ఆ ఫోన్‌కాల్‌ను... లక్షలమంది చూశారు!

హైదరాబాద్‌లో ఉంటున్న రిషికి అమెరికా అక్క ఫోన్‌ నుంచి ‘తమ్మూ.. కొంత డబ్బు అవసరం. వెంటనే పంపించగలవా’ అంటూ మెసేజ్‌. తనను ప్రేమగా తమ్మూ అని పిలిచే అక్కకేదో అత్యవసరం వచ్చిందనుకున్నాడు రిషి. ఇదే మెసేజ్‌ ఆమె కజిన్స్‌ మరో ముగ్గురికీ వచ్చింది. పైగా క్షణాల్లో నగదు పంపించమని ఒత్తిడి చేయడం రిషికి అనుమానాన్ని కలిగించాయి.

Published : 05 Apr 2024 13:57 IST

హైదరాబాద్‌లో ఉంటున్న రిషికి అమెరికా అక్క ఫోన్‌ నుంచి ‘తమ్మూ.. కొంత డబ్బు అవసరం. వెంటనే పంపించగలవా’ అంటూ మెసేజ్‌. తనను ప్రేమగా తమ్మూ అని పిలిచే అక్కకేదో అత్యవసరం వచ్చిందనుకున్నాడు రిషి. ఇదే మెసేజ్‌ ఆమె కజిన్స్‌ మరో ముగ్గురికీ వచ్చింది. పైగా క్షణాల్లో నగదు పంపించమని ఒత్తిడి చేయడం రిషికి అనుమానాన్ని కలిగించాయి. అక్క ఫొటో ఉన్నా, ఆమె కాకపోవచ్చనే ఆలోచన రావడమే తరువాయి... ‘ఎవరు నువ్వ’ని మెసేజ్‌ పెట్టాడు. అంతే... మెసేజ్‌లన్నీ క్షణంలో మాయం.

ఇటువంటి సంఘటనలు రోజూ వందల సంఖ్యలో ఎందరికో ఎదురవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఈ మోసాలను గుర్తించి తమవరకే ఆగిపోతారు చాలామంది. అలాకాకుండా ఇలాంటి ఫ్రాడ్‌ కాల్స్‌పై మరికొందరికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందని దిల్లీకి చెందిన చరణ్‌జీత్‌ కౌర్‌ తెలియజెప్పింది.

ఆమెకు ఇద్దరు పోలీసు అధికారులున్న ప్రొఫైల్‌ ఫొటోతో వాట్సప్‌  కాల్‌ వచ్చింది. ఎందుకో అనుమానంగా అనిపించింది. కచ్చితంగా అది ఫ్రాడ్‌ కాల్‌ అయి ఉంటుందనుకుంది. వాళ్ల మోసమేంటో తెలుసుకుందామని సంభాషణ కొనసాగించింది.

‘అవతలి వ్యక్తి: మాట్లాడేది చరణ్‌జీత్‌ కౌర్‌ ..?
చరణ్‌జీత్‌: తను నా సోదరి.

అవతలి వ్యక్తి: ఎక్కడకెళ్లింది ?
చరణ్‌జీత్‌: పనిమీద బయటకెళ్లింది.

అవతలి వ్యక్తి: మేం దిల్లీ పోలీసు అధికారులం మాట్లాడుతున్నాం. మీ సోదరిని అరెస్టు చేశాం.
చరణ్‌జీత్‌: ఎందుకు?

అవతలి వ్యక్తి: ఒక మంత్రి కొడుకును తను బ్లాక్‌మెయిల్‌ చేసింది. అందుకే అరెస్టు చేశాం. మీడియా ఎదుట పెట్టి వీడియో తీస్తే అందరికీ ఆమె గురించి తెలిసిపోతుంది. అలాకాకుండా మీరు ఎవరికైనా ఫోన్‌ చేసి ఈ విషయం చెబితే పోలీసుల టార్చర్‌ అనుభవించాల్సి ఉంటుంది.
చరణ్‌జీత్‌: నా సోదరితో మాట్లాడించగలరా...

అవతలి వ్యక్తి: వీలుకాదు. ఇక్కడి నుంచి ఆమెను తీసుకెళతాం.
చరణ్‌జీత్‌: అయితే ఇప్పుడు నేనేం చేయాలి?

అవతలి వ్యక్తి: మీరిక్కడకు రావడానికంటే ముందు రూ.20వేలు ఆన్‌లైన్‌లో పంపించాలి. అప్పటివరకు మీ సోదరి ఇక్కడే ఉంటుంది. ఈ విషయం బయటకు  చెప్పడానికి ప్రయత్నించొద్దు.
చరణ్‌జీత్‌: మీరు అరెస్టు చేశామని చెబుతున్న చరణ్‌జీత్‌కౌర్‌ను నేనే. మీరెలా అరెస్టు చేయగలరు, చెప్పు దెబ్బలు తింటారు.

ఇలా ఆమె గట్టిగా అనడంతో అవతలివ్యక్తులు కాల్‌ కట్‌ చేశారు. ఇదొక స్కామ్‌ కాల్‌ అని ముందుగా అనుమానించడంతో తమ మధ్య జరిగిన ఈ సంభాషణనంతా వేరే ఫోన్‌లో వీడియోగానూ... రికార్డు చేసి తన ఇన్‌స్టాలో చరణ్‌ పొందుపరిచింది. దీంతో ఇటువంటి మోసాలపై అందరిలో అవగాహన తేవాలనుకుందీమె. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 93 లక్షలమందికిపైగా దీన్ని వీక్షించడమే కాకుండా చరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కొందరైతే తాము మోసపోయిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంటే, మరికొందరు తాము మోసపోబోయి తప్పించుకున్న సంఘటనలను చెబుతున్నారు. స్కామ్‌ కాల్స్‌ను గుర్తించేలా ఫోన్‌లో యాప్‌ పొందుపరుచుకుంటే ఇటువంటివాటిని ముందుగానే కట్‌ చేయొచ్చు. మరి మీరూ అప్రమత్తంగా ఉంటారు కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్