దెయ్యంలా ఉన్నావు... అనేవారు!

ముఖంపై చిన్న మొటిమ, మచ్చ వస్తే చాలు. ఆందోళన పడిపోతాం. దాని కోసం ఎన్నో చేస్తుంటాం. అటువంటిది ఈమెకు ఒళ్లంతా నల్లని మచ్చలే. ఆమెను చూసినప్పుడు కొందరు ‘బాబోయ్‌ దెయ్యంలా ఉన్నావ్‌’ అనేవారు.

Published : 08 Jun 2024 03:24 IST

ముఖంపై చిన్న మొటిమ, మచ్చ వస్తే చాలు. ఆందోళన పడిపోతాం. దాని కోసం ఎన్నో చేస్తుంటాం. అటువంటిది ఈమెకు ఒళ్లంతా నల్లని మచ్చలే. ఆమెను చూసినప్పుడు కొందరు ‘బాబోయ్‌ దెయ్యంలా ఉన్నావ్‌’ అనేవారు. మరికొందరైతే  ‘మనిషివా... మచ్చల జింకవా’ అంటూ మాటలతో బాధపెట్టేవారు. అయితే ఇవేవీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు.  వ్లాగర్‌గా మారి సామాజిక మాధ్యమాల్లో దీనిపై అవగాహన కలిగిస్తోంది.  తనలాంటి వారిలో ధైర్యాన్నీ నింపుతోంది బిస్మిత.

ఏ తల్లైనా గర్భిణిగా ఉన్నప్పుడు తనలాగే పిల్లలు పుట్టాలనుకుంటుంది. అయితే బిస్మిత తల్లి మజితా మాత్రం తనలాగ పుట్టకూడదని వేయి దేవుళ్లను మొక్కుకుంది. మజితాది తిరువనంతపురం. తల్లి నజీమా నుంచి జన్యుపరమైన చర్మ సమస్య మజితాకు సోకింది. అయితే తన పిల్లలకైనా ఈ సమస్య రాకూడదని కోరుకుంది. ఆమె ఎదురుచూసినట్లే పొత్తిళ్లలో చందమామలాంటి బిస్మితను చూసి మురిసిపోయింది. తన ప్రార్థన భగవంతుడు ఆలకించాడని సంతోషించింది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రెండు నెలలు నిండేసరికి పసిబిడ్డగా ఉన్న బిస్మిత ముఖంపై నెమ్మదిగా మచ్చలు రావడం మొదలయ్యాయి. పాప లేత చర్మంపై మచ్చల్ని చూసి ఆ తల్లి విలవిలలాడింది. కేరళలోని ఆసుపత్రులన్నీ తిరిగింది. జన్యుపరంగా వచ్చే చర్మ సమస్య, చికిత్స లేదని వైద్యులు చేతులెత్తేశారు. కూతురి జీవితం ఏమైపోతుందోనని ఆందోళనకు గురైంది.

టిక్‌టాక్‌ వీడియోలతో...

బిస్మిత మాత్రం తన తల్లిలా ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచీ అమ్మను చూస్తూ పెరిగిన ఆమెకు ఆ మచ్చలు పెద్ద సమస్య అనిపించలేదు. అందుకే మచ్చల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అయితే స్కూల్‌లో సహవిద్యార్థుల నుంచి చాలా హేళనలను ఎదుర్కొంది. అయినా పట్టుదలగా ఇంటర్‌ వరకూ చదివి, తర్వాత ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత టిక్‌టాక్‌ రీల్స్‌ చేయడానికి ప్రయత్నించేది. ‘నా పదేళ్ల వయసులో ఇంట్లో అమ్మానాన్న లేని సమయం చూసి, కత్తితో చర్మంపై మచ్చలను తొలగించడానికి ప్రయత్నించా, గాయమైంది. భయపడి మానేశా. ఈ మచ్చలు నేనున్నంతవరకు ఉంటాయని మెల్లగా నాకర్థమైంది. దాంతో నన్ను నేను యాక్సెప్ట్‌ చేసుకోవడం మొదలుపెట్టా. ఆ తర్వాత స్కూల్‌లో ఉత్సాహంగా పోటీలన్నింటిలో పాల్గొనేదాన్ని. పాటల పోటీల్లో విజేతను నేనే. నా గొంతు ఎంతో బాగుందని టీచర్లు ప్రశంసించేవారు. దీంతో నాకు సొంతంగా వీడియోలు తీయాలనే ఆలోచన వచ్చింది. అమ్మ కూడా ఓకే చెప్పడంతో 2019లో టిక్‌టాక్‌ వీడియోలు ప్రారంభించా. అయితే వాటికి ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వచ్చేవి. ‘ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా’ వంటి మెసేజ్‌లు పెట్టేవారు. మూడొంతులమంది విమర్శించేవారే. ఇలా మచ్చలు రావడం జన్యుపరమైన సమస్య. దీని గురించి ఎందుకంతగా పట్టించుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. అందమంటే ముఖం మాత్రమే కాదు కదా. అందుకే నేను వీడియోలు తీయడం మానలేదు. అయితే అనుకోకుండా మన దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించడంతో రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేదాన్ని. వీటికీ అసభ్య పదజాలంతో ట్రోలింగ్‌ చేసేవారు. మనిషివా.. జింకవా..?, ఎందుకీ జన్మ అనేవారు. అయితే విమర్శలకు నేను వెనకడుగు వేయలేదు’ అంటుంది బిస్మిత.

వ్లాగర్‌గా...

ఇన్‌స్టాలో బిస్మిత వీడియో చూసి, ఓ ఫొటోగ్రాఫర్‌ మేకోవర్‌ పేరుతో ఫొటో షూట్‌ చేస్తానని అడిగాడు. ఆ షూట్‌లో నవ వధువులా బిస్మిత మేకప్‌తో ఉంటుంది. అందమైన వధువుగా బిస్మిత మారిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసినప్పుడు ఒక్క రోజులోనే లక్షలమంది చూశారు. దీంతో ‘బిస్మి వ్లాగ్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది బిస్మిత. అవతలివారి అభిప్రాయాలకు తగ్గట్లు మనమెందుకు జీవించాలి అంటుందీమె. ‘నా చిన్నప్పటి నుంచి మచ్చలున్న అమ్మాయిని పెళ్లాడటానికి ఎవరు ముందుకొస్తారని బంధువులంతా అమ్మను భయపెట్టేవారు. అయితే ఆటో డ్రైవర్‌ సాను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. సామాజికపరంగా నాలాంటివాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, రోజూవారీ విషయాలువంటివన్నీ వీడియోలు చేస్తుంటా. మా బాబు పుట్టిన ఆరునెలలకు తనకు కూడా నాలాగే చర్మ సమస్య మొదలైంది. మెడికల్‌ కాలేజ్, నిమ్స్‌ వంటి చాలా ఆసుపత్రులలో మా ఆయన చూపిస్తే, చికిత్స లేదన్నారు. దీంతో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో మాబాబుకి ఇప్పటి నుంచే నేర్పుతున్నా. దీనిపై అవగాహన కలిగిస్తూ, తననూ నా వీడియోల్లో చూపిస్తుంటే వాటిపైన కూడా విమర్శలొస్తుంటాయి. ‘కొడుకు అలా ఉన్నా కూడా వీడియోలు చేస్తున్నావు, నీ జన్మ ఇంతేనా’ అని తిడుతుంటారు. వేటినీ పట్టించుకోకుండా మనసుకు నచ్చింది చేస్తున్నా’నని చెబుతున్న బిస్మిత టెడెక్స్, జోష్‌టాక్స్‌ వంటి వేదికలపై ప్రసంగిస్తూ తనలాంటివారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్