తేలిగ్గా వండేద్దాం..!

కొన్ని పెద్ద పెద్ద పనులు కూడా తేలిగ్గానే చేసేయొచ్చు. కానీ ఒక్కోసారి చిన్న పనులే ఆలస్యమవుతుంటాయి. అలాంటి వాటికి పరిష్కారంగా వచ్చినవే ఈ ట్రెండీ వంటింటి పరికరాలు... ఆ పనులేంటో, ఆ పరికరాలేంటో చూసేయండి మరి.

Published : 24 Apr 2024 01:46 IST

కొన్ని పెద్ద పెద్ద పనులు కూడా తేలిగ్గానే చేసేయొచ్చు. కానీ ఒక్కోసారి చిన్న పనులే ఆలస్యమవుతుంటాయి. అలాంటి వాటికి పరిష్కారంగా వచ్చినవే ఈ ట్రెండీ వంటింటి పరికరాలు... ఆ పనులేంటో, ఆ పరికరాలేంటో చూసేయండి మరి.


బీట్‌ చేసేయండి..!

పిల్లలకో, మనకో అప్పటికప్పుడు ఆమ్లెట్‌, ఎగ్‌దోశ లాంటివి వేసుకోవడానికో, కేక్‌ లాంటివి చేయాలనుకున్నప్పుడో  కోడిగుడ్లను మిక్స్‌ చేయాల్సి ఉంటుంది. వాటిని స్పూన్‌తో కలపడం శ్రమ, పైగా సరిగా కలవదు కూడా. ఇటువంటప్పుడు ఈ హ్యాండ్‌పుష్‌ విస్క్‌ బ్లెండర్‌ను తెచ్చేసుకోండి. దీన్ని ఉపయోగించడం కూడా చాలా తేలిక. గుడ్డుసొన ఉన్న గిన్నెలో దీన్ని ఉంచి, చేత్తో దాని హ్యాండిల్‌ను కిందకి నొక్కితే చాలు. క్షణాల్లో సొనంతా కలిసిపోతుంది. ఈ బ్లెండర్‌ సాయంతో మిల్క్‌షేక్‌, గ్రేవీ, సాస్‌ వంటివీ కలుపుకోవచ్చు. సెమీ ఆటోమేటిక్‌ అయిన ఈ పరికరాన్ని శుభ్రపరచుకోవడం కూడా తేలికే. ఎలక్ట్రిక్‌ బ్లెండర్‌ లాంటి వాటితో పోలిస్తే దీని ధర కూడా తక్కువ. మీకూ నచ్చిందా!


చేతులు గీరుకోకుండా...

జిడ్డు ఉన్న పాన్‌లూ, గిన్నెలు వంటి వాటిని శుభ్రం చేయాలంటే ఎక్కువ బలంతో రుద్దాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ స్టీల్‌ స్క్రబ్బర్‌ పోగుల వల్ల మన చేతులు గీరుకుపోతుంటాయి. అలా కాకుండా ఈ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్ట్రిప్‌ బ్రష్‌ను వాడండి. దీనికి పొడవైన కాడ ఉండడం వల్ల పాత్రల్ని తేలిగ్గా శుభ్రపరచుకోవచ్చు. దాని బ్రష్‌ కూడా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో చేసింది కాబట్టి ఎక్కువ కాలమూ మన్నుతుంది. అన్నిరకాల గిన్నెలకూ దీన్ని వాడొచ్చు. పని అయ్యాక దీనికి ఉండే హుక్‌ సాయంతో ఎక్కడైనా తగిలించి ఆరబెట్టేసుకోవచ్చు. పొడవు కాడ కాబట్టి ఇది బాటిళ్లు, లోతైన డబ్బాల వంటి వాటిని శుభ్రపరచడానికీ ఉపయోగపడుతుంది. చేతులూ గీరుకుపోకుండా ఉంటాయి.


కోరేద్దాం..!

సాయంత్రం స్నాక్స్‌ కోసం బజ్జీ వేసుకుందాం అనుకుంటాం. పిండి కలపడం లాంటి పనులన్నీ చిటికెలో అవుతాయి కానీ బజ్జీ మిరపకాయలో విత్తనాలు తీయడం మాత్రం ఓ పని కదా! చిన్న పిల్లలకు ఎక్కువ కారం లేకుండా కూర చేద్దామనుకుంటాం. అయితే మనం వాడే క్యాప్సికంలోని ఆ విత్తనాలు వాళ్లకు ఘాటు. మరి ఏం చేయాలంటారా! ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ వచ్చిందే పెప్పర్‌ కోరర్‌. మిరపకాయ తొడెం తీసి దీన్ని అందులో పెట్టి తిప్పితే చాలు. అందులో ఉండే పదునైన పళ్లు లోపల ఉండే కండనూ, విత్తనాలనూ బయటకు తీసేస్తుంది. అవే కాదు దోసకాయ, టొమాటో, ఆపిల్స్‌ విత్తనాలు తీయడానికీ ఈ పెప్పర్‌ కోరర్‌ భలే ఉపయోగపడుతుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్