వ్యవసాయాన్ని వ్యాపారంగా మలుస్తోంది...

మెట్రో నగరాల్లోని రెస్టరంట్లలో చైనీస్‌, జపనీస్‌... లాంటి విదేశీ రుచులు ఎన్నో దొరుకుతుంటాయి. కానీ మా తెగ వంటలెందుకు ఇక్కడ దొరకవు... అన్న ప్రశ్నే ఆమెను వ్యాపారవేత్తను చేసింది. ‘ఓపెన్‌ఫీల్డ్‌’ పేరుతో అగ్రో బిజినెస్‌ మొదలుపెట్టి తమ వంటలూ, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతూ ఏడాదికి రూ.50లక్షలకు పైగా టర్నోవర్‌నూ అందుకుంటోంది 33ఏళ్ల మనీషా ఓరాన్‌.

Updated : 13 Apr 2024 05:00 IST

మెట్రో నగరాల్లోని రెస్టరంట్లలో చైనీస్‌, జపనీస్‌... లాంటి విదేశీ రుచులు ఎన్నో దొరుకుతుంటాయి. కానీ మా తెగ వంటలెందుకు ఇక్కడ దొరకవు... అన్న ప్రశ్నే ఆమెను వ్యాపారవేత్తను చేసింది. ‘ఓపెన్‌ఫీల్డ్‌’ పేరుతో అగ్రో బిజినెస్‌ మొదలుపెట్టి తమ వంటలూ, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతూ ఏడాదికి రూ.50లక్షలకు పైగా టర్నోవర్‌నూ అందుకుంటోంది 33ఏళ్ల మనీషా ఓరాన్‌. ఎలా అంటే...

ఓవైపు రకరకాల వంటల ఘుమఘుమలు... మరోవైపు క్యాంప్‌ఫైర్‌ దగ్గర కాలక్షేపం చేసేవారు కొందరైతే, రాత్రిపూట నక్షత్రాలను చూస్తూ మైమరిచిపోయేవారు ఇంకొందరు...అలాగని అదేదో పెద్ద రిసార్ట్‌ కాదు. రాంచీ సరిహద్దులోని ఖాళీ పొలాలు. వీటన్నింటి వెనుక ఉన్నది మనీషా. ఆమెది ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ. తను డెంటల్‌ సర్జన్‌. గిరిజన అమ్మాయి. పైచదువుల కోసం నగరానికి వెళ్లినప్పుడు, తిందామంటే విదేశీ రుచులెన్నో దొరికాయి కానీ, వారి సంప్రదాయ వంటకాలు మాత్రం మచ్చుకైనా కనిపించలేదట. దాంతో వారి వంటలను అందరికీ పరిచయం చేయాలని 2018లో భర్త కుమార్‌ అభిషేక్‌ ఓరాన్‌, స్నేహితుడు ప్రతీక్‌ టొప్పోతో కలిసి ‘ఓపెన్‌ ఫీల్డ్‌’ పేరుతో బిజినెస్‌ మొదలుపెట్టింది. అందుకు ఝార్ఖండ్‌ స్టేట్‌ ట్రైబల్‌ కో- ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సబ్సిడీనీ ఇచ్చింది. ఖుంటి జిల్లాలోని ఘసిబరీ గ్రామంలో పదెకరాల పొలంలో ఫామ్‌స్టేలూ, వర్క్‌షాపులనూ ఏర్పాటుచేసి వందల మంది గ్రామస్థులను ఈ వ్యాపారంలో భాగం చేసింది. మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయడానికే కాదు...   కల్చరల్‌ అంబాసిడర్‌లగానూ గ్రామస్థులనే నియమించుకుంది.

సంప్రదాయానికి ఆధునికత జోడిస్తూ...

బ్రౌన్‌ రైస్‌, పనసపండు కూర, రాగి రొట్టెలు, ఫుట్‌కల్‌ చట్నీ, జామున్‌ ఖుఖరీ మష్రూమ్స్‌, వెజ్‌, నాన్‌ వెజ్‌ రకాలతో ‘కాంటెంపరరీ ట్రైబల్‌ క్యుజీన్‌’ తయారుచేస్తారిక్కడ. రాష్ట్రంలోనే అతి పెద్ద గులాబీల ఫామ్‌ కూడా ఇందులోనే ఉంది. ఫామ్‌స్టేకి వచ్చే సందర్శకులకు ఫామ్‌ టూర్‌నూ, స్థానిక కమ్యూనిటీను దగ్గర నుంచి చూసే అవకాశాన్నీ కల్పిస్తారు. రాత్రి క్యాంపింగ్‌లో భోజనం, బోన్‌ఫైర్‌, వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ‘శామ్‌ కీ పాఠశాల’ పేరుతో స్థానిక పిల్లలకు ఆర్థిక అంశాలు, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, సైన్సు, ఫొటోగ్రఫీ వంటి వాటిలో శిక్షణ ఇస్తోంది. కమ్యూనిటీలో ఉండే ప్రజలకు వర్షపు నీటిని ఆదా చేయడం, సేంద్రియ వ్యవసాయం, నర్సరీ మేనేజ్‌మెంట్‌ వంటి వాటిల్లోనూ అవగాహన కల్పిస్తోంది. ఇటీవలే ఈ వంటలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, రాంచీ ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులోనూ ప్రదర్శించింది. ప్రస్తుతం ‘ఓపెన్‌ఫీల్‌’్డ వార్షికాదాయం రూ.50లక్షలకు పైమాటే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్