రెయిన్‌ లిల్లీ రంగుల తివాచీ!

ఐదారు రేకలతో గరాటు ఆకృతిలో విచ్చుకునే రెయిన్‌ లిల్లీలను చూసి ముచ్చటపడని వారుండరేమో! అచ్చం లిల్లీ పూల ఉండే వీటిని ఎక్కడ నాటినా... ఆ ప్రదేశానికి నిండుదనం తెస్తాయి.

Published : 30 May 2024 01:26 IST

ఐదారు రేకలతో గరాటు ఆకృతిలో విచ్చుకునే రెయిన్‌ లిల్లీలను చూసి ముచ్చటపడని వారుండరేమో! అచ్చం లిల్లీ పూల ఉండే వీటిని ఎక్కడ నాటినా... ఆ ప్రదేశానికి నిండుదనం తెస్తాయి.

మృదువైన రేకలతో, తెలుపు, గులాబీ, ఎరుపు, పసుపు, ఊదా, నీలం... వంటి కంటికి ఇంపైన రంగుల్లో విచ్చుకుంటాయివి. వర్షాలు గట్టిగా కురిసిన తరవాతే ఇవి పుష్పించడం ఆరంభిస్తాయి. అందుకే రెయిన్‌ లిల్లీ పూలనే పేరు వచ్చింది. వీటినే ఫెయిరీ లిల్లీ, గడ్డి లిల్లీ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం జెఫిరాంథస్‌. అమెరికాలో పుట్టిన దీనికి 70కి పైగా ఉప జాతులున్నాయట. ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం అలంకరణ మొక్కగా ఎంతో పాపులర్‌ అయిన ఈ మొక్కను దుంపను నాటడం ద్వారా మొలకెత్తించవచ్చు. కుండీలతో పాటు బాటల వెంట, ఖాళీ ప్రదేశాల్లో చక్కటి ఆకృతుల్లో ఇమిడ్చి కూడా పెంచుకోవచ్చు. గ్రౌండ్‌ కవర్‌లా నాటుకుంటే రంగు రంగుల పూలతో తివాచీ పరిచినట్లే ఉంటుంది.

సంరక్షణ ఎలా అంటే?

సాధారణంగా రెయిన్‌ లిల్లీ మొక్కల్ని దుంపల్ని నాటడం ద్వారా మొలకెత్తిస్తారు. ఇవి పెద్దగా సంరక్షణ అవసరం లేకుండానే నిలదొక్కుకుంటాయి. అయితే, వీటిని కనీసం ఆరేడు గంటల పాటు ఎండ తగిలే చోట నాటుకోవాలి. పొడిగా ఉండే ఇసుక నేలల్లో ఇవి చక్కగా ఎదుగుతాయి. మట్టి తడి ఆరకుండా నీళ్లు పోసుకోవడం తప్పనిసరి. వీటికి ప్రత్యేకంగా ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా బాగా పూయాలంటే మాత్రం నెలకోసారి కాస్త వర్మీకంపోస్ట్‌ని చుట్టూ ఉన్న మట్టిలో కలపండి. పూలు పూయడం అయిపోయాక ఎండిన పూలను కత్తిరించేయండి. ఇక, చీడపీడల విషయానికి వస్తే అప్పుడప్పుడు గోధుమ రంగు మచ్చలు వచ్చినా వాటంతట అవే పోతాయి. తెల్లదోమ, నత్తలు వంటివి మొక్కను ఇబ్బంది పెట్టకుండా కాస్త వెల్లుల్లి కషాయాన్నీ కానీ, వంట సోడా కలిపిన నీళ్లను కానీ చల్లితే సరి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్