ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారా?

మారుతోన్న జీవనశైలిలో చదువు పరిధి క్రమంగా విస్తరిస్తోంది. చాలామంది ఉన్నత విద్యను అభ్యసించడానికి పట్టణాలు, నగరాలు దాటి విదేశాలకు వెళ్లడానికి కూడా వెనకాడడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళుతోన్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరగడమే ఇందుకు నిదర్శనం.

Published : 09 Jan 2024 12:26 IST

మారుతోన్న జీవనశైలిలో చదువు పరిధి క్రమంగా విస్తరిస్తోంది. చాలామంది ఉన్నత విద్యను అభ్యసించడానికి పట్టణాలు, నగరాలు దాటి విదేశాలకు వెళ్లడానికి కూడా వెనకాడడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళుతోన్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరగడమే ఇందుకు నిదర్శనం. అయితే ఎన్నో ఆశలతో విదేశాల్లో అడుగుపెట్టే విద్యార్థులకు కొత్త అనుభూతితో పాటు పలు సవాళ్లు పలకరిస్తుంటాయి. ఈ క్రమంలో కొత్త వాతావరణానికి అలవాటు పడడంతో పాటు.. అక్కడ సాధ్యమైనంత త్వరగా కొత్త స్నేహాలను ఏర్పరచుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల కొత్త ప్రదేశంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా చేధించవచ్చంటున్నారు.

ఆ కార్యక్రమాలకు వెళ్లండి...

ప్రపంచంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఫ్రెషర్స్‌కు ఓరియంటేషన్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేస్తుంటాయి. ఇందులో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు హాజరవుతుంటారు. ఈ మీటింగ్‌కు వెళ్లడం వల్ల క్యాంపస్‌, అకడమిక్‌ స్ట్రక్చర్, అక్కడ ఉండే వసతులు.. వంటి వివరాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీలాగే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను కూడా కలుసుకోవచ్చు. తద్వారా మీ అభిప్రాయాలు, ఆలోచనలకు తగిన వ్యక్తులు కలిస్తే స్నేహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత మేరకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే ఓరియంటేషన్ మీటింగ్‌కు వెళ్లమని సూచిస్తున్నారు నిపుణులు.

ఆ వసతిలోనే...

విదేశాలకు వెళ్తున్నామంటే చాలామంది ఎక్కడ ఉండాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది యూనివర్సిటీ కల్పించే వసతిని ఎంపిక చేసుకుంటే.. మరికొంతమంది ప్రైవేట్‌ హాస్టల్స్‌ను ఎంపిక చేసుకుంటారు. ఇంకొంతమంది హోమ్‌స్టేను ఎంచుకుంటారు. అయితే యూనివర్సిటీ కల్పించే వసతిలో ఉండడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా భిన్న నేపథ్యాలున్న విద్యార్థులు ఉంటారు. ఫలితంగా స్నేహితులను ఏర్పరచుకోవడం సులభమవుతుంది. అలాగే విద్యార్థి సంఘాలు, క్లబ్‌లు, స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరవుతుండాలి. ఫలితంగా మీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు తారసపడితే స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది.

సామాజిక మాధ్యమాల్లోనూ...

ఈ రోజుల్లో కొత్త ప్రాంతాలకు వెళ్లేవారికి వివిధ అవసరాలకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కాబట్టి, టెక్నాలజీ సహాయంతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లు లేదా సోషల్‌ మీడియా గ్రూపుల్లో చేరండి. వీటిల్లో చాలామంది తమ అనుభవాలను పంచుకుంటుంటారు. అలాగే మీ సందేహాలను ఈ మాధ్యమాల ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకేరకమైన ఆలోచనలు ఉన్నవారు కూడా పరిచయమ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి, విదేశాలకు వెళ్లాలనుకుంటే ముందుగానే ఇలాంటి మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా నెట్వర్కింగ్‌ ఏర్పరచుకోవచ్చు.

మాట్లాడాలి...

కొంతమంది మాట్లాడితే అవతలి వ్యక్తులు ఏదో అనుకుంటారని మౌనంగా ఉంటారు. ఇలాంటి ప్రవర్తన కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి, అవకాశం లభించినప్పుడు కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి ఏమాత్రం సంకోచించద్దు. కొన్ని సందర్భాల్లో చిన్న సంభాషణ కూడా ఎన్నో పరిష్కారాలను చూపిస్తుంది. అయితే స్నేహం ఏర్పడడానికి పెద్దగా సమయం పట్టకపోయినా.. అది బలపడడానికి మాత్రం సమయం పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో అవతలి వ్యక్తిని సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. స్నేహంలో వాటిని కూడా గౌరవిస్తూ ముందుకు సాగుతుండాలి.

భాషను పంచుకోవడంతో...

కొన్ని విశ్వవిద్యాలయాలు లాంగ్వేజ్‌ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటాయి. ఇందులో భాగంగా ఇతరుల స్థానిక భాషల గురించి తెలుసుకోవడంతో పాటు మీ భాష గురించి వారికి తెలియజేయచ్చు. దీని ద్వారా మీరు కొత్త భాష గురించి తెలుసుకోవడంతో పాటు కొత్త వ్యక్తులతో మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే యూనివర్సిటీలు ఏర్పాటు చేసే వర్క్‌షాప్‌లు, సెమినార్లు, గెస్ట్‌ లెక్చర్స్‌కు కూడా హాజరవ్వడానికి ప్రయత్నించండి. దీని ద్వారా ఒకే కెరీర్‌లో ఉండే వివిధ వ్యక్తులను కలుసుకునే అవకాశం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్