Updated : 03/03/2023 15:59 IST

మహిళల్లో గుండెపోటు.. ఈ విషయాలు మీకు తెలుసా?

గుండెపోటు.. సాధారణంగా ఇది పురుషుల్లోనే ఎక్కువనుకుంటాం. కానీ మహిళల్లోనూ ఈ ప్రమాదం పొంచి ఉందని, స్త్రీల మరణాలకు కారణమయ్యే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో మహిళలు అశ్రద్ధ చేయద్దని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ తనకు గుండెపోటు వచ్చిందని తాజాగా పెట్టిన పోస్ట్‌ ఈ ప్రాణాంతక సమస్యపై మహిళల్ని మరింత అప్రమత్తం చేసిందని చెప్పచ్చు. అయితే సమస్య వచ్చాక పరిష్కారం వెతుక్కోవడం కంటే.. రాకుండా ముందు నుంచే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యం విషయంలో మహిళలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలకమైన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

గుండెపోటొచ్చింది.. స్టెంట్‌ వేశారు!

చాలామంది సెలబ్రిటీలు తమ ఆరోగ్య సమస్యల గురించి బయటికి చెప్పుకోరు.. కానీ కొంతమంది వాటి గురించి బయటపెడుతూనే.. ఆరోగ్యం విషయంలో తమ ఫ్యాన్స్‌ని అప్రమత్తం చేస్తుంటారు. బాలీవుడ్‌ బ్యూటీ సుస్మితా సేన్‌ తాజాగా ఇదే చేసింది. ఇటీవలే తాను గుండెపోటుకు గురయ్యానంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టి అందరినీ షాక్‌కి గురిచేసిందీ అందాల తార.

తన తండ్రితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘గుండెను ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచుకుంటే.. కష్టకాలంలో అది నీకు తోడుగా నిలుస్తుంది.. నాన్న సుబీర్‌ సేన్‌ ఎప్పుడూ నాతో ఈ మాటలు చెబుతుండేవారు. రెండు రోజుల క్రితం నాకు గుండెపోటొచ్చింది. ఆంజియోప్లాస్టీ చేసి స్టెంట్‌ వేశారు. నాకు చికిత్స చేసిన డాక్టర్‌ ‘మీది చాలా గట్టి గుండె’ అన్నారు (నవ్వుతూ)! నా ఆరోగ్యం గురించి నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియాలనే ఈ పోస్ట్‌ పెడుతున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా.. కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ బ్యూటీ. ప్రస్తుతం సుస్మిత పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు సుస్మిత త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇలా తన పోస్ట్‌తో గుండెపోటు విషయంలో మహిళల్ని మరింత అప్రమత్తం చేసిందీ బాలీవుడ్‌ తార.

ప్రతి ముగ్గురిలో ఒకరు!

గుండెపోటు సాధారణంగా పురుషుల్లోనే ఎక్కువనుకుంటాం. కానీ దీని బారిన పడి మరణిస్తోన్న మహిళల సంఖ్యా ఏటికేడు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఏటా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గుండెజబ్బుతో మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు.. 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు కారణంగా మరణించే ప్రమాదం రెండింతలుగా ఉన్నట్లు మరో నివేదిక చెబుతోంది. ఏదేమైనా ఇవన్నీ పరిశీలిస్తే.. మహిళలూ గుండె ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయం అర్థమవుతోంది.

ఛాతీలో నొప్పి లేకపోయినా..!

సాధారణంగా గుండెపోటుకు ప్రధాన సంకేతం ఛాతీలో నొప్పి, పట్టేసినట్లుగా ఉండడం. అయితే ఛాతీలో నొప్పి లేకపోయినా మహిళల్లో కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. అవేంటంటే..!

మెడ, దవడ, భుజాలు, పొట్ట పైభాగం/ఛాతీ కింది భాగం.. ఇలా ఆయా శరీర భాగాల్లో నొప్పిగా, అసౌకర్యంగా అనిపించడం.

ఊపిరి అందకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం.

ఒక చెయ్యి లేదా రెండు చేతులు నొప్పిగా, లాగినట్లుగా అనిపించడం.

వికారం-వాంతులు, ఉన్నట్లుండి చెమటలు పట్టడం.

మైకం కమ్మినట్లుగా అనిపించడం.

విపరీతమైన అలసట, నీరసం.

అజీర్తి, గుండెలో మంట.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే గుండె రక్తనాళాల్లో ఏవో అడ్డంకులున్నట్లుగా/మూసుకుపోయినట్లుగా గుర్తించమంటున్నారు నిపుణులు. అలాగే పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటుకు పూర్తి విభిన్నమైన లక్షణాలుండడంతో చాలామంది ఈ విషయంలో అలక్ష్యం చేస్తున్నట్లు, ఈ అశ్రద్ధే భవిష్యత్తులో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి లక్షణాల్ని గుర్తించిన వెంటనే సమస్యను నిర్ధరించుకోవడానికి వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం అంటున్నారు.


ఎవరికి ముప్పు ఎక్కువ?!

ఆరోగ్యవంతమైన మహిళలతో పోల్చితే.. కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలున్న మహిళల్లో గుండెపోటు ముప్పు మరింతగా పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు.

మధుమేహం ఉన్న పురుషులతో పోల్చితే.. మధుమేహం ఉన్న మహిళల్లో గుండెపోటు ముప్పు 50 శాతం ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించకుండానే గుండెపోటు (సైలెంట్‌ హార్ట్‌ అటాక్‌)కు గురైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు.

ఒత్తిడి, ఆందోళన.. పురుషుల కంటే మహిళల పైనే ప్రభావం చూపుతుంటుంది. అలాగే ఈ మానసిక సమస్యల వల్ల పురుషుల కంటే మహిళలకే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట!

శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం కూడా మహిళల్లో గుండెపోటుకు ఓ కారణంగా చెబుతున్నారు నిపుణులు.

మెనోపాజ్‌ తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గిపోవడం వల్ల కూడా గుండెపోటు ముప్పు పెరుగుతుందంటున్నారు నిపుణులు.

గర్భిణిగా ఉన్న సమయంలో మహిళల్లో వచ్చే హైపర్‌టెన్షన్‌, మధుమేహం.. వంటి సమస్యలు కొంతమందిలో దీర్ఘకాలం పాటు కొనసాగుతుంటాయి. ఇవీ భవిష్యత్తులో గుండెపోటుకు కారణమవుతాయంటున్నారు నిపుణులు.

ఊబకాయం, రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌.. వంటి సమస్యలతో పాటు కొంతమంది మహిళల్లో వంశపారంపర్యంగానూ గుండెపోటు ముప్పు పొంచి ఉంటుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


నివారణ మన చేతుల్లోనే..!

పలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నా, లేకపోయినా.. గుండె ఆరోగ్యం విషయంలో ముందు నుంచీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే.. గుండెపోటు ముప్పును చాలా వరకు దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

తీసుకునే ఆహారం విషయంలో తగిన శ్రద్ధ చూపడం ముఖ్యం. ఈ క్రమంలో తృణధాన్యాలు, పండ్లు, కాయగూరలు, కొవ్వులు తక్కువగా ఉండే పాలు-పాల పదార్థాలు, మాంసం.. వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే కూరల్లో చక్కెర, ఉప్పు.. తగ్గించి వేసుకోవడం మంచిది. బయట దొరికే ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో చెడు కొవ్వులు (ట్రాన్స్‌ ఫ్యాట్స్‌) ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది.

బరువును అదుపులో ఉంచుకోవడానికి నిపుణుల సలహా మేరకు తగిన వ్యాయామాలు చేయడం మంచిది.

ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకొని.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం, యోగా.. చక్కటి ప్రత్యామ్నాయాలు. ఈ క్రమంలో మనసుకు నచ్చిన పనులు చేస్తూ కూడా సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చు.

పొగ తాగే వారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ పొగ పీల్చడం వల్ల కూడా గుండె రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు మందులు వాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఆయా సమస్యల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. అలాగే నిపుణుల సూచన మేరకు నిర్ణీత వ్యవధుల్లో గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం అత్యుత్తమం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని