ఔరా... నీరా పంచదార!

తాటి, ఈత, కొబ్బరి, జీలుగు... వంటి చెట్ల నుంచి కల్లు తీస్తారని తెలిసిందే. కానీ, దానికంటే ముందు సేకరించే నీరా గురించి ఎప్పుడైనా విన్నారా? ఔషధ ప్రయోజనాలెన్నో పుష్కలంగా ఉండే ఈ ద్రవం నుంచి సేంద్రియ విధానంలో చక్కెర తయారు చేస్తోంది యువ ఇంజినీర్‌ శ్రియ నేరెళ్ల.

Updated : 11 Apr 2024 06:40 IST

తాటి, ఈత, కొబ్బరి, జీలుగు... వంటి చెట్ల నుంచి కల్లు తీస్తారని తెలిసిందే. కానీ, దానికంటే ముందు సేకరించే నీరా గురించి ఎప్పుడైనా విన్నారా? ఔషధ ప్రయోజనాలెన్నో పుష్కలంగా ఉండే ఈ ద్రవం నుంచి సేంద్రియ విధానంలో చక్కెర తయారు చేస్తోంది యువ ఇంజినీర్‌ శ్రియ నేరెళ్ల. ‘కానుక’ పేరుతో వాటిని మార్కెట్లోకీ తెచ్చింది. ఆ వివరాలను వసుంధరతో ముచ్చటించిందిలా...

చూసేందుకు కొబ్బరినీళ్లనూ, రుచిలో ముంజెలనూ గుర్తుతెచ్చే నీరా గురించి చాలా తక్కువమందికే తెలుసు. తాటి, ఈత వంటి చెట్ల నుంచి కల్లుగా మారడానికంటే ముందే తీయని నీరాని సూర్యోదయానికి ముందే సేకరించి, తాగుతారు. అప్పటికప్పుడు తాగే ఇందులో ఆల్కహాల్‌ ఉండదు. మత్తు అసలే రాదు. కానీ, పోషకాలు, ఔషధ గుణాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఈ విషయమే దీంతో ఏదైనా వ్యాపారం చేయొచ్చనే ఆలోచనకు స్ఫూర్తినిచ్చింది. దీనిపై కాస్త పరిశోధన చేస్తే... మరెన్నో కొత్త విషయాలు తెలిశాయి. అందులో ముఖ్యంగా కేరళ మినహా దక్షిణ భారతదేశంలో ఎక్కడా నీరాతో చక్కెర తయారు చేయడం లేదని తెలిసి నేనా ప్రయత్నం చేయాలనుకున్నా. మాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా. పదోతరగతి వరకూ అక్కడే చదువుకున్నా. వంశపారంపర్యంగా మా కుటుంబం కల్లు వ్యాపారం నిర్వహిస్తోంది. దీంతో చిన్నప్పటి నుంచీ నీరా గురించి తెలుసు. దీన్నుంచి తయారుచేసే బెల్లం మంచిదని ఇంట్లో వాళ్లు తినిపించడం నాకిప్పటికీ గుర్తే. తరవాత ఇంటర్మీడియట్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చేశా. ఆపై జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ఆర్ట్స్‌లో ఇంజినీరింగ్‌ చేశా. కాలేజీలో ఉన్నప్పుడు తోటి విద్యార్థులూ, సీనియర్లూ వేసిన బొమ్మలు, ఇతరత్రా కళాఖండాలను ప్రదర్శించేదాన్ని. అలా చదువుతో పాటు వ్యాపారమూ చేస్తూ ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి నెలకు రూ.30వేలు జీతంలా అందుకున్నా. ఇప్పుడూ ఆ పని చేస్తూ నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష సంపాదిస్తున్నాను.

పామ్‌ జాగరీలో పీజీ డిప్లొమా..

బీటెక్‌ పూర్తయ్యాక వ్యాపారం వైపే వెళ్దామని నిర్ణయించుకున్నా. పామ్‌ జాగరీ సబ్జెక్టులో పీజీ డిప్లొమా పూర్తి చేశా. నీరాతో బెల్లం కాకుండా చక్కెర తయారు చేద్దామని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. ఎక్కడైనా నీరాతో చక్కెర తయారు చేస్తున్నారా? అని శోధిస్తే.. కేరళలో కొబ్బరి పాలతో చక్కెర తయారు చేస్తున్నారని తెలుసుకున్నా. నీరాతో చక్కెర తయారు చేస్తే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందని నమ్మకం కలిగింది. 2021 నుంచి 2023 మార్చి వరకూ పీజీ డిప్లొమా చేశా. పలు పరిశ్రమలకు వెళ్లి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని సంపాదించుకున్నా. మరో పక్క శాస్త్రవేత్తల సాయంతో పలు పరిశోధనలూ నిర్వహించా. ఇవన్నీ విజయవంతం అయ్యాక మిగిలిన విషయాలపై దృష్టి సారించా. నీరా లభ్యత ఎక్కువగా ఉండే మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం అక్కడి స్థానిక గిరిజనులతో నీరా సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నా. ఇందుకు అవసరమైన పెట్టుబడిని ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.50లక్షల రుణం తీసుకున్నా. తల్లిదండ్రులు, స్నేహితులు మరో రూ.30లక్షలు సమకూర్చారు. సీపీసీఆర్‌ఐ వారు సాంకేతిక పరిజ్ఞానం అందించారు. ‘కానుక’ ఆర్గానిక్స్‌ పేరుతో గతేడాది పామ్‌ షుగర్‌ని తీసుకొచ్చాం. దీనిపై ప్రజల్లోనూ అవగాహన రావాలన్న ఆలోచనతో మొదట పాల్‌ఘర్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఈ చక్కెరను ప్రదర్శనకు ఉంచాం. తక్కువ కాలంలోనే  మహారాష్ట్రలోని రెండు ప్రముఖ ఆర్గానిక్‌ ఉత్పత్తుల సంస్థలు మా చక్కెరను తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, ఈ-కామర్స్‌ సంస్థలు విక్రయించేందుకు ముందుకు వచ్చాయి. నీరా చక్కెర తయారీపై పేటెంట్‌ హక్కులకు దరఖాస్తు చేసుకున్నా. దీనికి సమాంతరంగా బెల్లాన్నీ ఉత్పత్తి చేస్తున్నా. మరి ఈ ప్రయాణంలో కష్టనష్టాలేమీ లేవా అంటే... వ్యాపారమన్నాక ఎందుకుండవు. వాటిల్లో కొన్ని అనుభవంతో గట్టెక్కాల్సినవే. ప్రతిదానికీ భయపడి వెనకడుగు వేస్తే... ఏమీ సాధించలేం. ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకి ఆభరణం. అది గుర్తుంచుకుంటే విజయాలన్నీ మనవే.

బోరెల్లి సునీల్‌ కుమార్‌, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్