మేనత్త ఆస్తి మాకొస్తుందా?

మా మేనత్త పెళ్లి చేసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. కొన్నాళ్ల క్రితం కొవిడ్‌తో చనిపోయారు. నగరంలో తనకు ఆరు ఫ్లాట్లు ఉన్నాయి. వీలునామా ఏమీ రాయలేదు.

Updated : 13 Feb 2024 14:08 IST

మా మేనత్త పెళ్లి చేసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. కొన్నాళ్ల క్రితం కొవిడ్‌తో చనిపోయారు. నగరంలో తనకు ఆరు ఫ్లాట్లు ఉన్నాయి. వీలునామా ఏమీ రాయలేదు. కాకపోతే ఆస్తిలో మాకు వాటా ఇస్తాననీ, మా పెళ్లిళ్లు ఘనంగా జరిపిస్తాననీ అనేవారు. ఈ ఆస్తిలో మాకూ, మా బాబాయి పిల్లలకూ హక్కు ఉంటుందా? మేం ఇద్దరం అమ్మాయిలం. మా బాబాయికి ఇద్దరు అబ్బాయిలు.

ఓ సోదరి

హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 14 ప్రకారం మహిళలు... తాము సంపాదించిన లేదా వారసత్వంగా అందుకున్న ఆస్తినీ, భాగస్వామ్యం ద్వారానైనా, భరణం రూపంలో అందుకున్న దానినీ ఆమె స్వార్జితంగా పరిగణిస్తారు. అలానే, సొంతంగా కొన్నదైనా, పెళ్లికి ముందో, తరవాతో బహుమతిగా పొందినదాన్నైనా కూడా స్త్రీధనంగానే లెక్కిస్తారు. పై చట్టం ప్రకారం మహిళలెవరైనా తమ ఆస్తికి వీలునామా రాయకుండా చనిపోతే అది మొదట ఆమె పిల్లలకు చెందుతుంది. వారు లేకపోతే, భర్త వారసులకు దక్కుతుంది. ఆపై తల్లిదండ్రులకూ అదీ సాధ్యం కానప్పుడు, తండ్రి వారసులకు, చివరగా తల్లి వారసులకు వస్తుంది. ఇందులోని క్లాజ్‌(2) ప్రకారం ఒకవేళ ఆవిడ ఆ ఆస్తిని తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా తీసుకుంటే మాత్రం తండ్రి వారసులకి చెందుతుంది.

మీ మేనత్త విషయానికి వస్తే... ఆవిడ పెళ్లి చేసుకోలేదు కాబట్టి తన ఆస్తి మీకూ, మీ బాబాయ్‌ పిల్లలకూ సమానంగా దక్కే అవకాశం ఉంది. అయితే, ఇందుకోసం ముందుగా మీరు ఆవిడకు చట్టబద్ధ వారసురాలినని నిరూపించుకోవాలి. ఒకవేళ మీ మేనత్త అన్నదమ్ములు బతికే ఉంటే... మొదట వారే దానికి చట్టబద్ధంగా వారసులవుతారు. లేకపోతే వారి పిల్లలుగా మీకు అది దక్కుతుంది. ముందు ఎక్కడ ఆ ఆస్తులు ఉన్నాయో... అక్కడి కోర్టులో ‘డిక్లరేషన్‌ ఆఫ్‌ లీగల్‌ హేర్‌షిప్‌’ సూట్‌ వేయండి. ఆ డిక్రీ/తీర్పు ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో వారసులుగా మ్యూటేషన్‌ చేయించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్