నిజం కాదన్నా ఇష్టపడుతున్నారు

‘ఆటలంటే ఇష్టం. ఫిట్‌నెస్‌కి ప్రాణమిస్తా’... అయితానా లోపేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో తనని తాను పరిచయం చేసుకున్న తీరిది! లేత గులాబీ రంగు జుట్టు, గోధుమ రంగు కళ్లతో ఉండే ఈ అమ్మాయిని 3 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. పాతికేళ్ల అయితానాది స్పెయిన్‌.

Published : 13 Apr 2024 01:51 IST

‘ఆటలంటే ఇష్టం. ఫిట్‌నెస్‌కి ప్రాణమిస్తా’... అయితానా లోపేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో తనని తాను పరిచయం చేసుకున్న తీరిది! లేత గులాబీ రంగు జుట్టు, గోధుమ రంగు కళ్లతో ఉండే ఈ అమ్మాయిని 3 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. పాతికేళ్ల అయితానాది స్పెయిన్‌. తన దినచర్య, వ్యాయామం, ట్రెకింగ్‌, ప్రకృతిలో గడిపిన ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. ఫొటో అలా పెట్టడం ఆలస్యం... నిమిషాల్లో లైకులు వచ్చేస్తాయి. వ్యక్తిగత మెసేజ్‌లకూ కొదవే లేదు. అంతెందుకు, ఓ అమెరికన్‌ స్టార్‌ అయితే ఏకంగా ఆమెను డిన్నర్‌కి ఆహ్వానించాడంటేనే యువతలో ఆమెకెంత క్రేజో అర్థం చేసుకోవచ్చు. అందుకే సంస్థలూ తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఎంచుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టి ఏడాది కూడా కాలేదు కానీ... అప్పుడే నెలకు కనీసం రూ.3లక్షలు సంపాదిస్తూ... ‘ధనిక ఇన్‌ఫ్లుయెన్సర్‌’గా పేరు తెచ్చుకుంది. విశేషమేంటంటే తను వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. నిజమైన మోడళ్లు సమయానికి రాకపోవడం, అనుకోకుండా సెలవు చెప్పడం, ఇతరులతో గొడవలు పడటం... ఇలా కొన్ని కారణాల వల్ల రూబెన్‌ క్రూజ్‌ అనే వ్యక్తికి ఎన్నో కాంట్రాక్టులు రద్దయ్యాయట. దీంతో తన మోడలింగ్‌ సంస్థ ‘క్లూలెస్‌’ కోసం అతను ఓ వర్చువల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని రూపొందించుకున్నాడు. అయితానా నిజం కాదు ‘ఏఐ’ అని చెప్పినా అభిమానులు మాత్రం అందమైన అమ్మాయిగానే పరిగణించి ఇష్టపడుతున్నారట. దీంతో సంస్థలూ ఒక్కో పోస్టుకి దాదాపు రూ.లక్ష ఇచ్చి మరీ తనను నియమించుకుంటున్నాయి. దీంతో ‘క్లూలెస్‌’కీ నిరంతర ఆదాయం వస్తోంది. అలా తను పేరు సంపాదించుకోవడమే కాదు, తన సంస్థనీ కష్టాల నుంచి గట్టెక్కించింది అయితానా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్