ఈ తారల్ని చూసి నేర్చుకుందాం!

పెళ్లైతే కెరీర్‌ ముగిసిపోతుంది.. అమ్మైతే అందం తగ్గిపోతుంది.. అన్న భ్రమలో ఉంటారు చాలామంది. ఈ ఆలోచనలతోనే అటు పెళ్లిని, ఇటు పిల్లల్ని వాయిదా వేస్తుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎలాగో.. లేటు వయసులో పెళ్లి చేసుకోవడమూ అలాగే! ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యపరంగా, అనుబంధం పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Published : 10 Apr 2024 20:56 IST

(Photos: Instagram)

పెళ్లైతే కెరీర్‌ ముగిసిపోతుంది.. అమ్మైతే అందం తగ్గిపోతుంది.. అన్న భ్రమలో ఉంటారు చాలామంది. ఈ ఆలోచనలతోనే అటు పెళ్లిని, ఇటు పిల్లల్ని వాయిదా వేస్తుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎలాగో.. లేటు వయసులో పెళ్లి చేసుకోవడమూ అలాగే! ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యపరంగా, అనుబంధం పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలా ఆలోచించే వారందరూ కొందరు అందాల నాయికల జీవితాన్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. స్త్రీకి అన్నింటికంటే ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని, అదే ఏ దశలోనైనా మన గౌరవాన్ని కాపాడుతుందని, పెళ్లి-పిల్లలు కెరీర్‌కు అడ్డు కాదని.. ఇలా ఎన్నో విషయాల్లో వారు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు. జీవితంలోని కీలక దశల్లో ప్రతి మహిళా ఇలా పరిణతితో ఆలోచించగలిగితే తిరుగుండదని నిరూపించారు. మరి, మన జీవితాల్ని, కెరీర్‌ని తీర్చిదిద్దుకునేందుకు ఈ నాయికల నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

పెళ్లికీ సమ ప్రాధాన్యం!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. కానీ సెలబ్రిటీల ఆలోచన ఇందుకు భిన్నం! పెళ్లైతే కెరీర్‌ ముగిసిపోతుందని, అమ్మైతే సినిమా అవకాశాలు తగ్గిపోతాయనుకునే వారు చాలామంది. మొన్నటిదాకా చిత్ర పరిశ్రమలో ఉన్న ఈ తరహా మూసధోరణే ఇందుకు కారణం. పెళ్లై, పిల్లలు పుట్టిన కథానాయికలకు వాళ్ల ట్యాలెంట్‌కు తగ్గ అవకాశాలివ్వకపోగా, ఒకవేళ ఛాన్స్‌ ఇచ్చినా అమ్మ పాత్రలోనో, వదిన పాత్రలోనో.. ఇలా సహాయక పాత్రల్లోనే వారు నటించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నీ ఎందుకన్న ఉద్దేశంతో.. కెరీర్‌కు ప్రాధాన్యమిచ్చి 40 ఏళ్ల దాకా పెళ్లి ఊసెత్తని కథానాయికలూ కొందరున్నారు. మరికొందరు వివాహమైనా ఆ విషయాన్ని దాచిపెట్టి.. నటిగా పలు విజయాల్నీ అందుకున్నారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. కెరీర్‌తో పాటు పెళ్లికీ సమప్రాధాన్యమిస్తున్నారు ఈతరం నాయికలు. కియారా అడ్వానీ, కృతీ కర్బందా, ఆలియా భట్‌, పరిణీతి చోప్రా.. ఇలా వీరంతా 35 ఏళ్లు నిండక ముందే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లైనా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇక నిర్మాతలు కూడా వీరికి పెళ్లైందన్న విషయం పక్కన పెట్టి.. వీళ్ల ప్రతిభ, అంకితభావంపై నమ్మకముంచి పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలిస్తున్నారు. వీటిని అందిపుచ్చుకొని తెరపై మంచి విజయాల్ని అందుకుంటున్నారు. ఇలా వివాహం కెరీర్‌ అభివృద్ధికి ఏమాత్రం అడ్డుకాదని వీరు నిరూపిస్తున్నారు. కాబట్టి ప్రతిభ, పనిపై అంకితభావం, ఆత్మవిశ్వాసం ఉంటే.. ఎన్ని అడ్డంకులెదురైనా లక్ష్యం వైపు అడుగులేయచ్చన్న విషయం వీరిని చూసి నేర్చుకోవచ్చు.


తల్లైనా తగ్గేదేలే!

‘అమ్మైతే అందం తగ్గిపోతుంది.. తద్వారా సినీ అవకాశాలూ అడుగంటిపోతాయి..’ ఈ భావనతోనే గతంలో కొంతమంది నాయికలు ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకునేవారట! ఇలాంటి వెసులుబాటు లేక పిల్లల్ని కంటే మాత్రం నిజంగానే వారిని పక్కన పెట్టేసేవారట కొందరు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలా అనుకొనే రోజులు పోయాయి. అలాగే ఈ తరం నాయికల ఆలోచనలూ ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. అటు కెరీర్‌కు, ఇటు అమ్మతనానికీ.. రెండింటికీ సమప్రాధాన్యమిస్తున్నారు కొందరు అందాల తారలు. కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌లు ఇదే కోవకు చెందుతారు. పెళ్లై, పిల్లలు పుట్టినా.. తక్కువ సమయంలోనే తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి నటీమణులుగా రాణిస్తున్నారు. తెరపై హీరోయిన్లుగా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.. వారు నటించిన సినిమాలూ మంచి విజయాలు అందుకుంటున్నాయి.

కాబట్టి తల్లయ్యాను, కెరీర్‌ బ్రేకొచ్చింది, వెనకబడిపోయాను.. అన్న నెగెటివ్‌ ఆలోచనలకు తావివ్వకుండా.. ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ్నుంచే తిరిగి కెరీర్‌ ప్రయాణం ప్రారంభించాలి. మీరు ఎంచుకున్న రంగాల్లో కొత్త పోకడల్ని అనుసరిస్తూనే, అప్‌-టు-డేట్‌గా ఉంటే.. ఈ అందాల నాయికల్లా మీ కెరీర్‌కూ తిరుగుండదనడంలో సందేహం లేదు.


ఆర్థిక స్వేచ్ఛ కావాలి!

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో నటి తాప్సీ ఓ మాట చెప్పింది. ‘ప్రతి అమ్మాయీ పెళ్లికి ముందే ఆర్థిక సాధికారత సాధించాలి. ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే పెళ్లి గురించి ఆలోచించాలి..’ అని! కేవలం చెప్పడమే కాదు.. తానూ అదే చేసి చూపించింది కూడా! ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే తన ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ మాథియాస్‌ బోతో ఏడడుగులు నడిచింది. ఇలా తనొక్కర్తే కాదు.. కొంతమంది నాయికలూ ఇలా ఆర్థిక స్వేచ్ఛ సాధించాకే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఆ తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నారు. ఒకవేళ పలు కారణాల రీత్యా నటిగా అవకాశాలు తగ్గినా.. దర్శక, నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొందరు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నారు.  అంతేనా.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, తామే స్వయంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం.. ఇలా వ్యాపారవేత్తలుగానూ రాణిస్తున్నారు మరికొందరు తారలు. వీరిలో నయనతార ‘9స్కిన్‌’ అనే బ్యూటీ బ్రాండ్‌ని ప్రారంభించగా, ఆలియా భట్‌ ‘Ed-a-mamma’ అనే కిడ్స్‌ వేర్‌ బ్రాండ్‌ని తెరిచింది.. ఇక గత కొన్నేళ్లుగా కత్రినా ‘కె-బ్యూటీ’ పేరుతో సౌందర్యోత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే! బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ శిల్పా శెట్టి ‘మామా ఎర్త్‌’, అనుష్కా శర్మ ‘బ్లూ ట్రైబ్‌’, ప్రియాంక చోప్రా ‘బంబుల్‌’లో పెట్టుబడులు పెట్టారు.

ఏదేమైనా.. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యమని, అదే సమాజంలో మనకో హోదాను అందిస్తుందని తమ విజయాలతో చెప్పకనే చెబుతున్నారీ నాయికలు. కాబట్టి నచ్చిన కెరీర్‌లో కొనసాగడం, ఆసక్తి ఉన్న అంశాల్ని కెరీర్‌ మార్గాలుగా ఎంచుకోవడం వల్ల తిరుగులేకుండా ముందుకు సాగచ్చని వీరి ద్వారా మనం నేర్చుకోవచ్చు.


‘స్మార్ట్‌’ ప్లానింగ్‌!

పక్కా ప్లానింగ్‌తోనే ఏ పనైనా సక్సెసవుతుందన్న మాట వాస్తవం. అందాల నాయికల విషయంలోనూ ఇది వర్కవుట్‌ అవుతోంది. సినిమాల ఎంపిక దగ్గర్నుంచి.. పెళ్లెప్పుడు చేసుకోవాలి?, పిల్లల్ని ఎప్పుడు కనాలి?.. ఇలా ప్రతి విషయంలో పకడ్బందీగా ఆలోచిస్తూ, చక్కటి ప్రణాళికతోనే ముందుకు సాగుతుంటారు వారు. ఇందులో భాగంగానే ప్రియాంక చోప్రా, రిచా చద్దా, నేహా ధూపియా.. తదితర తారలు ముందు జాగ్రత్తగా ఆలోచించే తాము తమ అండాల్ని భద్రపరచుకున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. అలాగే ఆర్థిక విషయాల్లో సందేహాలు తీర్చడానికి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడానికీ వారు వెనకాడరు. ఇలా ప్రతి విషయంలోనూ స్మార్ట్‌గా, వేగంగా ఆలోచించడమే వీరి విజయానికి కారణమని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మనమూ వీరిలా ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ పక్కా ప్రణాళిక వేసుకొని ముందుకు సాగడం.. ఆయా విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల.. అటు జీవితంలో, ఇటు కెరీర్‌లో ముందుకు దూసుకోవచ్చు.


ఇంటిని మర్చిపోవద్దు!

ఉద్యోగాలు చేసే మహిళలకు అతిపెద్ద సమస్యేంటంటే.. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌! కానీ ఈ విషయంలోనూ కొందరు అందాల నాయికలు మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. ఇంటికి, పిల్లల బాధ్యతలకు ప్రాధాన్యమివ్వడం, ప్రత్యేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో గడపడం, ఆ సంతోషాన్ని-సరదాల్ని ఫొటోలు, వీడియోల రూపంలో మనతో పంచుకోవడం.. ఇలా కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా ఇంటిని మర్చిపోవద్దని చెప్పకనే చెబుతున్నారు వారు. దీనివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎదురయ్యే సమస్యల్ని, ఒత్తిళ్లను ఇట్టే దూరం చేసుకోవచ్చనీ వారు పరోక్షంగా హితవు పలుకుతున్నారు. నయనతార, ఆలియా భట్‌, ప్రియాంక చోప్రా.. తదితర ముద్దుగుమ్మలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి మనమూ ఇంటి పనులు, ఆఫీస్‌ బాధ్యతల్లో అవసరమైన పనులకే ప్రాధాన్యమివ్వగలిగితే.. ఈ ముద్దుగుమ్మల్లా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.. ఏమంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్