Canva : తన జీవితాన్ని తానే ‘డిజైన్‌’ చేసుకుంది!

పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ ఉండదని అంటుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన మెలనీ పెర్కిన్స్‌ జీవితమే ఇందుకు నిదర్శనం. 19 ఏళ్ల వయసులో ఓవైపు చదువుకుంటూనే మరోవైపు విద్యార్థులకు గ్రాఫిక్‌ డిజైనింగ్‌ పాఠాలు నేర్పేదామె.

Published : 29 Sep 2023 21:30 IST

(Photos: Instagram)

పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిదేదీ ఉండదని అంటుంటారు. ఆస్ట్రేలియాకు చెందిన మెలనీ పెర్కిన్స్‌ జీవితమే ఇందుకు నిదర్శనం. 19 ఏళ్ల వయసులో ఓవైపు చదువుకుంటూనే మరోవైపు విద్యార్థులకు గ్రాఫిక్‌ డిజైనింగ్‌ పాఠాలు నేర్పేదామె. అయితే అందుకు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ ద్వారా డిజైనింగ్‌ పాఠాలు నేర్చుకోవడం విద్యార్థులకు కష్టంగా ఉండడంతో తనే సొంతంగా ఒక ఆన్‌లైన్‌ టూల్‌ని రూపొందించాలనుకుంది. ఇందుకోసం ఎంతోమంది పెట్టుబడిదారులను సంప్రదించింది. కానీ వారి నుంచి ప్రతికూల స్పందనే ఎదురైంది. దాదాపు 100 మంది ‘నో’ చెప్పినా పట్టు వదలకుండా ప్రయత్నించి తన కలను సాకారం చేసుకుంది. ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌ను 190 దేశాల్లో కోట్ల మంది వినియోగిస్తున్నారు. ‘కాన్వా’గా మొదలైన ఈ వెబ్‌సైట్‌ను.. ప్రపంచంలోనే పేరుమోసిన గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కంపెనీగా తీర్చిదిద్దిన మెలనీ పెర్కిన్స్‌ స్ఫూర్తి ప్రయాణమే ఇది!

అలా ఆలోచన వచ్చింది...

ఆస్ట్రేలియాకు చెందిన మెలనీ పెర్కిన్స్‌ పెర్త్‌లో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి బిజినెస్‌ అంటే మక్కువ. ఈ ఇష్టంతోనే తన 14 ఏళ్ల వయసులో స్కార్ఫ్‌లు విక్రయించింది. పాఠశాల విద్య పూర్తైన తర్వాత పెర్కిన్స్‌ ‘వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ’లో చేరింది. అక్కడే ‘కమ్యూనికేషన్‌ సైకాలజీ, కామర్స్‌’లో డిగ్రీ పట్టా అందుకుంది. పెర్కిన్స్‌ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు విద్యార్థులకు గ్రాఫిక్‌ డిజైనింగ్‌పై శిక్షణ ఇచ్చేది. అయితే ఈ డిజైనింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి డిజైనింగ్‌ మెలకువలు నేర్చుకోవడం విద్యార్థులకు కష్టమయ్యేది. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాంటి నైపుణ్యాలు అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో సులభంగా ఫొటోలు డిజైన్‌ చేసుకునేలా ఓ టూల్‌ని రూపొందించాలనుకుంది.

ఫ్యూజన్‌ బుక్స్‌తో మొదలు...

ఆలోచనొచ్చిందే తడవుగా దీన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టింది పెర్కిన్స్‌. ఈ క్రమంలోనే మొదటగా 2007లో ‘ఫ్యూజన్‌ బుక్స్‌’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందుకోసం తన స్నేహితుడు క్లిఫ్‌ ఒబ్రెచ్‌ సహాయం తీసుకుంది. ఫ్యూజన్‌ బుక్స్‌ ద్వారా విద్యార్థులు తమ ఇయర్‌బుక్స్‌ (గత సంవత్సరానికి సంబంధించిన సంఘటనలు, వాటి వివరాల గురించి తెలియజేసే పుస్తకం)ను సులభంగా డిజైన్‌ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌కి తక్కువ సమయంలోనే మంచి ఆదరణ లభించడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇదే ఉత్సాహంతో పెర్కిన్స్ తన కలల డిజైనింగ్‌ టూల్‌ని రూపొందించాలనుకుంది. అయితే ఆన్‌లైన్‌ గ్రాఫిక్‌ డిజైనింగ్‌ టూల్‌ని రూపొందించాలంటే ఎక్కువ పెట్టుబడి కావాలి. అందుకోసం పెర్కిన్స్‌ దాదాపు వంద మంది పెట్టుబడిదారులను సంప్రదించింది. అయితే వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు. అయినా ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో బిల్‌ తాయి అనే పెట్టుబడి దారుడిని కలిసింది. అతని సలహా మేరకు మూడు నెలల పాటు సిలికాన్‌ వ్యాలీలో గడిపిన ఆమె.. ఈ క్రమంలో స్టార్టప్‌ ప్రారంభం, దాన్ని అభివృద్ధి చేయడం, మార్కెటింగ్‌ మెలకువలు.. వంటివన్నీ నేర్చుకుంది. ఈ సమయంలోనే గూగుల్‌ మాజీ ఉద్యోగి కెమరూన్‌ ఆడమ్స్‌నీ కలిసింది పెర్కిన్స్‌. అతను కూడా ఆమె ప్రాజెక్టుకు మద్దతు పలకడంతో.. పెర్కిన్స్‌, క్లిఫ్‌, ఆడమ్స్‌.. ముగ్గురూ కలిసి 2013లో ‘కాన్వా’ పేరుతో గ్రాఫిక్‌ డిజైనింగ్‌ సంస్థను ప్రారంభించారు.

అంతకంతకూ పెరిగిన ఆదరణ!

ఇలా పెర్కిన్స్‌ తన ఆరేళ్ల కలను సాకారం చేసుకుంది. ఈ క్రమంలోనే యూజర్లు ఆన్‌లైన్‌లో ఫొటోలు డిజైన్‌ చేసుకునే విధంగా టూల్‌ని రూపొందించింది. దీనిద్వారా ఎలాంటి ఫొటో డిజైనింగ్‌ నైపుణ్యాలు లేకపోయినా.. గ్రీటింగ్‌ కార్డులు, బ్యానర్లు, టెంప్లెట్స్‌, ఇన్ఫోగ్రాఫిక్స్.. వంటివి ఉచితంగా, సృజనాత్మకంగా రూపొందించుకోవచ్చు. మొదట్లో కొన్ని ప్రతికూలతలు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించి.. నూతన సాంకేతికతకు అనుగుణంగా వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. తద్వారా కాన్వాకు యూజర్ల నుంచి ఆదరణ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. దాంతో సంస్థ ఆదాయమూ పెరిగింది. అలా 2018లో ఈ సంస్థ ‘యూనికార్న్’(1 బిలియన్‌ డాలర్లు ఆర్జించి) జాబితాలో చేరింది. ప్రస్తుత రోజుల్లో కాన్వా గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో సుమారు 6 కోట్ల మంది ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుంటున్నారు.

సామాజిక సృహ కూడా ఎక్కువే..

ఒక సాధారణ టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించిన పెర్కిన్స్.. ఇప్పుడు బిలియనీర్‌గా ఎదిగింది. ఆమె సంస్థ విలువ ప్రస్తుతం 26 బిలియన్‌ డాలర్లుగా ఉంది. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో సంస్థలు విఫలమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో మహిళలు 28 శాతం ఉండడమే ఇందుకు నిదర్శనం. అయితే పెర్కిన్స్‌ మాత్రం తాను ఈ అసమానతలకు వ్యతిరేకమని చెబుతోంది. ఆమె సంస్థలో 41 శాతం మహిళా ఉద్యోగులు ఉండడమే ఇందుకు నిదర్శనం. పెర్కిన్స్‌కు సామాజిక సృహ కూడా ఎక్కువే. తమ సంస్థ ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 30 శాతం డబ్బును పలు సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. ఇక పెర్కిన్స్‌ 2021లో తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన క్లిఫ్‌నే పెళ్లి చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్