Gitika Aggarwal: ఆస్కార్‌.. లాయర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ గెల్చుకున్న భారతీయ చిత్రాలు. గెలుపు కబురు వినగానే వాటికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరి గురించీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపారు.

Updated : 07 Apr 2023 20:23 IST

కొత్త దారి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ గెల్చుకున్న భారతీయ చిత్రాలు. గెలుపు కబురు వినగానే వాటికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరి గురించీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి చూపారు. ప్రశంసలూ అందించారు. వాటిల్లో ఓ లాయరమ్మకీ భాగస్వామ్యం ఉందని తెలుసా? సినిమాకీ, లాయర్‌కీ సంబంధమేమిటంటారా? తెలుసుకోవాలంటే గీతికా అగర్వాల్‌ని కలుసుకోవాల్సిందే!

గీతిక అగర్వాల్‌.. దిల్లీలో పేరున్న న్యాయవాది. సొంత న్యాయ సంస్థనీ నిర్వహించేవారు. ఓసారి ఆమె స్నేహితురాలు తన సంస్థ మేధో సంపత్తి హక్కుల విషయంలో సాయం కావాలంటే ముంబయిలో అడుగుపెట్టారు. దానిపై లోతుగా పరిశోధన చేశారు. ఈ క్రమంలోనే వినోద రంగం గురించి తెలిసిందామెకు. అధ్యయనం చేస్తున్నకొద్దీ ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలా సరికొత్త అంశాలు, ఊహించని నిబంధనలు కనిపించాయి. దాంతోపాటు సినిమాలు, నిర్మాణ సంస్థల తరఫున పనిచేసే లాయర్లు చాలా తక్కువని అర్థమైంది. నేర్చుకోవడంతోపాటు రాణించడానికీ అవకాశముంటుంది అనుకున్నారు గీతిక. ఇంకేం.. 2011లో మకాం ముంబయికి మార్చారు. ఈ రంగంలోని సాధకబాధకాలు, ఆచరణాత్మక ఇబ్బందులు తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టారు. దీనికోసం నిర్మాణ సంస్థలు, ఫిల్మ్‌మేకర్లతో సమావేశమయ్యేవారు. ఆ సమయంలో తనకంటూ ఓ కార్యాలయం లేకపోతే ఆస్కార్‌ అవార్డు గ్రహీత గునీత్‌ మోంగా తన ఆఫీసులో కొద్ది స్థలం కేటాయించారు. అక్కడ ఉంటూ సినీ జనాలతో చర్చించడం, అవార్డుల ప్రదానోత్సవాలకు వెళ్లడం చేసేవారు. క్రమంగా పరిచయాలు పెరిగి ‘ది గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’, ‘మసాన్‌’, ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సహా 400కుపైగా చిత్రాలకు న్యాయ సలహాలు ఇచ్చారామె.

సినిమాలకు లాయరెందుకు?

తెర మీద కనిపించేది నటీనటులైనా.. వెనక ఎన్నో విభాగాల వాళ్లు పనిచేస్తారు. అవునా? అలాగే సినిమా హక్కులు, రాయితీల విషయంలో లాయర్ల అవసరమూ ఉంటుంది. ఉదాహరణకు హిందీ సినిమా ‘ది లంచ్‌బాక్స్‌’నే తీసుకుందాం. ఈ చిత్రానికి ఫ్రాన్స్‌, అమెరికా, జర్మనీ నుంచి పెట్టుబడులొచ్చాయి. వేర్వేరు దేశాల సాంకేతిక నిపుణులు పని చేశారు. సినిమా నిర్మాణం విషయంలో ఒక్కో దేశంలో పన్నులు, రాయితీలు, చట్టాలు, సెన్సార్‌, విడుదల నిబంధనలు ఒక్కోలా ఉంటాయి. ఇలాంటి సమయంలో న్యాయ నిపుణుల అవసరం తప్పనిసరి. అంతేకాదు మన సినిమాలు విదేశాల్లో ఆడుతుంటాయి. అలాంటప్పుడు ప్రైవేటు పెట్టుబడులు, లాభాల్లో వాటా, శాటిలైట్‌, మేధోహక్కులు కాపాడుకోవడం, మార్కెటింగ్‌ కోసం కొత్తదారులు వెతకడం లాంటి ఎన్నో అంశాలుంటాయి. అంతేనా.. కథాపరంగా న్యాయ వివాదాల్లో చిక్కుకుంటే వాదించడం, సినిమా హిట్‌ కొడితే.. ఆ విజయాన్ని డబ్బుగా మలచడం, ఓటీటీ ఒప్పందాలు లాంటి ఎన్నింట్లోనో లాయర్‌ పాత్ర ఉంటుంది. వీటన్నింటినీ విజయవంతంగా నిర్వర్తిస్తూ.. 400కుపైగా చిత్రాలకు పని చేయడం అంటే మాటలు కాదు. మహిళగా మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాలి. అయినా ‘సినిమాలకు పని చేయడం, వ్యాపారాన్ని పెంచి నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టడాన్ని ఆస్వాదిస్తా. నా ద్వారా ఒక సినిమా విజయవంతమైతే వందలమందికి ప్రయోజనం కలుగుతుందన్న భావన ఆనందాన్నిస్తుంది. అందుకే మరింత ఉత్సాహంగా పనిచేస్తా. పైగా ఆసక్తి కూడా’ అంటూ అరుదైన వృత్తిలోని విజయ రహస్యాన్ని బయటపెడుతున్నారు గీతిక. ఇదండీ.. ఈ ఆస్కార్‌ లాయరమ్మ కథ!


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్