Shanya Gill: మంటను గుర్తించే పరికరానికి.. 21 లక్షల ప్రైజ్‌మనీ!

హడావిడిగా ఆఫీస్‌కెళ్లే క్రమంలో ఒక్కోసారి స్టౌ కట్టేయడం మర్చిపోతుంటాం.. పరధ్యానంలో పడిపోయినప్పుడూ గ్యాస్‌ ఆఫ్‌ చేశామా లేదా పట్టించుకోం. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకవుతుంటుంది.. నిజానికి ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తీసుకొస్తుంది.

Published : 10 Nov 2023 12:12 IST

హడావిడిగా ఆఫీస్‌కెళ్లే క్రమంలో ఒక్కోసారి స్టౌ కట్టేయడం మర్చిపోతుంటాం.. పరధ్యానంలో పడిపోయినప్పుడూ గ్యాస్‌ ఆఫ్‌ చేశామా లేదా పట్టించుకోం. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకవుతుంటుంది.. నిజానికి ఈ నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తీసుకొస్తుంది. అందుకే ఇలాంటి ప్రమాదాల్ని ఆపాలని కంకణం కట్టుకుంది శాన్యా గిల్‌. ఈ క్రమంలోనే థర్మల్‌ కెమెరా సహాయంతో అత్యంత వేగంగా మంటను గుర్తించే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ వ్యవస్థతో సాధారణ ఫైర్‌ డిటెక్టర్స్‌ కంటే వేగంగా మంటను, వాటికి కారణమయ్యే వాయువుల్ని, వేడి వస్తువుల్ని గుర్తించచ్చంటోంది. ఇలా తన ప్రాజెక్ట్‌ తాజాగా ‘థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ASCEND అవార్డు’ గెలుచుకుంది. భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటుచేయడమే తన లక్ష్యమంటోన్న శాన్యా గురించి, తను అభివృద్ధి చేసిన పరికరం గురించి తెలుసుకుందాం..!

13 ఏళ్ల శాన్యా భారత సంతతికి చెందిన అమ్మాయి. ప్రస్తుతం తన కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడిన ఆమె.. క్యాలిఫోర్నియాలోని స్టార్ట్‌ఫోర్డ్‌ స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. పసి వయసు నుంచే కోడింగ్‌పై పట్టు పెంచుకున్న శాన్యా బాల మేధావిగానూ పేరు తెచ్చుకుంది.

రెస్టరంట్‌ ఘటనతో..!

శాన్యాకు సామాజిక స్పృహ ఎక్కువ. ఈ క్రమంలో భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడేలా వివిధ రకాల వస్తువుల్ని/పరికరాల్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతేడాది వేసవిలో శాన్యా ఇంటికి దగ్గర్లోని ఓ రెస్టరంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అందులో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తనను ఆలోచనల్లో పడేశాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ఇలాంటి ప్రమాదాల్ని ముందే పసిగడితే ఎన్నో ప్రాణాల్ని కాపాడచ్చు కదా అన్న కోణంలో ఆలోచించింది శాన్యా.

‘మా ఇంటికి దగ్గర్లో ఉన్న రెస్టరంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పట్నుంచి మా అమ్మ మరింత అలర్ట్‌ అయింది. కిచెన్‌లో పని పూర్తయ్యాక, బయటికి వెళ్లే ముందు స్టౌ ఆఫ్‌ చేశామా లేదా అని పదే పదే చెక్‌ చేసుకుంటుంది. తను ఇంట్లో లేనప్పుడు మాకూ బోలెడన్ని జాగ్రత్తలు చెబుతుంది. అయితే ఈ ప్రమాదం తర్వాత.. ఇలాంటి అగ్ని ప్రమాదాలపై కాస్త లోతుగా పరిశోధనలు చేశా.. ఈ క్రమంలో ఏటా వేలాది మంది ఇలాంటి ప్రమాదాల బారిన పడి అగ్నికి ఆహుతవుతున్నట్లు తెలుసుకున్నా. అయితే ఇలాంటివి జరిగాక బాధపడడం కంటే.. జరగకుండా నివారించగలిగితే ఎంతోమందిని కాపాడచ్చనిపించింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడే మా ఇంట్లో ఉన్న థర్మల్‌ కెమెరా వైపు నా దృష్టి మళ్లింది. చలికాలంలో ఇంట్లో వేడి తగ్గడాన్ని అది గుర్తిస్తుందని తెలుసుకున్నా. అయితే ఇదే థర్మల్‌ కెమెరాను మంటను గుర్తించేలా చేస్తే బాగుంటుంది కదా! అన్న ఆలోచన వచ్చింది..’ అంటోన్న శాన్యా అనుకున్నదే తడవుగా ఆ వ్యవస్థను రూపొందించడంపై దృష్టి పెట్టింది.

థర్మల్‌ కెమెరాతో నిఘా!

ఈ క్రమంలో ముందుగా ఓ థర్మల్‌ కెమెరాను కొన్న శాన్యా.. దాన్ని కంప్యూటర్‌కు అనుసంధానించింది. మంటను గుర్తించడంలో భాగంగా అది కొన్ని పనులు చేసేలా అందులో ప్రోగ్రామింగ్‌ చేసింది. వ్యక్తులు వేడిగా ఉన్న వస్తువుల్ని క్షితిజ సమాంతరంగా కదిలించినా, గ్యాస్‌ స్టౌ ఆన్‌ చేసినా, ఆ గదిలో ఇతర వేడి వస్తువులేమైనా ఉన్నా.. వాటన్నింటినీ గుర్తించేలా ఈ కెమెరాకు ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. ఆ ప్రదేశంలో పది నిమిషాల కంటే ఎక్కువ సమయం వ్యక్తులెవరూ లేకపోతే.. ఆ ఇంట్లో వాళ్ల మొబైల్‌కు మెసేజ్‌ పంపించేలా ఆ పరికరంలో కొన్ని ఏర్పాట్లు చేసింది.

‘మంటను గుర్తించేలా ఆదేశాలన్నీ పొందుపరిచిన ఈ కెమెరాను మా ఇంటి వంటగదిలో స్టౌ వెనక వైపు ఉన్న గోడకు అమర్చాను. దీంతో విభిన్న రకాల ప్రయోగాలు చేశాను. రోజులో వివిధ సమయాల్లో దీని పనితీరును గమనించాను. అంతేకాదు.. వివిధ దిశల నుంచి కెమెరా ముందుకు వ్యక్తులొచ్చినప్పుడు, అక్కడ ఎవరూ లేనప్పుడు అదెలా పనిచేస్తుందో గుర్తించాను. ఈ క్రమంలో నేను రూపొందించిన ఈ వ్యవస్థ 98 శాతం మానవ ఉనికిని, 97 శాతం ఉష్ణ వనరుల్ని కచ్చితంగా గుర్తిస్తున్నట్లు తెలుసుకున్నా. అలాగే మంటను/వేడి వస్తువుల్ని నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో ఆయా వ్యక్తులకు సందేశాలు పంపించడంలోనూ ఈ వ్యవస్థ 97 శాతం సక్సెసైంది. ఆపై ఇందులో మరిన్ని మార్పులు చేర్పులు చేసి సాధారణ ఫైర్‌ డిటెక్టర్స్‌ కంటే త్వరితగతిన మంటను గుర్తించి.. అత్యంత వేగంగా ప్రతిస్పందించేలా దీన్ని అభివృద్ధి చేశా..’ అంటోన్న శాన్యా రూపొందించిన ఈ పరికరం ప్రస్తుతం నమూనా దశలో ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అనుమతులన్నీ తీసుకొని.. పొగ గుర్తించే పరికరాల్లా సీలింగ్‌కి అమర్చేలా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెబుతోందీ బాల మేధావి.

ఆవిష్కరణకు.. అవార్డు!

అయితే మంటను అత్యంత వేగంగా గుర్తించేలా శాన్యా అభివృద్ధి చేసిన ఈ పరికరానికి తాజాగా ‘థర్మో ఫిషర్‌ సైంటిఫిక్‌ ASCEND అవార్డు’ దక్కింది. ‘సొసైటీ ఫర్‌ సైన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ‘థర్మో ఫిషర్‌ జూనియర్‌ ఇన్నొవేటర్స్‌ ఛాలెంజ్‌’ పోటీలో గెలుపొందిన వారికి ఈ అవార్డు అందిస్తుంటారు. 11-13 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు స్టెమ్‌ ఆవిష్కరణలతో ఇందులో పోటీ పడతారు. అలా ఈసారి 65 వేల మంది విద్యార్థుల్ని వెనక్కి నెట్టి శాన్యా అవార్డు గెలుచుకుంది.. అంతేకాదు.. రూ. 21 లక్షల నగదు బహుమతీ తన సొంతమైంది.
‘ప్రమాదాన్ని త్వరగా పసిగడితే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అలా ఏటా వేలాది మంది ప్రాణాలు నిలుస్తాయి. అందుకే ఈ పరికరాన్ని త్వరలోనే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ప్రతి ఇంటికీ అందించాలనుకుంటున్నా..’ అంటోంది శాన్యా.

ఇక క్రీడల్ని ఎక్కువగా ఇష్టపడే ఈ స్టెమ్‌ గర్ల్‌కు ఈత, వాటర్‌ పోలో, టేబుల్‌ టెన్నిస్‌.. వంటి ఆటలంటే మక్కువట! క్రాఫ్టింగ్‌, కోడింగ్‌లోనూ నైపుణ్యాలున్న శాన్యా.. ప్రస్తుతం చిన్నారులకు వీటిలో శిక్షణ ఇస్తోంది.

‘భవిష్యత్తులో బయోమెడికల్‌ ఇంజినీర్‌ కావాలనుకుంటున్నా. బయాలజీలో నాకున్న ఇష్టానికి సృజనాత్మకతను జోడించి సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తా..’ అంటోందీ యంగ్‌ ఇన్నొవేటర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్