పోషకాల తాటి ముంజలు.. తింటున్నారా?

వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. వీటిని కన్నడలో 'తాటి నుంగు' అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు.

Updated : 05 Apr 2024 13:09 IST

వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. వీటిని కన్నడలో 'తాటి నుంగు' అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. మరి శరీరాన్ని చల్లబరిచే ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

చలువ కోసం..

ఈ పండులో క్యాలరీలు తక్కువ మొత్తంలో, శరీరానికి కావాల్సిన శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి.. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే!

డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం..

ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా అది చెమట రూపంలో బయటికి వెళ్లిపోయి డీహైడ్రేట్ అయిపోవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, చక్కెరలను ఇవి బ్యాలన్స్ చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

బరువునూ తగ్గిస్తాయి..!

తాటి ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం.. వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

విషపదార్థాలు మాయం..

తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి. ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది.

గర్భిణులకూ మంచిదే..

ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి ఈ పండ్లు.

క్యాన్సర్ల నుంచి..

తాటి ముంజలు.. వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటోకెమికల్స్, ఆంథోసయనిన్ లాంటి వాటిని నిర్మూలిస్తాయి. కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.

అలసట దూరం..

వేసవిలో అలా కాసేపు బయటికి వెళ్లొస్తేనే అలసిపోతాం కదా! అంతేకాదు.. విపరీతమైన చెమట కూడా పట్టేస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందించి, అలసట నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులువైన మార్గం.. తాటి ముంజల్ని తినడం.

పొట్టు తీయకుండా తినాలి..

చాలామంది ముంజల పైన పొట్టు లాగా ఉండే పైపొర తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

సో.. తెలిసిందిగా.. వేసవిలో మాత్రమే దొరికే తాటి ముంజల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని!.. మరింకెందుకాలస్యం? చల్లటి తాటి ముంజలతో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందండి.. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్