Captain Deeksha: పట్టు వదలక.. సాధించింది!

‘పోయిన చోటే వెతుక్కోమ’న్నారు పెద్దలు. భారత సైన్యానికి చెందిన మహిళా అధికారిణి కెప్టెన్‌ దీక్ష సి. ముదదేవన్ననవర్ కూడా ఇదే చేసింది. ఇండియన్‌ ఆర్మీలో వైద్యాధికారి అయిన ఆమె.. ఇటీవలే భారత సైన్యంలోని ప్యారాచూట్‌ రెజిమెంట్‌కు చెందిన పారా ఎస్‌ఎఫ్‌ భద్రతా....

Updated : 15 Mar 2023 14:50 IST

(Photo: Twitter)

‘పోయిన చోటే వెతుక్కోమ’న్నారు పెద్దలు. భారత సైన్యానికి చెందిన మహిళా అధికారిణి కెప్టెన్‌ దీక్ష సి. ముదదేవన్ననవర్ కూడా ఇదే చేసింది. ఇండియన్‌ ఆర్మీలో వైద్యాధికారి అయిన ఆమె.. ఇటీవలే భారత సైన్యంలోని ప్యారాచూట్‌ రెజిమెంట్‌కు చెందిన పారా ఎస్‌ఎఫ్‌ భద్రతా దళాలకు ఎంపికైంది. తద్వారా భారత సైన్యం నుంచి ఈ ప్రత్యేక దళాల్లోకి ప్రవేశించనున్న తొలి మహిళగా చరిత్రకెక్కింది దీక్ష. శారీరక ఫిట్‌నెస్‌ కారణంగా ఇప్పటికే రెండుసార్లు ఈ అరుదైన అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న ఆమె.. పట్టుదలతో ముచ్చటగా మూడోసారి ప్రయత్నించి విజయం సాధించింది. సవాళ్లతో కూడిన రంగాన్ని ఎంచుకోవాలన్న ఆశయంతోనే భారత సైన్యంలోకి అడుగుపెట్టానంటోన్న ఈ యువ ఆఫీసర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

దీక్ష స్వస్థలం కర్ణాటకలోని దావనగెరె. చిన్నతనం నుంచి సాహసాలు, సవాళ్లను ఇష్టపడుతూ పెరిగిన ఆమె.. భారత సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఈ క్రమంలో ఎన్సీసీలోనూ చేరింది. 2019లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)కి ఎంపికైన దీక్ష తొలుత హైదరాబాద్‌ గోల్కొండలోని మిలిటరీ ఆస్పత్రిలో విధుల్లో చేరింది. ఆపై లక్నోలోని ‘ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ సెంటర్‌’లో ఎంఓబీసీ కోర్సు పూర్తిచేసి వైద్యాధికారిగా భారత సైన్యంలో చేరింది.

‘ఆపరేషన్‌ దోస్త్‌’లో భాగమై..!

అయితే ఈ కోర్సు చదివే క్రమంలో తొలి దశ పూర్తిచేసుకున్న దీక్షకు.. లేహ్ లోని ‘303 ఫీల్డ్‌ ఆస్పత్రి’లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక ఆర్మీ మెడికల్‌ ఆఫీసర్‌గా పలు కీలక ఆపరేషన్లలోనూ భాగమైందామె. ఇటీవలే టర్కీ-సిరియాల్లో సంభవించిన భూకంప బాధితుల సహాయార్థం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’లోనూ తన బృందంతో కలిసి పాలుపంచుకుంది దీక్ష. ఇందులో భాగంగా భూకంప బాధితులకు సహాయ సహకారాలు అందించింది. ఇలా తనలోని పోరాటతత్వం, సవాళ్లను ఎదుర్కొనే నైజం ఆమెను భారత సైన్యానికి చెందిన ప్యారాచూట్‌ రెజిమెంట్‌ వంటి ప్రత్యేక భద్రతా దళాల్లో చేరేందుకు ప్రేరేపించాయి. ఈ మక్కువతోనే తాను ఎంఓబీసీ కోర్సు చదువుతున్నప్పుడే దీనికి సంబంధించిన అర్హత పరీక్షలకు హాజరైంది దీక్ష. అయితే శారీరక ఫిట్‌నెస్‌ లేమితో మొదటిసారి, గాయం కారణంగా రెండోసారి ఈ అరుదైన అవకాశాన్ని చేజార్చుకుందీ యంగ్‌ ఆఫీసర్.

ఆయన ప్రోత్సాహంతో..!

ఇలా రెండుసార్లు పారా భద్రతా దళాల్లోకి ఎంపిక కాలేకపోయిన దీక్ష.. ఆమె పైఅధికారి కల్నల్‌ శివేష్‌ సింగ్‌ ప్రోత్సాహంతో ముచ్చటగా మూడోసారి ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొంది. అయితే ఈసారి అదృష్టం దీక్షను వరించింది. సెలక్షన్‌లో భాగంగా ఇటీవలే ఈ పోస్ట్‌కు ఎంపికైన దీక్ష.. భారత సైన్యంలో వైద్యాధికారిగా పనిచేస్తూ.. ప్యారాచూట్‌ రెజిమెంట్‌ వంటి ప్రత్యేక భద్రతా దళాలకు ఎంపికైన తొలి మహిళా ఆఫీసర్‌గా కీర్తి గడించింది. ఇక ఈ దళాల్లో చోటు దక్కించుకున్న అతి కొద్దిమంది మహిళల్లో దీక్ష ఒకరు కావడం మరో విశేషం. ఈ దళాలు ఉగ్రవాద నిరోధం, బందీలను రక్షించడం, సంప్రదాయేతర యుద్ధాలు, తిరుగుబాటు నియంత్రణ, ప్రత్యేక నిఘా.. వంటి అంశాలపై దృష్టి సారిస్తాయి.

అదే అతిపెద్ద సవాలు!

అయితే ఇండియన్‌ ఆర్మీలో మెడికల్‌ ఆఫీసర్స్‌కు, సైనికులకు దాదాపు ఒకే రకమైన శిక్షణ ఉంటుంది. కానీ ఇద్దరికీ అప్పగించే బాధ్యతలు వేరుగా ఉంటాయి. సైనికులు యుద్ధభూమిలో శత్రువులతో తలపడితే.. వైద్యాధికారులు గాయపడ్డ సైనికులకు వైద్య సహాయం అందిస్తారు. అయితే సైనికుల్లా వైద్యాధికారులు కూడా ఎప్పుడూ అలర్ట్‌గా ఉండడం ముఖ్యమంటోంది దీక్ష.

‘నేను చిన్నతనం నుంచి సవాళ్లతో కూడిన కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్నా. ఈ ఆలోచనతోనే భారత సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే అంతకంటే ముందు ఎన్‌సీసీలో చేరాను. ఇక ఆర్మీ శిక్షణలో భాగంగా ఎంతోమంది సైనికుల్ని దగ్గర్నుంచి చూశాను. వాళ్ల క్రమశిక్షణ, సాహసోపేతమైన జీవనశైలి.. లక్ష్య సాధన దిశగా నన్ను మరింత ప్రేరేపించాయి. కల్నల్‌ బిందు నాయర్‌ నేను ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో చేరేందుకు స్ఫూర్తినిచ్చారు. అటు శిక్షణలోనైనా, ఇటు వృత్తిలోనైనా.. సవాళ్లు, అవరోధాలు సైనికులతో మాకూ సమానంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక వైద్యాధికారిగా ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. అనారోగ్యాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. ఈ వృత్తిలో ఇదే పెద్ద సవాలు!’ అంటూ చెప్పుకొచ్చింది దీక్ష.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్