అమ్మాయిని తీసుకొస్తేనే... ఓటు!

ఒకప్పుడు ఆడపిల్ల పుట్టకూడదనుకున్నారు. భ్రూణహత్యలకి తెగబడ్డారు. ఇప్పుడు... ఆ ఆడపిల్లలే లేక ఇబ్బంది పడుతున్నారు. మనదేశంలో ఈ పరిస్థితి చాలా చోట్ల ఉన్నా హరియాణాలో ‘బ్రహ్మచారుల ఓట్‌ బ్యాంకు’ రాజకీయ అంశమై కూర్చుంది.

Published : 05 Jun 2024 16:03 IST

ఒకప్పుడు ఆడపిల్ల పుట్టకూడదనుకున్నారు. భ్రూణహత్యలకి తెగబడ్డారు. ఇప్పుడు... ఆ ఆడపిల్లలే లేక ఇబ్బంది పడుతున్నారు. మనదేశంలో ఈ పరిస్థితి చాలా చోట్ల ఉన్నా హరియాణాలో ‘బ్రహ్మచారుల ఓట్‌ బ్యాంకు’ రాజకీయ అంశమై కూర్చుంది. తాజా ఎన్నికల్లో నాయకులు ఓట్లు అడగడానికి వెళ్తే బ్రహ్మచారులు ‘నో బ్రైడ్‌... నో బ్యాలెట్‌’ అంటూ నినదించారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు... సమస్త అవివాహిత్‌ పురుష్‌ సమాజ్, ఏకీకృత రండా యూనియన్‌కు చెందిన లక్షన్నర మంది పెళ్లికాని బ్రహ్మచారులు, ఒంటరి మగవాళ్లు ఓటు వేయం అని తెగేసి చెప్పేశారు. మా ఒంటరి మగవాళ్లకి మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి, మేం ఓట్‌ వేయం అంటున్నారు. ఇక్కడ ఈ సమస్యేం కొత్తగా వచ్చింది కాదు. 2014 ఎన్నికల్లోనూ ‘బహూ దిలావో ఓట్‌ పావో’ అంటూ’ నినదించారు. నలభైఏళ్లు పైబడ్డా బ్రహ్మచారులుగా మిగిలి పోయిన వాళ్లు హరియాణాలో సుమారు ఏడులక్షల మంది ఉన్నారట. దాంతో నాయకులకు బ్రహ్మచారుల ఓటు బ్యాంకుతో చిక్కొచ్చిపడుతోంది. ఉపాధి చూపించొచ్చు, ఉద్యోగాలివ్వొచ్చు... గ్యాస్‌ ధరలు తగ్గించొచ్చు... కానీ ఈ ముదురు బ్రహ్మచారులకు పిల్లనెలాతేవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కర్మ కమ్స్‌ బ్యాక్‌ అన్నట్టుగా... ఒకప్పుడు హరియాణా మొత్తం మీద ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యలకి పాల్పడేవారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదని కఠిన చట్టాలు తెస్తే... మొబైల్‌ వ్యాన్స్‌లో అల్ట్రాసౌండ్‌ మెషీన్స్‌నీ, పోర్టబుల్‌ అబార్షన్‌ కిట్లని తీసుకొచ్చి కడుపులోనే ఆడపిల్లల్ని చంపేశారు. దాని ఫలితమే ప్రతి వెయ్యి మంది మగవాళ్లకి 831 మంది ఆడపిల్లలు. బేటీ బచావో... బేటీ పడావో వంటి క్యాంపెయిన్ల తర్వాత ప్రజల్లో కాస్త మార్పు వచ్చి ఆడపిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చినా అక్కడి అబ్బాయిలకు పెళ్లికూతుళ్లు దొరకడం లేదు. దొరికినా అమ్మాయిలు చదువుకున్నవాళ్లకీ, స్థితిమంతులకీ ప్రాధాన్యం ఇస్తున్నారు. దాంతో చుట్టుపక్కల రాష్ట్రాలయిన బిహార్, బెంగాల్, ఒడిశా ప్రాంతాల నుంచి మూడేసి లక్షల రూపాయాలు ఎదురుకట్నం ఇచ్చి మరీ ఆడపిల్లల్ని తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకోలేని మగవాళ్ల పరిస్థితి మరీ ఘోరం. అటు పెళ్లికావడంలేదు సరికదా... వాళ్లకి ఇల్లు అద్దెకివ్వడానికి కూడా అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం పెళ్లికాని ప్రసాద్‌ అని పిలిచినట్టుగా హరియాణాలో ఇలాంటి వారిని ‘రండా’ అంటారు. ఇక యూట్యూబుల్లో అయితే వీళ్లపై వచ్చే మీమ్స్‌కీ, రీల్స్‌కీ లెక్కలేకుండా పోతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్