శివాంగి క్షేమమే..!

ఒక్క ఫొటో... ఎన్నో అనుమానాలకూ, అసత్య ప్రచారాలకూ అడ్డుకట్ట వేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, స్క్వాడ్రన్‌ లీడర్‌ శివాంగీ సింగ్‌... రఫేల్‌ యుద్ధ విమానం ముందు దిగిన ఫొటో అది.

Eenadu icon
By Vasundhara Team Published : 30 Oct 2025 00:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఒక్క ఫొటో... ఎన్నో అనుమానాలకూ, అసత్య ప్రచారాలకూ అడ్డుకట్ట వేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, స్క్వాడ్రన్‌ లీడర్‌ శివాంగీ సింగ్‌... రఫేల్‌ యుద్ధ విమానం ముందు దిగిన ఫొటో అది. 

పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఆ సమయంలో మన రఫేల్‌ యుద్ధ విమానాలను నేల కూల్చినట్లు, ఒక మహిళా పైలట్‌ను బంధించినట్లు పాక్‌ ప్రచారం చేసుకుంది. ఆమె శివాంగి కావొచ్చన్న ఊహాగానాలు దేశవ్యాప్తంగా వచ్చాయి. ప్రభుత్వంతోపాటు, ఆమె కుటుంబ సభ్యులూ అప్పట్లో ఆ వార్తల్ని ఖండించారు. శివాంగి ఓ ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినా ఆ ఊహాగానాలకు తెరపడలేదు. మే నుంచి దాదాపు ఆరు నెలలు శివాంగి బయట కనిపించకపోవడంతో ఆమె ఎక్కడన్న విషయంమీద చర్చలు కొనసాగుతూనే వచ్చాయి. బుధవారం రాష్ట్రపతి ముర్ము అంబాలాలోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి రఫేల్‌లో ప్రయాణించారు. ఈ సమయంలో రఫేల్‌ పక్కన శివాంగితో కలిసి నిల్చొన్న ఫొటోల్ని ముర్ము సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో పాక్‌వి కట్టుకథలేనని తేలిపోయింది.

ఇంతకీ ఎవరీమె?

ఈమె స్వస్థలం వారణాసి. బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారు. చిన్నతనం నుంచి పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలుకన్న శివాంగి.. 2017లో వైమానికదళంలో పైలట్‌గా చేరారు. మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. తన ప్రతిభకు ప్రతిఫలంగా 2020లో రఫేల్‌ యుద్ధ విమానం శిక్షణకు ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా పైలట్‌ శివాంగి. శిక్షణ అనంతరం అంబాలా ఎయిర్‌బేస్‌లోని గోల్డెన్‌ యూరోస్‌ స్క్వాడ్రన్‌ బృందంలో పైలట్‌గా ఉన్నారు. యుద్ధ విమానాల నియంత్రణకు బహుముఖ నైపుణ్యాలు అవసరమని గ్రహించి అందుకు తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నారామె. ఇప్పటికే ‘రఫేల్‌ రాణి’గా పేరుతెచ్చుకున్న శివాంగి... వ్యోమగామిగా అంతరిక్షంలో విహరించే లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నారు. భారత్‌ చేపట్టాలనుకుంటున్న మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగమవ్వాలనేది ఆమె కల. అదీ నిజమవుతుందనడంలో సందేహం లేదు! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్