అనుకుంటూనే ఉండద్దు.. చేసేయండి!

ఏదైనా సాధించాలనే తపన నందినిలో బాగా ఎక్కువ. కాకపోతే పనిని వాయిదాలేయడం ఆమె నైజం. మంచి పని ప్రారంభించాలంటే మంచి ముహూర్తం కీలకమని శశి నమ్మకం. కానీ పని ప్రారంభించిన రోజే ఆమె ప్రయత్నానికి ఫుల్‌స్టాప్ పడిపోతుంది. అందరిలోనూ తపన ఉన్నప్పటికీ....

Published : 17 Oct 2022 20:38 IST

ఏదైనా సాధించాలనే తపన నందినిలో బాగా ఎక్కువ. కాకపోతే పనిని వాయిదాలేయడం ఆమె నైజం. మంచి పని ప్రారంభించాలంటే మంచి ముహూర్తం కీలకమని శశి నమ్మకం. కానీ పని ప్రారంభించిన రోజే ఆమె ప్రయత్నానికి ఫుల్‌స్టాప్ పడిపోతుంది. అందరిలోనూ తపన ఉన్నప్పటికీ నిర్ణయాలు అమలు చేసేవాళ్లు మాత్రం కొందరే. ఆచరణ సాధ్యమయ్యే నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తే మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా కోరుకున్న ఫలితాలు దక్కడం కూడా గ్యారంటీ.

పొద్దున్నే ఆరు గంటలకు లేచి జిమ్‌కు పరుగులు తీస్తున్నారా? అయితే నిజంగా మీరు గొప్పోళ్లే. ఈ మాత్రం దానికే గ్రేట్ ఎందుకు అనుకుంటున్నారా? అనుకున్న సమయానికి అనుకున్న పని చేయడం మంచి అలవాటు కాబట్టి. ఒకవేళ మీరు చేయకపోయినా అడిగేవాళ్లు ఉండరు. అలారం ఆపేసి పడుకోవచ్చు. ఎవరూ కాదనరు. కానీ మీరు అలా చేయలేదు కాబట్టి ప్రశంసించాల్సిందే. నిద్ర సరిపోవడం లేదు.. కుటుంబంతో గడపడానికి సమయం దొరకడం లేదు.. ఇలాంటి సాకులతో చాలామంది తీసుకున్న కొత్త నిర్ణయాలు వాయిదాలేస్తూ ఎప్పటికీ ఆచరణలో పెట్టరు. అయితే తీసుకునే నిర్ణయం చిన్నదైనా, పెద్దదైనా; దాని ఫలితం ఎంతైనా ఆచరణలో పెట్టడమే ముఖ్యం.

నిర్ణయం ఎందుకంటే...

మీరు ఏదైనా ఒక పని చెయ్యాలనుకుని దాన్ని విజయవంతంగా పూర్తి చేసి చూడండి. మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. సంవత్సరం లోగా ఈ ఉద్యోగం మారాలి అని లక్ష్యంగా పెట్టుకుంటే మీ ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. అదే ఉద్యోగం మారాలి, మారితే బాగుంటుంది అని ఊరికే అనుకుంటే అందులో సీరియస్‌నెస్ ఉండదు. తీసుకున్న నిర్ణయం అమలైతే చాలా సంతృప్తి కలుగుతుంది. అలాంటి నిర్ణయాలు మరికొన్ని ఆచరణలో పెట్టడానికి వీలవుతుంది కూడా. నేను ఏదైనా సాధించగలను అనే నమ్మకం కలుగుతుంది. పట్టుదల, కృషి, తపన ఉంటే నిర్ణయం ఎలాంటిదైనా మీ విజయం తథ్యం.

కట్టుబడి ఉండాలంటే...

✭ తీసుకున్న నిర్ణయం వాస్తవానికి దగ్గరలో ఉండాలి. అంటే ఆచరణాత్మకమైనదిగా ఉండాలి. వారం రోజుల్లో పది కేజీల బరువు తగ్గలేరు. ఒక్క రోజులోనే జీవిత భాగస్వామిని ఎంచుకోలేము. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఉండదు.

✭ రేపు అనే పదం డిక్షనరీలో వద్దు. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలరు. వాయిదాలు వేసుకుంటూ పోతే మీ లక్ష్యాన్ని నీరుగార్చుకున్నట్టే. సరైన ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా ప్రయత్నాన్ని కొనసాగించాలి.

✭ విజయవంతంగా పనులు పూర్తి చేసేవాళ్లకు ఉండే గొప్ప లక్షణం లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకోవడం. అది ఎంత చిన్నదైనప్పటికీ ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. లక్ష్యం దిశగా వెళ్తే మీ భయాలు, ఆందోళనలు ఒక్కొక్కటిగా మాయమవుతాయి.

✭ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మించింది లేదు. ఈ పని చేయడానికి ఇదే పర్‌ఫెక్ట్ టైం అని ఏదీ ఉండదు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామంటుంటారు కొందరు.. నిజానికి సరైన రోజు, సమయం అంటూ ఏదీ ఉండదు. మంచి లక్ష్యాన్ని పెట్టుకోవడం, వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించడం ఇదే పద్ధతి. ఇలా చేస్తే విజయం మీదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్