Updated : 29/03/2023 08:55 IST

Sift Kaur Samra: స్టెత్ కాదనీ.. గన్‌ ఎంచుకొనీ!

కాంస్యం గెలిచిందన్న వార్త వినగానే సమ్రా ఆనందం పట్టలేకపోయింది. ప్రేక్షకుల మధ్య కూర్చొన్న ఆమె కుటుంబం పరిస్థితీ అంతే! పతకం కొట్టింది కాబట్టి సంబరం సహజమే అనిపించొచ్చు. కానీ దానికోసం ఆమె పెద్ద త్యాగమే చేసింది మరి!

త్యంత కష్టమైన విద్యల్లో వైద్యాన్నీ ఒకటిగా చెబుతారు. అలాంటిది ఒకవైపు ఎంబీబీఎస్‌పై దృష్టిపెడుతూనే లక్ష్యంపైనా గురిపెట్టింది సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా. ‘కష్టమవుతోంది’ అని చాలాసార్లే అనిపించినా.. దేశానికి పతకం సాధించాలన్న తపనే ఆమెను నడిపిస్తోంది. 22 ఏళ్ల సమ్రాది పంజాబ్‌. చిన్నప్పుడు ఓసారి నాన్నతో కలిసి షూటింగ్‌ రేంజ్‌కి వెళ్లింది. సరదాగా ప్రయత్నిస్తే మొదటిసారే మంచి స్కోరు సాధించింది. దాన్ని చూసినవాళ్లంతా ‘సమ్రాని దీనిలో కొనసాగనీ.. రాణిస్తుంద’ని ఆమె నాన్నకి సలహా ఇచ్చారు. అలా కొనసాగింది. అయితే ఆమెకిదో వ్యాపకమే! 2016లో రాష్ట్ర స్థాయి పతకం సాధించాకే దీన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టింది. ‘మంచి విద్యార్థినినే కానీ.. ర్యాంకర్‌ని కాదు. నా స్నేహితులంతా టాపర్లు. దీంతో పతకాలొచ్చేవి. నాకు ఒక్కటీ రాలేదు. షూటింగ్‌లో వచ్చేసరికి ఆ అనుభూతే వేరు’ అనే సమ్రాకి ఇంటర్‌ పూర్తయినప్పటి నుంచీ అవరోధాలు మొదలయ్యాయి. షూటింగ్‌ సాధన చేస్తూనే వైద్యవిద్య ప్రవేశపరీక్ష నీట్‌ను రాసి, మంచి ర్యాంకు సాధించగలిగింది. కానీ కళాశాలలో చేరాకే అటు చదువునీ, ఇటు ఆటనీ సమన్వయం చేసుకోవడం కష్టమైంది. గత ఏడాది నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో తనకు అవకాశం రాదనుకుంది. రావడంతో.. ‘కోర్సులో చేరాక ఆడటం ఎలాగూ సాధ్యం కాద’నుకొని ప్రయత్నిస్తే, నేషనల్‌ ఛాంపియన్‌ అయ్యింది. అదో జాతీయ రికార్డు కూడా. తర్వాత జూనియర్‌ వరల్డ్‌కప్‌లోనూ బంగారు పతకం సాధించింది. ఇప్పుడు సీనియర్‌ స్థాయి. పైగా మొదటి వరల్డ్‌ కప్‌.. కానీ అదే సమయంలో ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది పరీక్షలు. ఏం చేయాలో తోచలేదామెకు. అధికారులను కలిసి తనకు పరీక్షలు మళ్లీ నిర్వహించమని కోరింది. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. స్టెతస్కోప్‌, గన్ను రెండిట్లో ఒకటే ఎంచుకోవాల్సిన పరిస్థితి! దీంతో దేశానికి పతకం తేవడమే ముఖ్యమని పోటీల్లో పాల్గొంది. కాంస్యం గెలుచుకుంది. ‘చదువునీ కొనసాగిస్తా.. అయితే లక్ష్యం 2024 ఒలింపిక్స్‌. ఆ తర్వాత పూర్తి సమయం విద్యకే!’ అంటోన్న సమ్రాకి ఈ గెలుపు ప్రత్యేకమేగా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి