మూడ్‌ మార్చేసే ఇంటీరియర్‌ డిజైనింగ్‌!

మనం వెళ్లిన ప్రాంతమైనా, వాడే వస్తువైనా, ధరించే దుస్తులైనా.. మన శరీరానికి సౌకర్యాన్నిచ్చినప్పుడే.. మనసూ ప్రశాంతంగా ఉంటుంది. ఇంటీరియర్‌కూ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు....

Published : 25 May 2024 13:41 IST

మనం వెళ్లిన ప్రాంతమైనా, వాడే వస్తువైనా, ధరించే దుస్తులైనా.. మన శరీరానికి సౌకర్యాన్నిచ్చినప్పుడే.. మనసూ ప్రశాంతంగా ఉంటుంది. ఇంటీరియర్‌కూ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. నచ్చిన ఫర్నిచర్‌తో ఇంటిని అలంకరించుకుంటే.. సౌకర్యవంతంగానే కాదు.. మనసుకూ ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం! పైగా ఎంత సేపైనా అక్కడే ఉండాలనిపిస్తుంది. ఇదే పరోక్షంగా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేస్తుందట! అందుకే నచ్చినట్లుగా ఇంటిని అలంకరించుకుంటే.. రోజువారీ ఒత్తిళ్లు, ఆందోళనలు దూరమై హ్యాపీగా ఉండచ్చని పలు అధ్యయనాలూ చెబుతున్నాయి. మరి, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం రండి..

గదిని బట్టి.. రంగులు!
ఇంటి అందాన్ని పెంచడంలో, మనసుకు ఆహ్లాదాన్ని అందించడంలో రంగులది కీలక పాత్ర! నచ్చిన రంగుల్ని ఎంచుకుంటే.. అటు సౌకర్యంగా, ఇటు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదే శరీరంలో డోపమైన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. తద్వారా సంతోషంగా ఉండగలుగుతాం. అయితే మనకు నచ్చిన రంగుల్ని ఎంచుకుంటే సరిపోదు.. గది అవసరాల్నీ పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. పడకగదిలో రిలాక్సవుతాం.. కాబట్టి ఇక్కడ మనసుకు ప్రశాంతతను అందించే లేత రంగులు, అందులోనూ ముఖ్యంగా పేస్టల్‌ షేడ్స్‌ని ఎంచుకోవడం మంచిదంటున్నారు. అదే కిచెన్‌లో పనిచేసే సమయంలో ఉత్సాహంగా, చురుగ్గా ఉంటేనే పనులు సమయానికి పూర్తవుతాయి. కాబట్టి ఈ గదికి ఎరుపు, ఆరెంజ్‌.. వంటి రంగులు నప్పుతాయంటున్నారు. ఇలా గది ప్రత్యేకతల్ని బట్టి రంగుల్ని ఎంచుకుంటే.. అది ఆటోమేటిక్‌గా మనసుపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

‘బయోఫిలిక్‌ డిజైన్‌’ తెలుసా?
ఇంటి అలంకరణ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు తమ ఇల్లు మోడ్రన్‌గా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు వింటేజ్‌ థీమ్‌ని ఎంచుకుంటుంటారు. అయితే ఎవరి ఇష్టాయిష్టాలెలా ఉన్నా.. బయోఫిలిక్‌ ఇంటీరియర్‌ ట్రెండ్‌ మాత్రం ఇటు ఆరోగ్యాన్నిస్తూనే, అటు మానసిక ప్రశాంతతను, సౌకర్యాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం.. ఈ డిజైనింగ్‌ కోసం వాడే అలంకరణ వస్తువులన్నీ పర్యావరణహితమైన ఉత్పత్తులతో తయారుచేయడమే! చెక్క, మట్టి, ఓక్‌ చెట్టు బెరడు, రాటెన్‌ (ఇదో రకమైన కలప), ఉన్ని.. వంటి ప్రకృతి అందించే మెటీరియల్స్‌ని ఈ వస్తువుల తయారీలో ఉపయోగిస్తుంటారు డిజైనర్లు. బయోఫిలిక్‌ ఇంటీరియర్‌లో భాగంగా ఇలా గృహాలంకరణ వస్తువులే కాదు.. ఇంట్లోనే గోడకు లేదంటే ఓ మూలన చిన్నపాటి గార్డెన్‌లా పచ్చదనాన్ని ఏర్పాటుచేసుకోవడం, ప్రకృతి రమణీయతతో కూడిన ఆర్ట్‌వర్క్‌కి ఇంట్లో చోటివ్వడం.. వంటివీ దీని కిందకే వస్తాయి. ఈ తరహా ఫర్నిచర్‌/గృహాలంకరణ వస్తువులతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు తగ్గి.. ప్రశాంతత చేకూరుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.

వెలుతురు.. ఎక్కడెలా?
వెలుతురు కూడా మన మనసును ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ సహజసిద్ధమైన లైటింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందట! అయితే చాలామంది వేడిగా ఉందని, దుమ్ము వస్తుందని.. పగటి పూటే తలుపులు, కిటికీలు మూసేసి.. వెలుతురు కోసం లోపలి లైట్లను ఉపయోగిస్తుంటారు. కానీ పగటి పూట వచ్చే న్యాచురల్‌ లైటింగ్‌ని ఇలా అడ్డుకోకుండా పూర్తిగా ఆస్వాదించినప్పుడే మనసుకు సాంత్వన చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పగటి పూట తలుపులు, కిటికీలు తీసే ఉంచడం మంచిది. అవసరమైతే వాటికి పల్చటి కర్టెన్లు వేలాడదీస్తే.. వేడి, దుమ్ము బెడద లేకుండా ఉంటుంది.. ఇంట్లో వెలుతురు కూడా పడుతుంది. ఇక రాత్రి పూట ఇంట్లో ఉపయోగించే లైటింగ్‌ కూడా గది అవసరాల్ని బట్టి ఉండాలంటున్నారు నిపుణులు.
*లివింగ్‌ రూమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటాం కాబట్టి ఈ గదిలో ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటుచేసుకోవాలి. ఇక గోడలపై ఏర్పాటుచేసిన ఫొటో ఫ్రేములు, ఆర్ట్‌ వర్క్‌పై మినీ స్పాట్‌ లైట్లను ఏర్పాటుచేసుకుంటే గదికి అందమొస్తుంది.. మనసుకు ఆహ్లాదంగానూ అనిపిస్తుంది.
*అదే పడకగదిలో లైటింగ్‌ ఎంత తక్కువగా ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుందంటున్నారు నిపుణులు. పుస్తకాలు చదువుకోవడానికి, వర్క్‌ చేసుకోవడానికి టేబుల్‌ ల్యాంప్స్‌ని ఉపయోగించచ్చు.
*ఇక డైనింగ్‌ టేబుల్‌పై షాండ్లియర్‌/పెండెంట్‌ లైటింగ్‌ ఏర్పాటుచేసుకుంటే.. ఆ గదికి ఆ లైటింగ్‌ సరిపోతుంది. లైట్ల ఫోకస్‌ ఎక్కువగా లేకుండా ప్రశాంతమైన భావన కలుగుతుంది.
*ఇక కిచెన్‌లోనూ లైటింగ్‌ ప్రకాశవంతంగా ఉండాల్సిందే! అయితే దీంతో పాటు క్యాబినెట్స్‌, అరల్లో స్పాట్‌ లైట్లను ఏర్పాటుచేసుకుంటే.. అక్కడి వస్తువులు సులభంగా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.. కంఫర్టబుల్‌గానూ అనిపిస్తుంది. ఇదే పరోక్షంగా మానసిక ప్రశాంతతనూ పెంచుతుంది.

గోడలకు.. ‘డోపమైన్‌’ టచప్‌!
ఇంటి అలంకరణ అనగానే చాలామంది గోడలపైనే తమ దృష్టి కేంద్రీకరిస్తారు. తమకు నచ్చిన చిత్రాల్ని గోడలకు తగిలించడం లేదంటే చక్కటి వాల్‌ ఆర్ట్‌ వేయించుకోవడం, వాల్‌పేపర్‌ని అతికించుకోవడం.. ఇలా ఎవరి స్టైల్‌ వారిది! అయితే అందులోనూ ‘అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ (వాస్తవికతకు సంబంధం లేకుండా గీసే చిత్రకళ)’, ‘పర్సనలైజ్‌డ్‌ ఆర్ట్‌ (వ్యక్తిగత అభిరుచులు, జ్ఞాపకాలతో చిత్రాల్ని రూపొందించడం)’.. వంటివి మనసుకు ఎక్కువ సంతోషాన్ని, ప్రశాంతతను అందిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ‘డోపమైన్‌ డెకార్‌’గా నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇలాంటి అలంకరణ వస్తువులతో గోడలకు హంగులద్దితే ఇటు ఇంటికి అందం తీసుకురావచ్చు.. అటు మనసునూ ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.


ఇవి గుర్తుంచుకోండి!

*ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దాలని ఎక్కువ అలంకరణ వస్తువులతో నింపేసినా చూడ్డానికి చిరాగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఎంత తక్కువ డెకరేటివ్‌ ఐటమ్స్‌ని ఎంచుకుంటే ఇల్లు అంత నీట్‌గా కనిపిస్తుంది.. మనసుకు ఆహ్లాదకరమైన భావన కలుగుతుంది.
*లావెండర్‌, లేత గులాబీ, లేత గోధుమ.. వంటి రంగులు ఒత్తిడి, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఇష్టంగా గడిపే మీ వ్యక్తిగత ప్రదేశాల్లో ఈ రంగుల్ని వాడడం, ఈ రంగులతో కూడిన ఫర్నిచర్‌ని ఎంచుకోవడం మంచిది.
*కొన్ని రకాల ధ్వనులు కూడా మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ క్రమంలో కొందరికి మంద్ర స్థాయిలో సంగీతం వినడం నచ్చితే.. మరికొందరు జలపాతాల సౌండ్‌ని ఇష్టపడతారు. ఇలాంటి వారు ఇండోర్‌ ఫౌంటెయిన్స్‌, సౌండ్‌ బాక్సుల్ని మీరు ఎక్కువగా గడిపే ప్రదేశాల్లో ఏర్పాటుచేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
*మొక్కలూ ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి దుష్ప్రభావాల్ని తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇందుకు కారణం.. ఆకుపచ్చటి రంగే! కాబట్టి ఇండోర్‌ మొక్కలతో పాటు పూల మొక్కల్ని కూడా ఇంట్లో ఏర్పాటుచేసుకుంటే.. వాటి పరిమళాలూ మనసుకు ఉత్తేజాన్ని అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్