కేరళ కుట్టికి... ‘టీన్‌’ కిరీటం!

ప్రపంచదేశాల అందగత్తెలతో పోటీ పడిన కజియా లిజ్‌ మెజో ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా -2024’ గా నిలిచింది. కేరళకు చెందిన 17 ఏళ్ల ఈ మలయాళీ భామ ఈ పోటీలో 29మందిపై గెలిచి మరీ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

Updated : 21 Apr 2024 12:55 IST

ప్రపంచదేశాల అందగత్తెలతో పోటీ పడిన కజియా లిజ్‌ మెజో ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా -2024’ గా నిలిచింది. కేరళకు చెందిన 17 ఏళ్ల ఈ మలయాళీ భామ ఈ పోటీలో 29మందిపై గెలిచి మరీ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

కజియాది కేరళలోని కరిపుళ ప్రాంతం. తండ్రి అబ్రహం మెజో వ్యాపారి. తల్లి సుజా కు ఫ్యాషన్‌రంగంపై ఆసక్తి. దీంతో ఈమె పలు ఫ్యాషన్‌షోల్లో పాల్గొన్నారు. అలాగే తన కూతురు కజియాను కూడా ఆరేళ్లప్పుడే ఫ్యాషన్‌షో వేదికపై ర్యాంప్‌వాక్‌ చేయించారు. అబుదాబీలో ఇంటర్‌ పూర్తి చేసిన కజియాకు నటనారంగంపై ఆసక్తితో అందులోనూ శిక్షణ తీసుకుంది. ఓవైపు మోడల్‌గా చేస్తూనే, మరోవైపు సినిమారంగంలోనూ అడుగుపెట్టింది. మలయాళీ కథానాయకుడు మమ్ముట్టి నటించిన చిత్రం ‘షైలాక్‌’లో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మరో ఏడు సినిమాల్లో నటిస్తోంది. తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న కజియా ఫ్యాషన్‌రంగంతోపాటు అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని సాధించాలనే కలలు కంది.

అబుదాబీలోని ఓ ప్రైవేటు అకాడమీలో ట్రైనింగ్‌ తీసుకుంది. అలా తన 15వ ఏటనే ‘మిస్‌ ఇండియా ప్లానెట్‌ -2022’గా పోటీ చేసి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా-2024’ పోటీలకు హాజరైంది. ఇందులో ప్రపంచదేశాల్లోని వివిధ నగరాల నుంచి వచ్చిన 28మందితో పోటీ పడింది. చివరి రౌండ్‌ వరకు తనదైన ప్రతిభను ప్రదర్శించి కిరీటాన్ని దక్కించుకుంది. దీంతో దిల్లీలో ఈ ఏడాది జూన్‌ నుంచి జరుగనున్న ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌’ పోటీలకు భారతదేశం తరఫున పోటీ చేయడానికి అర్హత సాధించింది. ‘ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నా కుటుంబం, మెంటర్స్‌, శిక్షకుల ప్రోత్సాహం నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. దేశం తరఫున పోటీ చేయడానికి అర్హత సాధించగలిగా. నన్ను నేను ఎక్కువగా నమ్ముతాను. నేటి తరానికి ప్రతీకగా నిలిచి, అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా ఏదైనా సాధించాలనేదే నా లక్ష్యం’ అని చెప్పే కజియా కల న్యాయవాది కావాలని. సంప్రదాయ నృత్య కళాకారిణి, గాయని మాత్రమే కాకుండా ఈమె కరాటే ఛాంపియన్‌ కూడా. ఎన్జీవోలతో కలిసి పనిచేస్తూ పేదలకు ఉచితంగా భోజనాన్ని అందిస్తున్న కజియా ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌’ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్