Animall: ‘పశువుల్ని అమ్మడానికి ఐఐటీ చదవాలా..’ అన్నారు!

వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమపై ఎక్కువగా ఆధారపడిన దేశం మనది. అయితే వ్యవసాయ పంటల్ని రైతు మార్కెట్లలో విక్రయించినట్లే.. పాడిపశువుల క్రయవిక్రయాలను జాతరలు, ఉత్సవాలు, మేళాల్లో నిర్వహించడం ప్రాచీన కాలం నుంచే ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అటు పంటల్లాగే, ఇటు పాడి పశువులకూ.....

Updated : 04 Mar 2023 14:04 IST

(Photos: Twitter)

వ్యవసాయం తర్వాత పాడిపరిశ్రమపై ఎక్కువగా ఆధారపడిన దేశం మనది. అయితే వ్యవసాయ పంటల్ని రైతు మార్కెట్లలో విక్రయించినట్లే.. పాడిపశువుల క్రయవిక్రయాలను జాతరలు, ఉత్సవాలు, మేళాల్లో నిర్వహించడం ప్రాచీన కాలం నుంచే ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అటు పంటల్లాగే, ఇటు పాడి పశువులకూ మధ్యవర్తుల కారణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదనే చెప్పాలి. ఇలా రైతుల పొట్టకొడుతోన్న దళారీ వ్యవస్థకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు స్నేహితులు. ‘ప్రస్తుతం దాదాపు అన్ని వస్తువుల క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నట్లు.. పాడిపశువుల కొనుగోలు, అమ్మకాలు ఆన్‌లైన్‌ వేదికగా ఎందుకు జరగకూడదు?’ అని ఆలోచించారు. ఈ అంతర్మథనంతోనే ఓ యాప్‌ను డిజైన్ చేశారు. ‘పశువుల్ని అమ్మడానికి ఐఐటీ చదవాలా?’ అన్న విమర్శల్ని భరిస్తూనే తమ వ్యాపారాన్ని పట్టాలెక్కించిన ఈ స్నేహితురాళ్లు.. మూడేళ్ల కాలంలోనే దేశంలో డిజిటల్‌ వైట్ రివల్యూషన్‌కు తెరతీశారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఈ టెకీ ఫ్రెండ్స్‌ స్టార్టప్‌ జర్నీ మీకోసం..!

బెంగళూరుకు చెందిన నీతూ యాదవ్‌, గురుగ్రామ్‌కు చెందిన కీర్తి జంగ్రా.. వీరిద్దరూ దిల్లీ ఐఐటీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ రూమ్‌మేట్స్‌ కూడా. అలా మంచి స్నేహితులయ్యారు. చదువు పూర్తయ్యాక నీతూకు ఆన్‌లైన్‌లో కథలు చెప్పే వేదిక ‘ప్రతిలిపి’లో ఉద్యోగం వచ్చింది. మరోవైపు కీర్తి కూడా ‘పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా’ సంస్థలో సీనియర్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరింది. అయితే ఇలా నెలనెలా జీతం అందుకునే ఉద్యోగాల్లో వీరిద్దరికీ సంతృప్తి లభించలేదు. కలిసి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఆలోచన పుట్టిందలా..!

అయితే నీతూ, కీర్తి.. వీరిద్దరిదీ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబమే! కానీ తమలా తమ పిల్లలు కష్టపడకూడదన్న ఉద్దేశంతో ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించారు ఇరు కుటుంబ సభ్యులు. అయితే ఉద్యోగాలు మానేసి వ్యాపారం చేస్తామన్నప్పుడు మాత్రం తమ కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందంటున్నారు నీతూ, కీర్తి.

‘మా నాన్న పాల వ్యాపారి. కీర్తి కుటుంబంలోనూ వ్యవసాయం, పాడిపశువులపై ఆధారపడిన వారున్నారు. ఇలా పంటలు, పాడి పశువుల మధ్య పెరిగిన మాకు.. ఈ రంగంలో ఉన్న లోటుపాట్ల గురించి అవగాహన ఉంది. ముఖ్యంగా దళారీ వ్యవస్థ కారణంగా పాడిపశువుల రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మోసపూరితమైన ఈ వ్యవస్థకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నాం. ఈ ఆలోచనతోనే Animall అనే యాప్‌కు రూపకల్పన చేశాం. మధ్యవర్తులు/దళారులతో సంబంధం లేకుండా ఈ యాప్‌ ద్వారా రైతులే నేరుగా పాడిపశువుల క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. చదువుకోని వారు కూడా ఈ యాప్‌ను సులభంగా ఉపయోగించేలా దీన్ని డిజైన్‌ చేశాం..’ అంటూ తమ స్టార్టప్‌ ఐడియా గురించి వివరించింది నీతూ.

రైతుల మధ్య వారధిలా..!

2019లో ప్రారంభించిన ఈ యాప్‌.. ఈ మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాడి రైతులకు చేరువైంది. తమ వద్ద ఉన్న పాడి పశువుల్ని అమ్మాలనుకునే రైతు.. దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియో, అది ఏ రకం జాతికి చెందిన ఆవు?, ఎన్ని లీటర్ల పాలిస్తుంది?, దాని ధరెంత?.. తదితర వివరాలన్నీ ఈ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా రైతే నేరుగా తమ పాడిపశువుల్ని అమ్ముకోవచ్చు.. కొనాలనుకున్న వారూ నేరుగా సంబంధిత రైతుకే ఫోన్‌ చేసి ధర సెటిల్‌ చేసుకోవచ్చు.. ఇలా పాడిపశువుల క్రయవిక్రయాలు జరిపే రైతుల మధ్య వారధిగా పనిచేస్తోందీ యాప్‌. సుమారు రూ. 50 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఈ యాప్‌ను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా రైతులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఏటా లక్షలాది పాడిపశువుల క్రయవిక్రయాలు దీని ద్వారా జరుగుతున్నాయి. ఫలితంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారీ ఇద్దరు స్నేహితురాళ్లు.

‘పశువుల వ్యాపారమా?’ అన్న వారే..!

‘పాల వ్యాపారం ప్రస్తుతం మన గ్రామీణ భారతంలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ఉపాధి అవకాశాల్ని మా యాప్‌ ద్వారా మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే తొలుత ఈ వ్యాపారం గురించి ఇంట్లో చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు మా ఆలోచనను వ్యతిరేకించారు. ‘పశువుల క్రయవిక్రయాలకు ఐఐటీ చదవడమెందుకు?’ అన్న వారూ లేకపోలేదు. కానీ మేం మా సాంకేతిక నైపుణ్యాలపై నమ్మకముంచాం. ఈ ఆత్మవిశ్వాసమే మమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తోంది. మా యాప్‌ను ఉపయోగిస్తోన్న చాలామంది రైతులు ‘ఇది యాప్‌ కాదు.. విప్లవం’ అంటుంటే వ్యాపారంలో నిలదొక్కుకునే క్రమంలో మేం ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యలన్నీ దూరమైపోతాయి.. మొదట్లో మమ్మల్ని చులకనగా చూసిన వారే ఇప్పుడు ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపిస్తోంది..’ అంటూ తమ సక్సెస్‌ సీక్రెట్‌ను పంచుకున్నారీ టెకీ ఫ్రెండ్స్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్