ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!

ఇంటి ముంగిట పూల పందిరి అల్లుకుంటే వచ్చే అందమే వేరు. అవి గుత్తుల్లో విరబూస్తే ఈ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించతరమా? అలాంటి తీగ జాతి మొక్కే శాండ్‌పేపర్‌ వైన్‌.

Published : 09 May 2024 03:17 IST

ఇంటి ముంగిట పూల పందిరి అల్లుకుంటే వచ్చే అందమే వేరు. అవి గుత్తుల్లో విరబూస్తే ఈ సౌందర్యాన్ని మాటల్లో వర్ణించతరమా? అలాంటి తీగ జాతి మొక్కే శాండ్‌పేపర్‌ వైన్‌. మరి దీన్ని ఎలా పెంచుకోవాలో చూద్దామా!

దా, తెలుపు రంగుల్లో గుత్తులుగా కిందకి వేలాడుతూ కనువిందు చేసే పూల మొక్క శాండ్‌ పేపర్‌ వైన్‌. దీన్ని చూస్తే నక్షత్రాలే నేలకు దిగుతున్నాయా అనిపించేంత అందంగా కనిపిస్తుంది. వీటి తొడిమల్లో నుంచి వచ్చిన పూలు మాత్రం రాలిపోయి... ఇవి మాత్రమే రేకల్లా కనిపిస్తూ నిండుదనం తెస్తాయి. గుత్తులుగా విరబూసే ఈ పూలు పుష్పగుచ్ఛాలను తలపించడం వల్లే... కొన్నిచోట్ల పర్పుల్‌ వ్రెత్‌ లేదా, క్వీన్స్‌ వ్రెత్‌ అనీ పిలుస్తారు. మన దేశంలో అయితే, నీలమణిగా ప్రాచుర్యంలో ఉంది. ఈ తీగజాతి మొక్క శాస్త్రీయ నామం పెట్రియా వోల్యుబిలిస్‌. ఈ ఉష్ణమండల మొక్క వెర్బనేసీ కుటుంబానికి చెందినది. దీన్ని ఒకసారి నాటుకుంటే జీవితకాలం పూలనిస్తుంది.

సాధారణంగా ఇవి ఏటా వేసవిలో పూయడం ప్రారంభించి... శీతకాలం వరకూ విరగబూస్తాయి. ఇక, దీని ఆకుల ఉపరితలం పదునుగా, గరుకుగా ఉంటుంది. వీటిని నలిపితే పెళపెళా శబ్దం చేస్తాయి. ఈ లక్షణమే దీనికి శాండ్‌పేపర్‌ వైన్‌ అనే పేరు తెచ్చిపెట్టింది. ఈ మొక్క పూర్తి సూర్యకాంతిలో ఆరోగ్యంగా ఎదుగుతుంది. ముఖ్యంగా కనీసం ఆరేడుగంటలు నేరుగా ఎండ తగిలితే పూలూ బాగా వస్తాయి. ఈ తీగ నీటి ఎద్దడిని తట్టుకోగలిగినప్పటికీ ఎక్కువ రోజులు నీళ్లు పోయకుండా వదిలేయొద్దు. మట్టి పొడిబారిన వెంటనే తడిని అందించాలి.

పోషకాలు ఇలా...

శాండ్‌పేపర్‌ వైన్‌ ఆరోగ్యంగా ఎదగాలన్నా, పూలు ఎక్కువ రావాలన్నా ఎన్‌పీకే ఎరువు 10:10:10 నిష్పత్తిలో నెలకోసారైనా అందించాలి. లేదంటే పేడ, కుళ్లిన ఆకులు, వంటింటి వ్యర్థాలతో చేసిన కంపోస్ట్‌ని కూడా వేయొచ్చు. సాధారణంగా వీటి ఆకులు గరుకుగా ఉండటం వల్ల పురుగులు దరిచేరవు. అయినప్పటికీ ఎప్పుడైనా మిల్లీ బగ్స్‌ వంటివి కనిపిస్తే వేప నూనె, వెల్లుల్లి కషాయాన్ని చల్లితే సరి. అయితే, తేనెటీగలు, సీతాకోక చిలుకల్ని మాత్రం శాండ్‌పేపర్‌ వైన్‌ పువ్వులు ఆకర్షిస్తాయి. ఫెన్సింగ్‌లు, వాల్స్‌, రెయిలింగ్‌ వంటివాటి ఆధారంగా దీన్ని పెంచుకుంటే ఇంటి ముందు పూల పందిరి అల్లుకున్నట్లే అందంగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్