Published : 31/01/2023 00:43 IST

ఈ అమ్మాయిలు..విశ్వ విజేతలు

క్రికెట్‌ అంటే అబ్బాయిలదే అనే తీరును మారుస్తున్నారు అమ్మాయిలు. తాజా అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ గెలుపే అందుకు ఉదాహరణ. ఆడపిల్లలకు.. క్రికెట్టా అన్న ప్రశ్నలకు ఆటతోనే జవాబు చెప్పారు. అందుకోసం సూటిపోటి మాటలు, అవమానాలు దాటారు. వేలెత్తి చూపినవారి చేతే చప్పట్లు కొట్టించుకుంటున్నారు. వారిలో ముగ్గురు తెలుగమ్మాయిలూ ఉన్నారు.


గెలుపుతో జవాబు

మ్మాయిలకు ఆటలెందుకు? క్రికెట్‌ అవసరమా? ఈ ప్రశ్నలన్నింటికీ తన ఆటతోనే జవాబిచ్చింది గొంగడి త్రిష! నాన్న రామిరెడ్డి హాకీ ఆటగాడైనా.. త్రిషని క్రికెట్‌లో ప్రోత్సహించారు. కూతురు కోసం ఉద్యోగాన్నీ, సొంతూరునీ వదిలి హైదరాబాద్‌ మకాం మార్చారు. కూతురిపై ఆయనకున్న నమ్మకమది. దాన్ని నిజం చేస్తూ అండర్‌-19 ప్రపంచకప్‌లో రాణించిందీ భద్రాచలం అమ్మాయి. రోజుకు 7-8 గం. సాధనకే కేటాయించే త్రిష.. ఓపెనింగ్‌ బ్యాటర్‌, లెగ్‌స్పిన్నర్‌. రాష్ట్రం తరఫున అండర్‌ 16, 19 టీమ్‌లకు ఆడింది. బీసీసీఐ నుంచి ‘ఉత్తమ క్రికెటర్‌’ పురస్కారం అందుకున్న త్రిష.. ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై అర్ధశతకంతో మెరిసింది. కీలకమైన ఫైనల్లో ఒత్తిడిని తట్టుకొని తన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. అమ్మాయిలు మొదటి ప్రపంచకప్‌ సాధించడంలో పాత్ర పోషించింది. మిథాలి, ధోనీలను ఆరాధించే ఈ అమ్మాయి.. వాళ్లలాగే మరెందరికో స్ఫూర్తిగా నిలవాలనుకుంటోంది.


ఆ నమ్మకం నిలబెట్టాలనీ

నాన్న మహమ్మద్‌ షకీల్‌ నౌకాదళ అధికారి, క్రికెటర్‌ కూడా! ఆయన స్ఫూర్తితో ఎనిదేళ్ల వయసులో క్రికెట్‌ను ఎంచుకుంది షబ్నమ్‌. బ్యాటర్‌గా అడుగుపెట్టి పేసర్‌గా మారింది. వీళ్లది విశాఖపట్నం. చెల్లి కూడా క్రికెటరే. ఇద్దరమ్మాయిలూ ఆటలంటూ తిరుగుతోంటే చుట్టూ ఉన్నవాళ్లు షకీల్‌ని నానా మాటలనేవారు. ‘అమ్మాయిలైతేనేం.. ఎవరికీ తీసిపోర’ని నాన్న ఇచ్చే సమాధానం షబ్నమ్‌ మనసులో నాటుకుపోయింది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని ఉదయం 4.45కే సాధన మొదలుపెడుతుంది. ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. తన కష్టానికి ఫలితమన్నట్లుగా ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించింది. రెండు మ్యాచ్‌ల్లో.. మంచి వేగంతో ఆకట్టుకుంది. తనని నమ్మిన నాన్న గర్వపడేలా చేసింది. మహిళా క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా నిలవాలనుకునే షబ్నమ్‌ చదువులోనూ ముందే!


ఆయన గర్వపడేలా

‘మైదానంలో అడుగు పెట్టాక నా దృష్టంతా ఆటమీదే! ఆట ముగిశాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తా’నంటుంది శ్వేతా సహ్రావత్‌. ప్రపంచకప్‌లో 297 పరుగులతో టాప్‌ స్కోరర్‌ తనే! అలాంటి శ్వేత గురించి టోర్నీ ముందు వరకూ ఎవరికీ తెలియదంటే నమ్ముతారా? 8ఏళ్ల వయసులో అక్కని చూసి బ్యాట్‌ పట్టింది. అబ్బాయిలతో పోటీపడి ఆడుతూ కోచ్‌లను ఆకర్షించింది. అయితే వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, స్కేటింగ్‌లతో పాటుగా దీన్నీ ఆడిన శ్వేత 2016 భారత్‌- పాకిస్థాన్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను చూశాక సీరియస్‌గా సాధన చేసింది. దిల్లీ జట్టులో స్థానం సంపాదించింది. ఆమెకు నాన్న సంజయ్‌ తోడ్పాటు ఎప్పుడూ ఉండేది. తన ఆట గురించి ఆయన స్నేహితుల వద్ద ప్రస్తావించినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన్ని అందరిముందూ గర్వంగా తలెత్తుకునేలా చేయాలనుకున్న శ్వేత ఈ వరల్డ్‌కప్‌తో అనుకున్నది సాధించింది. అండర్‌ 19 వైస్‌కెప్టెన్‌ కూడా అయిన ఈ దిల్లీ అమ్మాయి మహిళా క్రికెట్‌లోనే ఇప్పుడో సంచలనం!


ఆ లక్ష్యంతో..

13 ఏళ్ల వయసులో అంతర్‌ పాఠశాలల టోర్నీ కోసం తొలిసారి బంతి పట్టింది సొప్పదండి యషశ్రీ. అత్యుత్తమ పేసర్‌గా ఎదగాలన్నది ఆమె లక్ష్యం. పిల్లలు ఫిట్‌గా ఉండాలంటే ఆటలే దారనుకున్నారు ఆమె అమ్మానాన్న విద్య, వేణుగోపాల్‌. యషశ్రీకి బాస్కెట్‌బాల్‌, ఈత, కరాటేెల్లో శిక్షణిప్పించారు. కానీ ఆమె దృష్టి క్రికెట్‌పై పడింది. తక్కువ సమయంలోనే యషశ్రీ ఫాస్ట్‌బౌలింగ్‌పై పట్టు సాధించింది. హైదరాబాద్‌ అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌ అయ్యింది. ప్రస్తుతం డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న తను గాయపడ్డ హర్లీ గలా స్థానంలో అనుకోకుండా జట్టులోకి వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.


తల్లి కష్టానికి ఫలితం..

‘అమ్మాయిని తప్పుడు మార్గంలో పెంచుతోంది’ అండర్‌ 19 మహిళల వరల్డ్‌కప్‌ గెలుపులో పాత్ర పోషించిన అర్చన తల్లి సావిత్రి ఎదుర్కొన్న ఇలాంటి అవమానాలెన్నో. భర్త క్యాన్సర్‌తో దూరమయ్యాడు. కొన్నాళ్లకు చిన్న కొడుకు పాము కాటుతో చనిపోయాడు. అందరూ భర్తనీ, కొడుకునీ బలి తీసుకున్న దెయ్యంగా నిందిస్తున్నా కూతురి క్రికెట్‌ కలను నెరవేర్చడానికే పూనుకున్నారామె. అర్చన కూడా అమ్మ పేరు నిలబెట్టాలని కసిగా ఆడేది. వీళ్లది యూపీలోని రతాయి పూర్వా అనే గ్రామం. ‘దెయ్యాల కొంప’ంటూ వీళ్లింటి వైపు చూడటానికీ ఎవరూ ఇష్టపడేవారు కాదు. వీటన్నింటికీ దూరంగా అమ్మ అర్చనను 20కి.మీ. దూరంలో బోర్డింగ్‌ స్కూల్లో చేర్చి చదివించింది. అక్కడి కోచ్‌ పూనమ్‌ గుప్తా సిఫారసు తో అర్చనకు కాన్పూర్‌లో కపిల్‌ పాండే (కుల్‌దీప్‌ యాదవ్‌ కోచ్‌) వద్ద శిక్షణ అవకాశమొచ్చింది. ఆయన శిక్షణలో ఆమె రాటుదేలింది. ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లతో సత్తాచాటింది. ఒకప్పుడు వెలేసిన వారంతా వాళ్లింటికి వెళ్లి ఆమె అమ్మనీ, అన్నయ్యనీ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

- చందు శనిగారపు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి