తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు... కూతురు అగ్నివీర్‌!

కలలు కనడానికీ, వాటిని సాకారం చేసుకోవడానికీ కుటుంబ నేపథ్యం, పరిస్థితులూ అడ్డుకాదని నిరూపిస్తోంది మహారాష్ట్రకు చెందిన 20ఏళ్ల శ్వేతా పండిట్‌. పారిశుద్ధ్య కార్మికురాలి కూతురైన ఆమె దేశానికి సేవ చేయాలనుకుంది. తాజాగా అగ్నివీర్‌ క్యాడెట్‌గా ఎంపికై ఇండియన్‌ నేవీలో చేరాలనే తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది.

Published : 19 Apr 2024 01:58 IST

కలలు కనడానికీ, వాటిని సాకారం చేసుకోవడానికీ కుటుంబ నేపథ్యం, పరిస్థితులూ అడ్డుకాదని నిరూపిస్తోంది మహారాష్ట్రకు చెందిన 20ఏళ్ల శ్వేతా పండిట్‌. పారిశుద్ధ్య కార్మికురాలి కూతురైన ఆమె దేశానికి సేవ చేయాలనుకుంది. తాజాగా అగ్నివీర్‌ క్యాడెట్‌గా ఎంపికై ఇండియన్‌ నేవీలో చేరాలనే తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది...

శ్వేత హడప్సర్‌లోని సాధన గర్ల్స్‌ హైస్కూల్‌లో చదువుకుంది. ఆమె తల్లి జ్యోతి పుణెలోని వానౌరీలో ‘స్వచ్ఛ్‌’ కార్మికురాలు. 2013 నుంచి ఇందులో పనిచేస్తోన్న ఈమె రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేది. కానీ తన పిల్లలు మాత్రం పెద్ద స్థాయిలో ఉండాలని కలలు కనేది. తరచూ అమ్మ చెప్పే మాటలు శ్వేతలో ధైర్యాన్ని నింపాయి. ఇంటర్‌లో మరాఠీ నుంచి ఇంగ్లిష్‌ మీడియంకు మారడానికి చాలా ఇబ్బందిపడినా, కష్టపడి చదివి 78శాతం మార్కులతో పాసైంది. ఆ తరవాత దేశానికి సేవచేయాలనే లక్ష్యంతో అగ్నివీర్‌ పరీక్షకు సన్నద్ధమైంది. అయితే డబ్బు లేక ఆన్‌లైన్‌ ట్యుటోరియళ్లు చూసి చదువుకుంది శ్వేత. ఫిట్‌నెస్‌ కోసం రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి వాకింగ్‌, ఎక్సర్‌సైజులు చేసేది. ఆమె కష్టం ఫలించి అగ్నివీర్‌కు ఎంపికైంది.

ప్రస్తుతం ఒడిశాలోని ‘ఐఎన్‌ఎస్‌ చిల్కా’లో శిక్షణ తీసుకుంటోన్న శ్వేతకు ట్రైనింగ్‌ యూనిట్‌కు వెళ్లేటప్పుడు స్టేషనరీ వస్తువులు కొనుక్కోవడానికీ డబ్బు లేదట. చివరకు రైలు టికెట్‌ కూడా క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది. విషయం తెలిసి, స్వచ్ఛ్‌ సంస్థ ముందుకు వచ్చి కావాల్సిన వస్తువులు కొనిచ్చింది. ఆమె బంధువు ఒకరు విమాన టికెట్‌ను కొనిచ్చారు. ఒడిశాలో ఆరు నెలల శిక్షణ తర్వాత రెండు వారాల విరామంతో మరో ఆరోనెలల శిక్షణ దశ ఉంటుంది. ఆ తర్వాత ఆమె నైపుణ్యాలను బట్టి నేవీ పోస్టింగ్‌ ఉంటుంది. ‘మా అమ్మాయికి దేశ సేవ చేయాలనే కోరిక. పరీక్ష కోసం రోజూ ఉదయాన్నే లేచి 10గంటలపాటు చదివేది. తను అగ్నివీర్‌కు ఎంపికైనందుకు గర్వపడుతున్నా’ అంటోంది శ్వేత తల్లి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్