రిపబ్లిక్‌ పరేడ్‌లో ‘రఫేల్‌ రాణి’..!

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలు దేశమంతా జరిగినా దిల్లీలోని రాజ్‌పథ్‌ మార్గంలో జరిగే వేడుకలపైనే అందరి చూపు ఉంటుంది. పలు రాష్ట్రాలు, శాఖలకు సంబంధించిన శకటాలను అక్కడ ప్రదర్శించడమే ఇందుకు కారణం. ఈసారి కూడా శకటాల ప్రదర్శన కనులవిందుగా సాగింది.

Updated : 25 Jan 2024 12:09 IST

(Photo: Screengrab)

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలు దేశమంతా జరిగినా దిల్లీలోని రాజ్‌పథ్‌ మార్గంలో జరిగే వేడుకలపైనే అందరి చూపు ఉంటుంది. పలు రాష్ట్రాలు, శాఖలకు సంబంధించిన శకటాలను అక్కడ ప్రదర్శించడమే ఇందుకు కారణం. ఈసారి కూడా శకటాల ప్రదర్శన కనులవిందుగా సాగింది. ఇందులో భారత వాయుసేనకు సంబంధించిన శకటం చూపరులను ఆకట్టుకుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక రఫేల్‌ యుద్ధవిమానాన్ని నడిపిన మొదటి మహిళ శివాంగి సింగ్‌ ఈ పరేడ్‌లో పాలుపంచుకున్నారు. ఆమె శకటంపై నిల్చొని సెల్యూట్ చేస్తూ కనిపించారు. ఇలా గణతంత్ర వేడుకల పరేడ్‌లో పాల్గొన్న రెండో పైలట్‌గా శివాంగి ఘనత సాధించారు. అంతకుముందు 2021లో ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ భావనా కాంత్‌ ఈ అవకాశం దక్కించుకున్నారు.

 

పక్షిలా ఎగరాలని!

శివాంగి సింగ్‌ స్వస్థలం వారణాసి. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె.. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌సీసీలో కూడా చేరారామె. ఆపై 2016లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. చిన్నతనం నుంచీ పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలు కన్న శివాంగి.. ఎప్పటికైనా పైలట్‌ అవ్వాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. ఇలా ఆమె ఆశకు మొదటి దశ యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన మోహనా సింగ్‌, భావనా కాంత్‌, అవనీ చతుర్వేది ఆయువు పోశారు. వారి స్ఫూర్తితోనే 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికైన శివాంగి.. మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. ఆ అనుభవంతోనే 2020లో దేశంలోనే అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు. దాంతో శివాంగి.. ‘రఫేల్‌ రాణి’గా పేరు సంపాదించారు. శివాంగి అంబాలా ఎయిర్‌బేస్‌లోని ‘గోల్డెన్‌ యారోస్‌’ స్క్వాడ్రన్‌ బృందంలో భాగంగా ఉన్నారు.

 

శకటం ప్రత్యేకతలు...

‘భవిష్యత్తు కోసం భారత వైమానిక దళం రూపాంతరం చెందుతోంది’ అనే థీమ్‌తో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ గణతంత్ర వేడుకల పరేడ్‌లో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంలో రఫేల్‌ ఫైటర్‌ జెట్‌ యుద్ధ విమానం, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(LCH), త్రీడీ రాడార్‌ ఆశ్లేషా ఎంకే-1లకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. 1971 పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో ముఖ్య పాత్ర వహించిన మిగ్‌-21 విమానం నమూనాను కూడా ఈ శకటంలో పొందుపరిచారు. ఈ శకటంపై రఫేల్‌ రాణి శివాంగి సింగ్‌ సెల్యూట్‌ చేస్తూ కనిపించారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ‘అవును! మీరు శివంగి లాగా శత్రువుల మీద విరుచుకు పడండి! మీరు మా రఫేల్‌ రాణి’ అంటూ శివాంగిని ప్రశంసిస్తూ ట్వీటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్