Miss World : పోలీసు ఉద్యోగం వదిలి.. అందాల ‘రాణి’గా!

అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమంటే ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. కానీ ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవాలంటే ఏళ్ల తరబడి శ్రమించాలి.. పోటీల్లో పాల్గొనేందుకు శారీరకంగా, మానసికంగా సంసిద్ధం కావాలి.

Updated : 21 Feb 2024 18:21 IST

(Photos: Instagram)

అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమంటే ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. కానీ ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవాలంటే ఏళ్ల తరబడి శ్రమించాలి.. పోటీల్లో పాల్గొనేందుకు శారీరకంగా, మానసికంగా సంసిద్ధం కావాలి. కానీ ఇలా వచ్చి అలా సక్సెస్‌ను మూటగట్టుకుంది నవ్‌జోత్‌ కౌర్‌. భారత సంతతికి చెందిన ఆమె.. ఇటీవలే ‘మిస్‌ వరల్డ్‌ న్యూజిలాండ్‌’ కిరీటం గెలుచుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే పోటీలో నెగ్గి ‘ఇన్‌స్టంట్‌’ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం భారత్‌లో జరుగుతోన్న ‘ప్రపంచ సుందరి’ పోటీల్లో పోటీ పడుతోంది. ‘ఆత్మవిశ్వాసమే అసలైన అందమం’టోన్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

న్యూజిలాండ్‌లోని సౌత్‌ ఆక్లాండ్‌లో ఇటీవలే ‘మిస్‌ వరల్డ్‌ న్యూజిలాండ్‌’ పోటీలు నిర్వహించారు. త్వరితగతిన పోటీల్ని పూర్తిచేయాలన్న లక్ష్యంతో ‘ర్యాపిడ్‌ ఫైర్‌’ ఎంపిక ప్రక్రియను ఏర్పాటుచేశారు. ఈ పోటీల్లో న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నవ్‌జోత్‌ కౌర్‌ పాల్గొంది. ‘ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన మిస్‌ వరల్డ్‌ న్యూజిలాండ్‌ పోటీల ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అవకాశం వస్తుందనుకోలేదు.. కానీ అనుకోకుండా పోటీలకు ఎంపికయ్యా. 200 మందిని దాటుకొని విజయం సాధించానంటే నమ్మలేకపోయా..’ అంటోందీ బ్యూటీ.

పోలీసు ఉద్యోగం వదిలి..!

నవ్‌జోత్‌ తల్లిదండ్రులది పంజాబ్‌లోని జలంధర్‌. ఆమె పుట్టకముందే న్యూజిలాండ్‌ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడి సౌత్‌ ఆక్లాండ్‌లో పుట్టి పెరిగిన నవ్‌జోత్‌.. చిన్న వయసు నుంచే చదువులో చురుగ్గా రాణించేది. ఈ క్రమంలోనే చదువు పూర్తయ్యాక పోలీసాఫీసర్‌గా ఉద్యోగం సంపాదించిన ఆమె.. సౌత్‌ ఆక్లాండ్‌లోని పోలీస్‌ శాఖలో కొన్నాళ్లు పనిచేసింది. అయితే నవ్‌జోత్‌కు అందాల పోటీలంటే ముందు నుంచే మక్కువ. ఈ ఇష్టమే పోలీస్‌ కెరీర్‌ వదిలి అందాల పోటీల్లో పాల్గొనేలా చేసిందంటోందామె.

‘పోలీసాఫీసర్‌గా స్థిరపడ్డాక కొన్నాళ్ల పాటు ఎంతో ఆసక్తిగా కెరీర్‌ని కొనసాగించా. కానీ ఆ తర్వాత ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనిపించింది. ఈ క్రమంలోనే అందాల పోటీలపై నాకున్న మక్కువతో మిస్‌ వరల్డ్‌ న్యూజిలాండ్‌ పోటీల్లో పాల్గొని గెలుపొందా. తద్వారా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నా. ఇక ఈసారి ఈ పోటీలు భారత్‌లో జరగడం మరింత సంతోషంగా ఉంది. న్యూజిలాండ్‌లోనే పుట్టినా అప్పుడప్పుడూ భారత్‌కి వచ్చేదాన్ని. మా కుటుంబ సభ్యులు నాకు చిన్నవయసు నుంచే హిందీ, పంజాబీ భాషలు నేర్పించారు. దాంతో భారత్‌లో జరిగే ప్రపంచ సుందరి పోటీల్లో పోటీ పడడం మరింత సునాయాసమవుతుందని నేను భావిస్తున్నా..’ అంటోంది నవ్‌జోత్‌.

వాళ్లిద్దరి స్ఫూర్తితో!

ఆత్మసౌందర్యానికే కాదు.. ఆత్మవిశ్వాసానికీ ప్రతీకగా నిలుస్తుంటాయి అందాల పోటీలు. అలాంటి నిండైన ఆత్మవిశ్వాసాన్ని విశ్వవేదికపై ప్రదర్శించి విజేతలుగా నిలుస్తుంటారు కొందరు ముద్దుగుమ్మలు. తమ విజయంతో ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతుంటారు. అలా తన స్ఫూర్తి ప్రదాతలు ఇద్దరున్నారంటోంది నవ్‌జోత్‌.

‘విశ్వసుందరి సుస్మితాసేన్‌కు నేను వీరాభిమానిని. ఇక నేను అందాల పోటీల్లో పాల్గొనడానికి మాజీ ప్రపంచ సుందరీమణులు ఐశ్వర్యారాయ్‌, ప్రియాంక చోప్రాలే ఆదర్శం! వాళ్లలో నిండైన ఆత్మవిశ్వాసం, శక్తిసామర్థ్యాలు ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాయి. అవే నాకూ మార్గనిర్దేశనం చేశాయి. ఇక మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా.. ఇక్కడికొచ్చే అమ్మాయిలు భారత ఆతిథ్యాన్ని స్వీకరించి ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకుంటారు. నేనైతే వాళ్లందరికీ ఇక్కడి పానీ పూరీ రుచిని పరిచయం చేస్తా..’ అంటూ నవ్వేస్తోందీ కివీ బ్యూటీ. ఇలా నవ్‌జోతే కాదు.. ఆమె చెల్లెలు ఇషా కూడా అక్క బాటలోనే నడుస్తోంది. తాను కూడా అందాల పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్