తోట పెంపకం తేలికగా...

రాగిణికి తోట పెంపకమంటే చాలా ఇష్టం. నచ్చిన మొక్కలను కొని పెంచడానికి ప్రయత్నిస్తుంది. కానీ రెండు నెలల్లోపు వాటిలో దాదాపు అన్నీ చనిపోతాయి. కారణమేంటో తెలియదామెకు.

Published : 09 May 2022 01:06 IST

రాగిణికి తోట పెంపకమంటే చాలా ఇష్టం. నచ్చిన మొక్కలను కొని పెంచడానికి ప్రయత్నిస్తుంది. కానీ రెండు నెలల్లోపు వాటిలో దాదాపు అన్నీ చనిపోతాయి. కారణమేంటో తెలియదామెకు. అందుకే మొక్కల పెంపకంలో జాగ్రత్తలతోపాటు చేయకూడని పొరపాట్లు కూడా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.

మట్టి.. తొట్టెలో మొక్కలు నాటేటప్పుడు వేసే మట్టి విషయంలో పొరపాటు చేయకూడదు. కొన్ని రకాల మట్టి నాలుగైదు రోజులకే గట్టిగా రాయిలా మారుతుంది. ఇది వేర్లకు ఆక్సిజన్‌ అందడానికి ఆటంకమవుతుంది. మొదళ్లలో మట్టి గట్టిగా ఉండటం, పోసిన నీరు వేర్ల ద్వారా అందక పోవడం వంటివన్నీ త్వరగా మొక్కను ఎండిపోయేలా చేస్తాయి. రోజూ నీళ్లు పోసినా ప్రయోజనం ఉండదు. అందుకే మట్టి ఎంపిక బాగుండాలి. గుల్లగా ఉంటేనే సారవంతమైందిగా భావించాలి. అప్పుడే మొక్క కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది.

వాతావరణం.. ఏ కాలానికి తగిన విత్తనాలు అప్పుడే వేయాలి. కొన్ని మొక్కలు వేసవిలో బాగా పెరుగుతాయి. మరికొన్ని వర్షాకాలం, చలికాలంలో ఎదుగుతాయి. ఆయా సమయాల్లో విత్తనాలు చల్లి, నారు వచ్చిన తర్వాత సరైన సమయంలో వాటికి తగిన చోట నాటితే చాలు. ఆరోగ్యంగా ఉంటాయి. కొన్నిరకాల పండ్లు, కాయగూరలు పండే ప్రాంతాలు వేరుగా ఉంటాయి. ఏయే వాతారణానికి ఎటువంటి మొక్కల పెంపకం బాగుంటుందో ముందుగా అవగాహన ఉంటే తోట పెంపకం తేలికగా ఉంటుంది.

తొట్టె ఎంపిక... గులాబీ, మందార, మల్లె వంటి మొక్కలను వేసేటప్పుడు ముందుగానే చిన్న, పెద్ద కాకుండా మధ్యస్థంగా ఉండే తొట్టెలను ఎంపిక చేసుకొని నాటాలి. ముందుగా చిన్న తొట్టెలో వేసి, అది ఎదుగుతున్నప్పుడు మరోదాంట్లోకి మార్చకూడదు. అలా చేస్తే మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. బోగన్‌ విలియా, క్రోటన్స్‌ వంటి మొక్కలకు కొంచెం పెద్ద తొట్టెలనే ఎంచుకోవాలి. లేదంటే ఎదిగేటప్పుడు ఇరుకుగా ఉండి వాటికి అందాల్సిన పోషకాలు ఆ చిన్న తొట్టెలో అందవు. నీళ్లు పోసినా ఎక్కువై, కారిపోతాయి. మొక్కలూ నీరసించిపోతాయి.

దగ్గరగా వద్దు.. నేల మీదైతే మట్టి, విస్తారమైన చోటు ఉండటంతో ఎటువంటి మొక్కలైనా బాగా ఎదుగుతాయి. అయితే మొక్కల మధ్య కనీసం రెండు నుంచి మూడడుగుల దూరం ఉండాలి. అప్పుడే ప్రతి మొక్కా దానికి కావాల్సిన పోషకాలను తీసుకోగలుగుతుంది. దగ్గరదగ్గరగా నాటితే ఆ ప్రభావం వాటి ఎదుగుదలపై పడుతుంది. కొన్నింటికి ఎక్కువ సూర్యరశ్మి కావాలి. మరికొన్ని నీడలోనే బాగుంటాయి. కొన్ని మొక్కలు కొంత ఎండా, కొంత నీడ ఉంటే ఆరోగ్యంగా ఉంటాయి. మొక్కల గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటూ పెంచితే అందమైన తోట మీ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్