ముగ్గులు సులువుగా!

పెద్ద పెద్ద వాకిళ్లు.. ముగ్గు పెట్టడం రోజువారీ ప్రక్రియలా ఉండేది ఒకప్పటి అమ్మాయిలకి! ఇప్పుడు చదువు, ఉద్యోగాల్లో పడి వాటికి సమయం కేటాయించేవారు తక్కువ. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ.

Published : 14 Jan 2023 00:47 IST

పెద్ద పెద్ద వాకిళ్లు.. ముగ్గు పెట్టడం రోజువారీ ప్రక్రియలా ఉండేది ఒకప్పటి అమ్మాయిలకి! ఇప్పుడు చదువు, ఉద్యోగాల్లో పడి వాటికి సమయం కేటాయించేవారు తక్కువ. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ. మరి అప్పుడూ రాదని కూర్చోలేంగా! కొత్తగా ప్రయత్నిస్తోంటే.. ఈ చిట్కాలతో చక్కని రంగవల్లిక దిద్దేయండి.

* ఏం వేయాలనుకుంటున్నారో పేపర్‌ మీద పెట్టేయండి. ముగ్గుతో కష్టం కానీ పెన్సిల్‌తో సులువుగానే వేయొచ్చు. అలాగని తీర్చిదిద్దాల్సిన పనిలేదు. ఎలా వేయాలని అనుకుంటున్నారో గీసి, దేనిలో ఏ రంగు వేస్తే బాగుంటుందో రాసి పెట్టుకుంటే సరి. ఎక్కువ మెలికలు, గీతల్లాంటివి పెట్టుకోవద్దు. ఒకసారి బోర్డర్‌ గీసుకుంటే రంగులు నింపేసి, మాయ చేసేలా ఎంచుకుంటే హిట్‌ కొట్టేయొచ్చు. ఒకసారి బాగుందనుకున్నాక చాక్‌పీస్‌తో నేలమీద గీయండి. తప్పు దొర్లినా తుడుచుకునే వీలుంటుంది. బాగుందా.. రంగులు నింపేసి.. మధ్యలో పూలు జల్లితే చాలు.

* గీత సరిగా పడదు.. మొదటిసారి ప్రయత్నించే అందరికీ ఎదురయ్యే సమస్యే ఇది. అలాంటప్పుడు చిన్న ప్లాస్టిక్‌ డబ్బాలు.. అవీ లేకపోతే పేపర్‌ని కోన్‌లా చేసి,  దానిలో ముగ్గుపోయండి. కింద చిన్న రంధ్రం చేసి, దాని సాయంతో వేయండి. సమాన గీతలు వచ్చేస్తాయి. భిన్న రంగుల్ని లేయర్లుగా వేసి, వాటిమీద తెల్లని ముగ్గుతో చిన్న చుక్కలు, గీతలు పెట్టినా చూడముచ్చటగా కనిపిస్తుంది.

* అంత సమయం లేదు.. శ్రమా మావల్ల కాదు అనిపిస్తే.. స్టెన్సిల్స్‌ తెచ్చుకోండి. ఇవి జల్లెడలా ఉంటాయి. నేలమీద పెట్టి దానిపై ముగ్గు జల్లి సమానంగా పరిచి, నెమ్మదిగా పైకి తీసేస్తే సరి. అందమైన చిన్నముగ్గులు సిద్ధం. వాటిలో రంగులు దిద్దుకుంటే సరిపోతుంది.

* వివిధ రంగుల పూలు, ఆకులను తెచ్చేయండి. చాక్‌పీస్‌తో కావాల్సిన ఆకారాన్ని గీసుకొని వాటిల్లో పూల రేకలు, ఆకులతో నింపేసి... మధ్యలో గొబ్బెమ్మలను ఉంచితే సరి. చేయడం సులువు.. పర్యావరణ హితం.. చూడటానికీ బాగుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్