ఆ బడిలో... రహస్యంగా చదువుకున్నా!

స్వేచ్ఛ, హక్కుల విలువ ఒక శరణార్థికంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తాయి? ఏళ్లపాటు కూటికోసం, గూటికోసం పరితపించిన ఓ శరణార్థి అమ్మాయి.. తనలాంటి వాళ్ల కష్టాలకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంది.

Updated : 19 May 2024 15:14 IST

స్వేచ్ఛ, హక్కుల విలువ ఒక శరణార్థికంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తాయి? ఏళ్లపాటు కూటికోసం, గూటికోసం పరితపించిన ఓ శరణార్థి అమ్మాయి.. తనలాంటి వాళ్ల కష్టాలకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంది. చదువు అనే అస్త్రంతో ఛాందసుల తలలు వంచాలని చూస్తోంది. అఫ్గానిస్తాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ లాయర్‌ అక్సానా సోల్టాన్‌ని ఫోర్బ్స్‌ తాజా 30 అండర్‌ 30 ఆసియా జాబితాలో చేర్చింది....

ఫ్గానిస్తాన్‌లోని మజర్‌-ఎ-షరీఫ్‌ ప్రాంతం మాది. మేం నలుగురం. ఇద్దరన్నయ్యలు, అక్క. నాన్న ఇంజినీర్‌. నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న రోజులవి. బయట తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోందని మారుతున్న మా ఇంటి వాతావరణమే చెబుతోంది. అన్నయ్యలు స్కూల్‌కి వెళ్తుంటే అక్క వాజ్మా, నేనూ వాళ్లకి క్యారేజీలు కట్టి ఇచ్చేవాళ్లం. నాకు ఏడేళ్ల వయసొచ్చేసరికి అమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. తనలా మా జీవితం కాకూడదనుకుంది. ఒక పాతసంచిలో కొన్ని పుస్తకాలు పెట్టింది. నాకు మా అన్నయ్య డ్రస్‌ వేసి.. భయంభయంగా ఒక చోటుకి తీసుకెళ్లింది. అండర్‌గ్రౌండ్‌లో.. నల్లటి కర్టెన్లతో ఉన్న ఆ చోటుని చూసి మొదట్లో భయం వేసింది. కాసేపటి తర్వాత నాలాంటి అమ్మాయిలు మరికొందరు కనిపించారు. అప్పటికికానీ నాకు అర్థం కాలేదు.. అదొక ఆడపిల్లల బడని. అక్కడ ఇద్దరు టీచర్లున్నారు. అందులో ఒకరు మా అమ్మ. ఈ రహస్య బడికి అక్క, నేను అన్నయ్యల దుస్తులు వేసుకుని అబ్బాయిల్లా వెళ్లేవాళ్లం. వేర్వేరు దారుల్లో... వేర్వేరు సమయాల్లో మాత్రమే వెళ్ళేవాళ్లం. అలా చేస్తే ఇద్దరిలో ఒక్కరైనా దక్కుతారని అమ్మ ఆశ. గడప దాటిన ప్రతిసారీ ‘ఆడపిల్లకు పుస్తకమే ఆయుధం’ అని ధైర్యం చెప్పి పంపించేది అమ్మ. నాతో సహా ఆ బడికి వచ్చే 50 మంది ఆడపిల్లలూ ప్రతి రోజూ ప్రాణాలు పణంగా పెట్టి వచ్చేవాళ్లం. కుర్చీలు, బల్లలు ఉండవు అక్కడ. అందరూ గుండ్రంగా కూర్చుని చప్పుడు చేయకుండా చదువుకొనేవాళ్లం. రోజులు గడుస్తున్న కొద్దీ తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. నాన్న జేబులో ఉన్న రెండు డాలర్ల డబ్బుతో మా కుటుంబం దేశం దాటింది.

శరణార్థిగా...

మొదట తజికిస్తాన్‌ శరణార్థి శిబిరంలో ఉన్నాం. అక్కడ తిండి లేదు, మందుల్లేవు, కరెంట్‌లేదు, చదువు అసలే లేదు. నా చుట్టూ ఉన్న క్యాంపుల్లో మాలాంటి పిల్లలు చనిపోవడం మొదట్లో భయంగా అనిపించినా, తరవాత సాధారణం అనిపించింది. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌ వెళ్లాం. కాస్త అటూ, ఇటూగా అక్కడా అదే పరిస్థితి. అమ్మకొచ్చిన కుట్టుపని మమ్మల్ని పస్తులుండకుండా అంతవరకూ కాపాడింది. నాన్న యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీలో మా కుటుంబాన్ని రిజిస్టర్‌ చేయించారు. దాంతో మా చదువులకు యునిసెఫ్‌ సాయం అందింది. అదే మా జీవితంలో వచ్చిన మంచి మార్పు. మాతో సహా మరో నలభై మందికి అమెరికాలో ఉండే అవకాశం వచ్చింది. 12 ఏళ్ల వయసులో రిచ్‌మండ్‌కి చేరుకున్నా. అక్కడ చదువుకుంటున్నా అన్నమాటేకానీ నా ఆలోచనల్లోంచి శరణార్థి జీవితం తాలూకు చేదు అనుభవాలు తొలగిపోలేదు. అందుకే 15 ఏళ్లకే ‘ఎన్‌హాన్సింగ్‌ చిల్ట్రన్స్‌ లైవ్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థని ప్రారంభించా. చదువుకోవాలని ఉన్నా వీలుకాని ఎంతోమంది ఆడపిల్లలకు కనీస విద్యావసరాలు తీర్చడం మా సంస్థ లక్ష్యం. అలా ఐరాస సాయంతో రిచ్‌మండ్, వర్జీనియా సహా  హైతీ, అఫ్గానిస్తాన్‌ వరకూ మా సేవలు విస్తరించాయి. చదువుకొనే ఆడపిల్లలకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, షూస్, స్టేషనరీ అందించేవాళ్లం. ఇక శరణార్థి పిల్లల కోసం అయితే... మా సంస్థ వాలంటీర్లు స్వయంగా క్యాంపులకే వెళ్లి ట్యూషన్లు చెబుతారు. వాల్‌మార్ట్‌ సాయంతో అఫ్గానిస్తాన్‌లో.. ఒక లైబ్రరీ, బుక్‌స్టోర్‌ ప్రారంభించా. ఈ ప్రయత్నం అక్కడ ఆరువేలమంది ఆడవాళ్లని చైతన్యవంతుల్ని చేసింది. వీరికి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు సౌరశక్తితో నడిచే టెక్నాలజీ వాడుకుంటున్నాం. ఈ పాఠాలతో ప్రపంచవ్యాప్తంగా మరెంతోమంది ఆడపిల్లలు అక్షర చైతన్యం పొందుతున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 2,500 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. తాలిబన్ల కారణంగా మహిళలుగా ఏ హక్కుల్ని కోల్పోయామో నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు? అందుకే  రిచ్‌మండ్‌లోని వర్జీనియా కామన్‌వెల్త్‌ యూనివర్సిటీలో... క్రిమినల్‌ జస్టిస్‌ చదివా. హ్యూమన్‌ రైట్స్‌ లాయర్‌గా పనిచేస్తున్నా. ప్రపంచానికి మా మహిళల గొంతుక వినిపించాలన్నదే నా లక్ష్యం. అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్నదాన్ని చూస్తూ ఉండిపోవడం నాకిష్టం లేదు. అందరి సహకారంతో అక్కడి పరిస్థితులని చక్కదిద్దాలన్నది నా ఆశయం.  


ఆహ్వానం

ఒకసారేమో ‘చిన్నపిల్లవి నీకేం తెలియ’దంటారు. మళ్లీ వాళ్లే ఇంకోసారి ‘పెద్దదానివి అయ్యావు ఆ మాత్రం తెలియదా’ అంటారు. టీనేజీ పిల్లలు ఎదుర్కొనే పరిస్థితే ఇది. తెలియని చిరాకు, కోపం, కొత్తగా పరిచయమయ్యే ఎమోషన్స్‌... ఎవరితో ఎలా పంచుకోవాలో, సందేహాలను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదా? వాటిని మాకు పంపండి. నిపుణుల ద్వారా
సలహాలు అందిస్తాం.

మా ఈ-మెయిల్‌: vasundhara@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్