డిజిటల్‌ లాయరమ్మ

మనకుండే ప్రతి సమస్యకు న్యాయపరమైన సమాధానం ఉంటుందని తెలుసా? ఒక్కొక్కసారి మనకు తెలియకుండా చేసిన చిన్నచిన్న పనులకే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊహించగలమా.. ఇలాంటి విషయాలని ఇన్‌స్టా వేదికగా అందరికి తెలియజేస్తూ లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది నేహా దేవకతే.

Published : 12 Apr 2024 05:07 IST

మనకుండే ప్రతి సమస్యకు న్యాయపరమైన సమాధానం ఉంటుందని తెలుసా? ఒక్కొక్కసారి మనకు తెలియకుండా చేసిన చిన్నచిన్న పనులకే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఊహించగలమా.. ఇలాంటి విషయాలని ఇన్‌స్టా వేదికగా అందరికి తెలియజేస్తూ లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది నేహా దేవకతే. అసలీ ఆలోచన ఎందుకు, ఎలా వచ్చిందో చెప్పుకొచ్చిందిలా..

హైదరాబాదీ అమ్మాయిని. ఆడపిల్లకు చదువెందుకు? పెళ్లిచేసి ఒక అయ్య చేతిలో పెడితే చాలు అనుకునే వాళ్ల మధ్య పెరిగాను. కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచీ చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరిక. 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక సినిమా చూసి అందులో లాయర్‌లా నేనూ నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించాలని కలలు కన్నాను. అప్పటి నుంచి దాన్ని సాకారం చేసుకోవడానికే నా ప్రయత్నాలు అన్నీ. ఇంటర్‌ వరకు చదువు సాఫీగానే సాగింది. కానీ తర్వాత ఆర్థిక కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. చిన్నాచితకా పనులు చేస్తూ, స్నేహితుల సహాయంతో డిగ్రీ పూర్తి చేశా. ఎల్‌ఎల్‌బీ చదువుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. చదువు మధ్యలో ఆపేసి కాల్‌ సెంటర్‌లో రూ.6వేల జీతానికి పనిచేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఈ ఇబ్బందులు, అవాంతరాలే లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలను నాలో పెంచాయి. కూడబెట్టిన డబ్బులతో ఎమ్‌ఎస్‌ఎస్‌(మార్వాడీ శిక్షా సమితి) లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాను. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నా.

రీల్స్‌కి కారణం అదే..

కొవిడ్‌ సమయంలో నా స్నేహితుడు ఒకరు వాళ్ల అమ్మకు ఒంట్లో బాగోకపోతే మందులు తేవడానికి షాప్‌కి వెళ్లారు. పోలీసులు మధ్యలోనే ఆపేసి తాళాలు తీసుకుని బండిని స్వాధీనం చేసుకున్నారు. అతను కంగారు పడుతూ నాకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అనుమతి లేకుండా ప్రైవేట్‌ ఆస్తి అలా తీసుకెళ్లే హక్కు లేదు. అదే అతనికి చెప్పాను. ఇది చట్టానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం. అతనికే కాదు చాలామందికి ఇలాంటి విషయాలు తెలియవు. ఇదే అంశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ చేసి పెడితే లక్షల లైకులు, ఫాలోయర్లు వచ్చారు. ఇక అది మొదలు... ట్రాఫిక్‌ రూల్స్‌పై వీడియోలు చేయడం మొదలుపెట్టాను. ఫీజు కట్టలేదని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీల కోసం, మన పేరు మీద ఎన్ని సిమ్స్‌ తీసుకోవచ్చు? ఎన్ని వాడుకలో ఉన్నాయి, ఓయో రూమ్స్‌, ఆత్మహత్యా బెదిరింపులు లాంటి అనేక అంశాలపై వీడియోలు చేశాను. ఇవన్నీ ఇప్పుడు యువత ఎదుర్కొంటోన్న సమస్యలు. ఇవే సామాజిక మాధ్యమాల్లో లేడీ లాయర్‌గా నాకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. రీల్స్‌ చూసి తమ సమస్యలకు న్యాయ సలహాలు కోరిన గృహిణులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు చాలామందికి సహాయం చేశాను. ఏ విషయంలో కేసు వేయాలన్నా అమ్మో మా దగ్గర అంత సమయం లేదు, కోర్టుల చుట్టూ తిరగలేం, అంత ఖర్చుపెట్టలేం అంటూ పరిస్థితులతో రాజీపడుతున్నారు చాలామంది.  అలాంటి వారందరికీ భరోసా కావాలనుకున్నా. తక్కువ ఖర్చుతో న్యాయ సహాయాన్ని అందించడమే భవిష్యత్‌ లక్ష్యంగా పనిచేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్