దుస్తుల చిక్కులు తప్పిస్తాయ్‌!

దుస్తులు ఉతకడం ఎంత శ్రమ! సమయమూ ఎక్కువే తీసుకుంటుంది. ఆ రెండూ తగ్గించుకుందామని వాషింగ్‌ మెషీన్‌ని తెచ్చుకుంటాం. దానితోనూ కొన్ని తిప్పలు తప్పవు కదూ! వాటిని తగ్గించే యాక్సెసరీలే ఇవి!

Published : 03 Apr 2024 01:46 IST

దుస్తులు ఉతకడం ఎంత శ్రమ! సమయమూ ఎక్కువే తీసుకుంటుంది. ఆ రెండూ తగ్గించుకుందామని వాషింగ్‌ మెషీన్‌ని తెచ్చుకుంటాం. దానితోనూ కొన్ని తిప్పలు తప్పవు కదూ! వాటిని తగ్గించే యాక్సెసరీలే ఇవి!


పోగుల బాధ ఉండదు

లింట్‌... దుస్తులు డ్రై అయ్యాక బయటకు తీస్తామా... వాటిపై దూదిలాంటిది పోగయ్యి కనిపిస్తుందే అదన్నమాట. దులిపినా త్వరగా వదలదు. నెమ్మదిగా తీసుకుంటూ రావాలి. కొందరైతే దువ్వెనతో తీస్తుంటారు. జీన్స్‌ వగైరా అయితే పర్లేదు కానీ... సున్నితమైన పిల్లల దుస్తులతోనే ఇబ్బంది. పోగులు విడిపోతుంటాయి. ఈ బెంగను తీర్చేదే ఈ ‘ఫిల్టర్‌ ఫ్లోటింగ్‌ ట్రాప్‌’. దుస్తులతోపాటుగా దీన్నీ వాషింగ్‌ మెషీన్‌లో వేయాలి. పైన చక్రంలా, కింద సంచితో ఉంటుంది. నీటిలో తేలుతూ ఆ లింట్‌నంతా పోగేస్తుంది. అలా దుస్తులపైకి చేరకుండా చూస్తుంది.


ముడిపడకుండా...

మెషీన్‌లో దాదాపుగా ఎండిపోయినా దుస్తుల్ని కొద్దిసేపైనా ఆరేయక తప్పదు. కానీ అదే పెద్ద శ్రమ. ఒకదానితో ఒకటి ముడిపడిపోయి మామూలుగా చిరాకు పెట్టవు. ఈక్రమంలో దుస్తులు సాగిపోవడం, గుండీలు ఊడిపోవడం వంటివీ జరుగుతాయి. ఈ బాధలు తప్పాలంటే ‘లాండ్రీ బాల్స్‌’ని తెచ్చేసుకోండి. సిలికాన్‌తో తయారైన వీటిని దుస్తులతోపాటు వేస్తే సరి. ముళ్ల బంతిలా ఉంటాయి కానీ వస్త్రాలకు హాని కలిగించవు. పైగా పూర్తిగా శుభ్రమయ్యేలా చూస్తాయి. ఇంకా... 8-10 బంతులను వేస్తాం కదా! ఇవి దుస్తులు ఒకదానితో మరొకటి చుట్టుకోకుండా చూస్తాయి.


సాగనివ్వని బంతి

దుస్తులు ఒకెత్తయితే లోదుస్తులు ముఖ్యంగా బ్రాలను ఉతకడం మరొకెత్తు. హుక్కులేమో వేరే దుస్తులకో, వాషింగ్‌ మెషీన్‌లో దేనికో దానికో పడతాయి. వేరే దుస్తులతో ముడిపడి స్ట్రాప్‌లేమో సాగిపోతాయి. వాటికీ తక్కువ ఖర్చేం పెట్టం కదా! పాడెడ్‌ రకాలైతే ముడుచుకుపోయి ఓ పట్టాన సరికావు. పోనీ చేత్తో ఉతుక్కుందామా అంటే అన్నిసార్లూ కుదరదు. ఈ తిప్పలను దూరం చేస్తుందీ ‘వాషర్‌ బాల్‌’ దీనిలో బ్రాలను పెట్టి, వాషింగ్‌ మెషీన్‌లో పడేయడమే. తేలిగ్గా శుభ్రమవుతాయి. సాగే బెంగనీ దూరం చేస్తుంది. మీకూ ఇవి మీ శ్రమను దూరంచేసే నేస్తాలుగా కనిపించాయా? ఇంకేం... ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్