ఆమె ఇల్లు... మూగజీవాల ఆవాసం!

వీధి కుక్కలంటే దొరికిందేదో తింటూ తిరుగుతూ ఉంటాయి. అంతేతప్ప వాటికంటూ పోషణ ఏమీ ఉండదు. కనీసం దగ్గరకు వెళ్లి ఆహారం అందించాలన్నా, భయపడేవారే ఎక్కువ.

Published : 08 Jun 2024 03:23 IST

వీధి కుక్కలంటే దొరికిందేదో తింటూ తిరుగుతూ ఉంటాయి. అంతేతప్ప వాటికంటూ పోషణ ఏమీ ఉండదు. కనీసం దగ్గరకు వెళ్లి ఆహారం అందించాలన్నా, భయపడేవారే ఎక్కువ. అందులోనూ వైకల్యం ఉన్నవీ, విడిచిపెట్టిన కుక్కల పరిస్థితి మరీ దయనీయం. ఆ మూగజీవాల బాధను అర్థం చేసుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రతిమా సాగర్‌. తన ఇంటినే ఆ కుక్కలకు ఆవాసంగా మార్చి, వాటిపై ప్రేమను చాటుకుంటున్నారీమె.

చాలామందికి మూగజీవులపై ప్రేమ ఉంటుంది. అయితే, ప్రతిమ మాత్రం తన జీవితాన్నే వాటికోసం అంకితం చేసింది. ఒకప్పుడు జర్నలిస్ట్‌ అయిన ఆమె, ప్రస్తుతం యానిమల్‌ యాక్టివిస్ట్‌గా పనిచేస్తోంది. రెండు దశాబ్దాల నుంచి మూగజీవాల సంరక్షణ కోసం కృషిచేస్తోంది. వయసుపైబడిన, గాయపడిన, వైకల్యంతో ఉన్న కుక్కలను రక్షించి, తన పెంపుడు కుక్కలూ పిల్లులతో కలిపి పెంచుతోంది. కేవలం జంతువులే కాదు, కొన్ని రకాల పక్షులనూ ఆదరిస్తోంది.

వీటి సంరక్షణకోసం తన ఉద్యోగాన్నీ వదిలేసింది. ఇటువంటి కుక్కల సమాచారం తనకు వాట్సప్‌ గ్రూపుల నుంచి అందుతుంది. ఒకవేళ, వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే, తనే దత్తత తీసుకుని సంరక్షిస్తుంది. ఆమె ఆవాసం కల్పించిన వాటిల్లో ఎక్కువశాతం అవయవాలు లేనివీ, గాయపడినవే ఉంటాయి. ఎందుకంటే అటువంటి వాటిని పోషించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. వాటికోసం ప్రత్యేకంగా వంట చేసేది. భర్త సాయంతో వాటి బాగోగులు చూస్తోంది. పాతబస్తీలోని గుర్రాల కోసం, ఆమె ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తోంది. ఒంటెలను రక్షించే మిషన్‌లోనూ చేరింది. వయసైపోయిన వాటిని వధించకుండా చేసి, తిరిగి రాజస్థాన్‌ పంపింది. భవిష్యత్తులో జంతువుల కోసం ఉచిత అంబులెన్సు సేవలను అందించాలనుకుంటోంది ప్రతిమ. అందుకోసం ఇప్పటికే ఒక అంబులెన్స్‌ కూడా కొనుగోలు చేసింది. మూగజీవాల కోసం ఆమె చేస్తోన్న కృషి అభినందనీయమే కదా!


అరటిచెట్టుకే... వేలాడదీద్దాం!

అరటిచెట్టుకి వేలాడదీసిన అరటిపండ్లు... చూడ్డానికి భలే ఉన్నాయి కదా! చాలామందికి ఇంట్లో అరటిపండ్లు నిత్యం ఉండాల్సిందే! నిద్రపోయే ముందో, భోజనం తిన్న తరవాతో వీటిని తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ పండ్లని తక్కిన వాటిల్లా ఫ్రిజ్‌లో పెట్టలేం. అలాగని డైనింగ్‌ టేబుల్‌ మీద అలానే వదిలేయలేం. అందుకే వీటిని అందంగా వేలాడదీసేందుకు వచ్చినవే బనానా హ్యాంగర్లు.ఈ స్టాండ్లు కాస్తా అరటిచెట్ల మాదిరిగానే ఉండటంతో చూడ్డానికీ బాగున్నాయి. మీరూ ఓ స్టాండ్‌ని తెచ్చుకుని ఇంటిని అందంగా మార్చుకోండి...  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్