ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!

వారిద్దరూ కవలలు... రూపమే కాదు... ఇద్దరి ఆలోచనలూ, అభిరుచులూ ఒకటే.  చదువుల్లో రాణిస్తే మాత్రమే సరిపోదనుకున్నారు. అందులో భాగంగానే అందరినీ ఆశ్చర్యపరిచే సాహసాలు చేయాలనుకున్నారు.

Updated : 16 Apr 2024 03:40 IST

వారిద్దరూ కవలలు... రూపమే కాదు... ఇద్దరి ఆలోచనలూ, అభిరుచులూ ఒకటే.  చదువుల్లో రాణిస్తే మాత్రమే సరిపోదనుకున్నారు. అందులో భాగంగానే అందరినీ ఆశ్చర్యపరిచే సాహసాలు చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే... ఎవరెస్ట్‌ సహా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన శిఖరాలతో పాటు రెండు ధ్రువాలపైనా కాలు మోపి అరుదైన ‘అడ్వెంచరస్‌ స్లామ్‌’ని పూర్తి చేశారు. గిన్నిస్‌లోనూ స్థానం సంపాదించారు. వారి గురించి తెలుసుకుందామా!

‘శిఖరం కన్నా... సంకల్ప బలమే గొప్పది’ అంటారు కవలలు తాషి, నుంగ్షి మాలిక్‌లు. ఆ నమ్మకంతోనే ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలు ఎక్కి...అందరితో ఔరా అనిపించుకున్నారు. వీరు హరియాణలోని సోనిపత్‌లో పుట్టారు. ఆర్మీ అధికారి అయిన తండ్రి కల్నల్‌ వీరేంద్ర సింగ్‌ మాలిక్‌ ఉద్యోగ రీత్యా... దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకున్నారు. ఇంటర్‌లో 90 శాతానికిపైగా మార్కులు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకి బయట ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నారు వీరేంద్ర సింగ్‌. అందుకోసం వారిని ఉత్తర కాశీలోని ‘నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌’లో చేర్చారు. అక్కడ శిక్షణ పూర్తయ్యాక హిమాచల్‌ ప్రదేశ్‌లోని రుదుగైర పర్వతాన్ని ఎక్కారు. ఆ అనుభవమే వాళ్లను పర్వతారోహణను ఎంచుకునేలా చేసింది. దీంతో ఎవరెస్ట్‌ ఎక్కాలనే నిర్ణయానికి వచ్చి... దూరవిద్య ద్వారా సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2010 నుంచి ఎవరెస్ట్‌ ఎక్కడానికి సన్నద్ధమైతే 2013లో తమ లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఆ ఘనత వీరిదే...

తరవాత రెండేళ్లకే ‘అడ్వెంచరస్‌ గ్రాండ్‌స్లామ్‌’ (ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలు, ఉత్తర, దక్షిణ ధ్రువాలపై కాలు మోపడం)’ పై దృష్టి సారించారీ ద్వయం. వీరు అధిరోహించిన పర్వతాల్లో 4,892 మీటర్ల ఎత్తులో ఉన్న విన్సన్‌ మాసిఫ్‌ ఒకటి. చాలామంది అసాధ్యంగా భావించే దీన్ని 2014లో ఈ అక్కాచెల్లెళ్లు అధిరోహించారు. వాటిల్లో కిలిమంజారో(దక్షిణాఫ్రికా, ఎవరెస్ట్‌(ఆసియా) ఎల్బ్రస్‌(యూరప్‌), అకాన్‌కాగువా(దక్షిణ అమెరికా), కార్స్టెన్జ్‌ పిరమిడ్‌(ఆస్ట్రేలియా, ఓషియానియా) మెకిన్లీ (ఉత్తర అమెరికా), విన్సన్‌ మాసిఫ్‌(అంటార్కిటికా) ఉన్నాయి. ఇవేకాక భారతదేశంలోని అనేక పర్వతాలు, హిమనీనదాలు(గ్లేసియర్స్‌) ఉన్నాయి. వీటిలో రుదుగైరాతో పాటు 21000 అడుగుల ఎత్తులో ఉన్న మరో హిమాలయ పర్వతాన్నీ ఎక్కేశారు. ఆపై దక్షిణ, ఉత్తర ధ్రువాలపైనా అడుగుపెట్టారు. ఈ ఘనత సాధించిన తొలి కవల సోదరీమణులుగా, మొట్టమొదటి సౌత్‌ ఏషియన్స్‌గా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు.

సవాళ్లెన్నో దాటి....

అనుకున్న లక్ష్యాన్ని చేరాక మరో కొత్త గమ్యం ఏర్పరచుకున్నారు. అందులో భాగంగానే స్విట్జర్లాండ్‌ టూరిజం బోర్డ్‌ చేపట్టిన ‘హండ్రెడ్‌ పర్సెంట్‌ విమెన్‌ పీక్‌ ఛాలెంజ్‌’లో భాగంగా ఆల్ఫ్స్‌ పర్వతాల్లోని ఎత్తైన శిఖరాలు మౌంట్‌ బ్రీథార్న్‌ (4164 మీటర్లు), అలాలిన్‌ హార్న్‌ (4027) అధిరోహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘పర్వతారోహణ అంత సులువేం కాదు... శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలమూ అవసరమే. ప్రతి శిఖరం విభిన్నమైనది. అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు...బలమైన గాలులు, మంచూ ఒకటేమిటి ఎన్నో ఇబ్బందులు... ఒక్కోసారి ఊహించని సమస్యలూ ఎదురవుతాయి. వాటన్నింటినీ ఏ మాత్రం తడబడకుండా దాటగలగాలి. అంటార్కిటికాలో చేసిన సాహస పర్వతారోహణ కఠినతరమైనది. ఈ సమయంలో పద్దెనిమిదిరోజుల ప్రయాణంలో 10 రోజులకు సరిపడా ఆహారం, వైద్య సామగ్రిని వెంట తీసుకెళ్లాల్సి వచ్చింది. వాటిని మోసుకుంటూ ఎక్కడం మరీ కష్టం. అయినా భయపడలేదు’ అంటారు ఆ ఇద్దరిలో ఒకరైన నుంగ్షి. ‘అమ్మాయిలు తలుచుకుంటే... జీవితంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ప్రయత్నించి చూడండి. గెలుపు మీదే అవుతుంది. అయితే, పర్వతారోహణ కష్టమే కాదు... ఖర్చుతో కూడుకున్నది కూడా. ఇందుకోసం వివిధ రాష్ట్రప్రభుత్వాలతో పాటు బిర్లా ట్రస్ట్‌, ఓఎన్‌జీసీ, టాటా ట్రస్ట్‌, మహీంద్రా గ్రూప్‌, స్నేహితులూ, బంధువులూ సాయం చేశారు. మా లక్ష్యాన్ని చేరుకునే స్థైర్యాన్ని అందించారు’ అంటారు తాషి. పర్వతారోహణలో రికార్డులు సృష్టిస్తోన్న ఈ అమ్మాయిలను భారత ప్రభుత్వం 2015లో ‘టెంజింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచరస్‌ అవార్డు’ తో సత్కరించింది. 2019లో ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. ఆపై ‘నారీ శక్తి పురస్కారం’ కూడా అందుకున్నారీ కవలలు.


మౌనం వీడదాం..!

గవారి కంటే మహిళలే ఎక్కువ అనారోగ్యాలకి గురవుతుంటారు. దీనికి అందరూ చెప్పే కారణం రోగనిరోధక శక్తి తక్కువని! కానీ.. అసలు కారణం... వారికి కోపం వచ్చినప్పుడు వ్యక్త పరచకుండా ఉండటం వల్లే అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు, జీవిత భాగస్వామితో గొడవ జరిగినప్పుడు మౌనంగా భరిస్తూ, కోపాన్ని దిగమింగుకున్న వారిలో  అనారోగ్య సమస్యలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే కోపం వచ్చినప్పుడు మౌనాన్ని వీడి ప్రశ్నించేద్దాం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్