ఆ పాటకి ఆస్కార్‌ గుర్తింపు!

ఎవరికీ తల వంచని యువరాణి ఆమె. కానీ ప్రేమకి దాసోహమంది. దాన్ని దక్కించుకోవడానికి ఎన్నో అవరోధాలు. అయినా వాటికి బెదరక తన ప్రేమను అందరి ముందూ వ్యక్తం చేస్తుంది.

Published : 06 Apr 2024 02:05 IST

వరికీ తల వంచని యువరాణి ఆమె. కానీ ప్రేమకి దాసోహమంది. దాన్ని దక్కించుకోవడానికి ఎన్నో అవరోధాలు. అయినా వాటికి బెదరక తన ప్రేమను అందరి ముందూ వ్యక్తం చేస్తుంది. అందమైన నృత్యంతో ప్రేమించిన వాడి ముందు తన మనసుని ధైర్యంగా ప్రదర్శిస్తుంది. ఆ నృత్యానికి అతనే కాదు, చూపరులూ దాసోహమవుతారు. ‘బాజీరావ్‌ మస్తానీ’ సినిమాలో ‘దివానీ మస్తానీ’ పాట చూసినవారికి ఈ సీన్‌ తప్పక గుర్తొస్తుంది. ‘మస్తానీ’ పాత్రలో అంతగా ఒదిగిపోయింది దీపిక పదుకోణ్‌. ప్రేక్షకులూ ఆమె నటనకు, నృత్యానికి ఫిదా అయ్యారు. అందుకే దీపిక ఐకానిక్‌ పాత్రల్లో ఒకటిగా ‘మస్తానీ’ని చెబుతారు. తాజాగా ఆ నటనకు ఆస్కార్‌ గుర్తింపు దక్కింది. దీపిక నృత్యం చేసిన ‘దివానీ మస్తానీ’ పాటను పొగుడుతూ ఆస్కార్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆ వీడియోని పోస్ట్‌ చేసింది. ఇది చూసి దేశవ్యాప్తంగా సినీ అభిమానులు భారతీయ సినిమాకు, నటనకు దక్కిన గుర్తింపుగా అభివర్ణిస్తున్నారు. మరాఠీ, కవ్వాలీ మేళవింపులో సాగే ఈ పాటకు కథక్‌, కాంటెంపరరీ విధానాల్లో నృత్యరీతులు తీర్చిదిద్దారు. ఆ పాటలో దీపిక వేసుకున్న దుస్తుల కోసం ఆరు నెలలు పరిశోధన సాగింది. పేష్వా మహిళలు ధరించే భారీ వస్త్రాలు కాదని చివరికి తక్కువ బరువుతో లెహెంగా తీర్చిదిద్దారు. భారీతనం తీసుకురావడానికి గోటాపట్టీని వాడారు. కానీ తన ఆభరణాలు, టోపీ, కవచాల బరువు మాత్రం కొన్ని కేజీలు. చేతిలో లూట్‌ (వీణ లాంటి) వాద్యం. కళ్లలో ప్రేమ, ముఖంలో సమాజాన్ని పట్టించుకోని ధైర్యం వంటి అనేక భావాలను ప్రకటిస్తూనే చేతిలో వాద్యంతో అందమైన నృత్యంతో కట్టిపడేసింది దీపిక. దాదాపు ఆరు నిమిషాలపాటు సాగే పాటకోసం పదిరోజులు చిత్రీకరణ సాగింది. దీనికోసం ప్రత్యేకంగా కథక్‌నీ నేర్చుకుందామె. మరి అంతటి కష్టానికి అంతర్జాతీయ సంస్థ గుర్తింపు దక్కడం గొప్పేగా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్