర్‌, గ్రీన్‌ టీ సమ్మేళనాలతో 2020 అక్టోబరులో ‘సెవన్‌ స్ప్రింగ్‌’ని స్థాపించారు. ఫ్లేవర్డ్‌(ఇన్‌ఫ్యూజ్డ్‌) గ్రీన్‌, బ్లాక్‌ టీలతో పాటు పూల తేనీటిలో ఎన్నో రకాలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆపై 12 ప్రీమియం హ్యాండ్‌మేడ్‌ పదార్థాలతో 12 రకాల ఇన్‌ఫ్యూజ్డ్‌ టీలు తెచ్చారు. వీటిల్లో 24 క్యారెట్‌ గోల్డ్‌ టీ కూడా ఒకటి.

పెద్ద సంస్థలెన్నో...

ఆరంభంలో రిటైల్‌ మార్కెట్‌పై దృష్టిపెట్టి నిలదొక్కుకున్నాక... తరవాత బీ2బీ విధానంలోకి తీసుకెళ్లారు శేజల్‌. హోటల్‌, ఫార్మా రంగాల్లో ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యంగా నోవాటెల్‌, మారియెట్‌, అకార్‌...వంటి ఎన్నో సంస్థలు ఆమె ఖాతాదారులుగా ఉన్నాయి. ‘మా టీలు పూర్తిగా సేంద్రియమైనవీ, ఔషధ గుణాలున్నవీ. వీటి తయారీలో రంగులు, నూనెలు, ఎక్స్‌ట్రాక్ట్‌లు ఏవీ ఉపయోగించం’ అంటారామె. అంతేకాదు, వీటి ప్యాకేజింగ్‌కి ఉపయోగించే కవర్లు కూడా కంపోస్టబుల్‌ బయోడిగ్రేడబుల్‌ సాచెట్‌లో తీసుకొచ్చారు. ఈ విజయాలే శేజల్‌కి వెల్‌నెస్‌, ఆర్గానిక్‌ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉత్తమ కంపెనీ అవార్డులు, జీ20 సమ్మిట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాల్నీ తెచ్చిపెట్టాయి. ‘పరిస్థితులు ఎలా ఉన్నా...మీ మనసు చెప్పినట్లే చేయండి. అప్పుడే కొంత శ్రమించినా సంతోషంగా ఉండగలరు. అనుకున్న లక్ష్యాన్నీ చేరుకోగలరు’ అంటారు శేజల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్