టీమ్ లీడర్.. ఇలా ఉండాలి!

నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ఎన్నో విషయాలను రామాయణం మనకు బోధిస్తుంది. వ్యక్తిత్వపరంగా నేర్చుకోవాల్సిన అనేక మంచి అంశాలతో పాటు నాయకత్వ లక్షణాలను ఒంట పట్టించుకోవడానికి కూడా రామాయణం దోహదపడుతుంది. అందుకే మేనేజ్‌మెంట్ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడానికి...

Published : 30 Mar 2023 15:14 IST

నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే ఎన్నో విషయాలను రామాయణం మనకు బోధిస్తుంది. వ్యక్తిత్వపరంగా నేర్చుకోవాల్సిన అనేక మంచి అంశాలతో పాటు నాయకత్వ లక్షణాలను ఒంట పట్టించుకోవడానికి కూడా రామాయణం దోహదపడుతుంది. అందుకే మేనేజ్‌మెంట్ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడానికి వాల్మీకి రామాయణం, వ్యాస మహాభారతంలోని విషయాలను పాఠ్యాంశాలుగా బోధిస్తుంటారు. ఈ క్రమంలో రాముణ్ని 'ఆధునిక మేనేజ్‌మెంట్ గురు'గా కూడా అభివర్ణించడం గమనార్హం.

బృందాన్ని నడిపించాలి..

జీవితంలో కొన్ని లక్ష్యాలను సాధించాలంటే కేవలం అది ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం కాకపోవచ్చు. కొన్నిసార్లు బృందంతో కలసి పనిచేయాల్సి రావచ్చు. ఒక్కోసారి ఆ బృందానికే నాయకత్వం వహించాల్సి రావచ్చు. అప్పుడు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సమర్థంగా పనిని పూర్తిచేయగలగాలి. నాయకుడు కచ్చితంగా కలిగి ఉండాల్సిన లక్షణం ఇది. వనవాస సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు రాముడు వానరసేన సహాయం తీసుకున్నాడు. వానరులు చంచల మనస్తత్వం కలిగినవారు. అయినప్పటికీ తిరుగులేని తన నాయకత్వం ద్వారా వారందరినీ ఏకం చేసి రావణుడిపై రాముడు విజయం సాధించాడు. నాయకుడు నేర్పరి అయితే బృందంలోని సభ్యుల శక్తిసామర్థ్యాల్లో హెచ్చుతగ్గులున్నా విజయాన్ని సొంతం చేసుకోవచ్చని రాముడు రుజువు చేశాడు.

సహచరుల ప్రతిభపై విశ్వాసం..

నాయకుడు ఎల్లప్పుడూ బృందంలోని సభ్యుల ప్రతిభపై విశ్వాసం కలిగి ఉండాలి. వారి సామర్థ్యాన్ని, ఆసక్తిని గుర్తించి అందుకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలి. రామసేనలో హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు లాంటి బలవంతులతో పాటు అల్పులైన వానరసేన కూడా ఉంది. లంకను చేరడానికి సముద్రంపై వారధి కట్టాల్సి వచ్చినప్పుడు వానరులందరినీ ఏకం చేసి, వారధి నిర్మించేలా ప్రోత్సహించి కష్టమైన పనిని సుసాధ్యం చేశాడు. అందుకే బృందానికి నాయకత్వం వహించే వారికి ఉండాల్సిన ముఖ్య లక్షణాల్లో ఇదీ ఒకటి.

స్పష్టమైన లక్ష్యం..

రాముని నుంచి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగానూ నేర్చుకోదగిన మరో చక్కటి అంశం స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండటం. దాన్ని ఎలా చేరుకోవాలో సరైన ప్రణాళిక రూపొందించుకోవడం. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత రాముని ఏకైక లక్ష్యం ఆమెను విడిపించడం. అందుకు అనుగుణంగానే ముందుకు కదిలాడు. వానరులతో జట్టు కట్టాడు. సమయానికి తగినట్లుగా స్పందించాడు. చివరికి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఉత్తమ నాయకురాలిగా ఎదగడంలో ఈ లక్షణం బాగా ఉపయోగపడుతుంది.

సహచరుల నుంచీ సలహాలు..

టీమ్‌లీడర్‌కి ఉండాల్సిన మరో ముఖ్యమైన లక్షణం తీసుకొనే నిర్ణయాల్లో అందరినీ భాగస్వాములను చేయడం. అందుకు అనుగుణంగా వారి నుంచి ఎప్పటికప్పుడు సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగిపోవాలి. మీ నిర్ణయాలతో వారు విభేదిస్తే దానికి కారణం తెలుసుకోవాలి. వారు చెప్పే దాంట్లో విలువైన అంశం ఉంటే దానిని పరిగణనలోకి తీసుకోవాలి. మీ నిర్ణయాన్ని వారు అంగీకరించేలా ఒప్పించాలి. రావణుడి తమ్ముడైన విభీషణుడు రాముని దగ్గరకు శరణు కోరి వచ్చినప్పుడు రాముడు అతనికి ఆశ్రయం కల్పిస్తాడు. దానిని కొంతమంది వానరులు వ్యతిరేకిస్తారు. దీని గురించి వారితో చర్చించడంతో పాటు తన నిర్ణయానికి గల కారణాన్ని కూడా వివరిస్తాడు శ్రీరాముడు.

లక్ష్యాన్ని చేరడమెలా?

సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్వేషించాలి. దానికి అనుగుణంగా బృందంలోని సభ్యులను వివిధ విభాగాలుగా విభజించుకోవాలి. రావణునితో యుద్ధం చేసే సమయంలో రాముడు ఇదే పని చేశాడు. తన సైన్యాన్ని యుద్ధ నైపుణ్యాల ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించాడు. ఒక్కో విభాగానికి నాయకులను నియమించాడు. రాక్షస సేనను మట్టుపెట్టాడు. తక్కువ సమయంలో సీతను రావణుడి చెర నుంచి విడిపించాడు.

ఆత్మవిశ్వాసం ముఖ్యం..

మన ప్రత్యర్థి ఎంత బలవంతుడైనప్పటికీ మెండైన ఆత్మవిశ్వాసం ఉంటేనే వారిని ఎదుర్కోగలం. లేదంటే మనం తలపెట్టిన కార్యం ఆదిలోనే హంసపాదు అన్న చందంగా తయారవుతుంది. అలా అని మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా పనికి రాదు. ప్రత్యర్థి బలాలు, బలహీనతలు తెలుసుకొని, మీకున్న అనుకూల అంశాలను దృష్టిలో పెట్టుకొని మసలుకోవాలి. రావణుడికి బలమైన సేనావాహిని ఉంది. వారు ఎన్నో యుద్ధాల్లో దేవతలను సైతం ఓడించారు. కానీ రాముని దగ్గర వానరసేన మాత్రమే ఉంది. అయినా రాముడు ఎప్పుడూ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అంతేకాదు తన సహచరులలోనూ దాన్ని నింపాడు. విజయం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్