అడిగి బాధ్యతలు తీసుకున్నా!

మహిళగా భారతీయ కార్పొరేట్‌ రంగంలో సీఈఓగా ఎంపికవ్వడం, నిరూపించుకోవడం సామాన్య విషయం కాదు! కానీ నలభైల్లోనే సీఈఓ అయ్యారు రూపా కుద్వా. ఆమె అనుభవాలను పాఠాలుగా మార్చి ‘లీడర్‌షిప్‌ బియాండ్‌ ద ప్లేబుక్‌’ పుస్తకంగా తెచ్చారు రూప.

Eenadu icon
By Vasundhara Team Updated : 28 Oct 2025 14:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

మహిళగా భారతీయ కార్పొరేట్‌ రంగంలో సీఈఓగా ఎంపికవ్వడం, నిరూపించుకోవడం సామాన్య విషయం కాదు! కానీ నలభైల్లోనే సీఈఓ అయ్యారు రూపా కుద్వా. ఆమె అనుభవాలను పాఠాలుగా మార్చి ‘లీడర్‌షిప్‌ బియాండ్‌ ద ప్లేబుక్‌’ పుస్తకంగా తెచ్చారు రూప. తన గురించీ, మహిళలు వృత్తిలో రాణించడం గురించీ ఆమె పంచుకున్న అంశాలివి...

రూప పెరిగింది మేఘాలయా, అసోంలలో. మేఘాలయాలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. మహిళలు పనిచేయాలి, ఆర్థిక స్వతంత్రం సాధించాలని రూపకు చిన్నప్పట్నుంచీ ఉండేది. గువాహటిలోని కాటన్‌ కాలేజీ నుంచి బీఎస్సీ, ఐఐఎమ్‌-అహ్మదాబాద్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన రూప.. ఐడీబీఐలో కెరియర్‌ ప్రారంభించారు. 1992లో రేటింగ్స్‌ సంస్థ ‘క్రిజిల్‌’కు మారారు. ‘నేను ముంబయిలో, కుటుంబం బెంగళూరులో ఉండేది. క్రిజిల్‌ బెంగళూరు శాఖను ప్రారంభిస్తున్నట్లు పేపర్లో చూశా, మర్నాడు వాళ్ల ఆఫీసుకు వెళ్లి సీఈఓ ప్రదీప్‌ షాను కలిసి బెంగళూరులో చేరతానంటే... మాటల్లోనే ఓకే చేశారు’ అంటారు రూప.

అర్హత ఉందంటూ...

క్రిజిల్‌లో గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ ఎస్‌ఎన్‌పీ భాగస్వామిగా మారడంతో ఆ సంస్థ తరఫున 1998-2000 మధ్య పారిస్‌లో పనిచేశారు. ‘తిరిగొచ్చేసరికి ఇండియాలో క్రిజిల్‌ చీఫ్‌ రేటింగ్స్‌ ఆఫీసర్‌(సీఆర్‌ఓ) స్థానం ఖాళీ అయింది. దాన్ని భర్తీ చేయకుండా మాలాంటి సెక్టార్‌ లీడ్స్‌ నేరుగా సీఈఓకే రిపోర్ట్‌ చేయాలన్నారు. ఓరోజు సీఈఓను కలిసి సంస్థకు సీఆర్‌ఓ ప్రాధాన్యాన్నీ, అందుకు నాకున్న అర్హతల్నీ చెబుతూ చిన్న ప్రెజెంటేషన్‌ ఇచ్చా. ఆర్నెళ్ల తర్వాత సీఆర్‌ఓగా నియమించారు. రేటింగ్స్‌ విభాగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికీ, ఆపై సీఈఓ కావడానికి అది తోడ్పడింది’ అని చెప్పే రూప... కోరుకోనిదే, ఏదీ దక్కదంటారు. సీఈఓగా ఇండస్ట్రీ రిసెర్చ్, రిస్క్‌ అడ్వైజరీ... లాంటి విభాగాల్లోకి కంపెనీ సేవల్ని విస్తరించారు.

సీఈఓ హోదా వద్దనుకుని...

‘ఉద్యోగం చేయడానికో కారణం, సంతృప్తి ఉండాలి. 2015 నాటికి నాకు 50 ఏళ్లు. అప్పటికి క్రిజిల్‌కు సీఈఓగా ఏడేళ్లున్నాను. మరో పదేళ్లు ఉండొచ్చు. అది నాకూ, కంపెనీకీ మంచిది కాదనిపించింది. కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నా. ‘ఒమిడియార్‌ నెట్‌వర్క్‌ ఇండియా’ సంప్రదించడంతో ఆ సంస్థకు మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా వెళ్లాను. డిజిటల్‌ సాధనాలతో భారత్‌లోని దిగువ 60 శాతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న స్టార్టప్‌లకు పెట్టుబడులు అందించే సంస్థ ఇది’ అంటూ తన కెరియర్‌లో మార్పు గురించి వివరిస్తారు రూప.

అనుభవ పాఠాలు...

  • లైఫ్‌లో వృత్తి చాలా ముఖ్యం. అలాగే మానవ సంబంధాలూ! వర్క్‌-లైఫ్‌ ఇంటిగ్రేషన్‌ ఉండాలి. మనం అంటే ఉద్యోగం, హోదా ఒక్కటే కాదు. లైఫ్‌లో భిన్న అంశాలకు చోటివ్వాలి.
  • హోదాకు తగ్గ అర్హత తమకు ఉందా, లేదా అన్న భావన(ఇంపోస్టర్‌ సిండ్రోమ్‌) పురుషుల్లోనూ ఉంటుంది. మహిళలు మరీ లోతుగా ఆలోచిస్తారంతే. ఈ ఆలోచన మంచిదే! ఎందుకంటే మిమ్మల్ని కొత్త హోదాకు తగ్గట్టు సిద్ధం చేసుకుంటారు.
  • ఉద్యోగ అర్హతల్లో 60 శాతం ఉన్నా, పురుషులు దరఖాస్తు చేస్తారట. మహిళలైతే, 100 శాతం అర్హత సాధించేవరకూ వేచి చూస్తారట. ఈ ‘కాన్ఫిడెన్స్‌ గ్యాప్‌’ అనేది సామర్థ్యానికి సంబంధించింది కాదు, ఆలోచనాధోరణికి సంబంధించింది. 
  • సాధనతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిర్ణయం తీసుకున్నాక, పనిచేశాక ఆత్మవిశ్వాసం వస్తుంది తప్ప, ముందే రాదు.  
  • సంస్థలు... మహిళల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవడం, వాళ్లకు నెట్‌వర్క్‌ ఏర్పాటుచేయడమే కాదు... పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా చూడాలి.       
  • మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉండటం వెనక పురుషుల పాత్ర కీలకం. మద్దతివ్వడం, మార్గనిర్దేశం చేయడం, వివక్ష ఆపడం... వంటివన్నీ చేయాలి. 
  • నాయకత్వం అంటే నిర్దేశిత పాత్రకు పరిమితమవ్వడం కాదు, మన శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషిచేయడం.
  • వైవిధ్యాన్నే కాదు... క్లిష్టమైన వ్యాపార వాతావరణంలో విజయానికి అవసరమయ్యే తమదైన దృష్టికోణాన్నీ, పరిజ్ఞానాన్నీ, నాయకత్వ శైలినీ తెస్తారు మహిళలు. 

ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సాప్‌ ద్వారా పంపవచ్చు.  

Tags :
Published : 28 Oct 2025 04:43 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్