Women Agniveer: సంద్రంలో పోరుకు సై

ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కా శిక్షణా కేంద్రానికి ఇది సరికొత్త అనుభవం. ఎందుకంటే ఇంతవరకూ ఎంతో మంది యుద్ధవీరులని తయారుచేసిన ఈ కేంద్రం తొలిసారి నావికాదళంలో 273 మంది వీరనారీమణులని తయారుచేసింది.. 

Updated : 31 Mar 2023 07:29 IST

ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కా శిక్షణా కేంద్రానికి ఇది సరికొత్త అనుభవం. ఎందుకంటే ఇంతవరకూ ఎంతో మంది యుద్ధవీరులని తయారుచేసిన ఈ కేంద్రం తొలిసారి నావికాదళంలో 273 మంది వీరనారీమణులని తయారుచేసింది.. 

దేశం కోసం పోరాడాలనే తపన ఉండాలేకానీ అందుకు ఆడా, మగా భేదం లేదని నిరూపించారీ అగ్నివీర్‌ మహిళలు. అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 82000 మంది నేవీకి దరఖాస్తు చేసుకుంటే అందులో 273 మంది మహిళలు శిక్షణకు అర్హత సాధించారు. ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వీరంతా పదహారు వారాలపాటు వివిధ రకాల శిక్షణలు అందిపుచ్చుకున్నారు. అయితే నేవీ ‘సెయిలర్స్‌’గా మహిళలకు ఇది తొలి అవకాశం. దాంతో ఐఎన్‌ఎస్‌.. మహిళా శిక్షణార్థుల అవసరాలు, సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వాళ్లకోసం ప్రత్యేకమైన గదులు, భోజనశాలలు ఏర్పాటు చేసింది. శానిటరీ పాడ్‌ వెండింగ్‌ యంత్రాలు.. ఉపయోగించిన వాటిని పర్యావరణహితంగా ధ్వంసం చేసే డిస్పోజబుల్‌ మెషీన్లు, రక్షణ కోసం సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేసింది. స్విమ్మింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లుగా మహిళలని నియమించింది. ‘భవిష్యత్‌ అవసరాలు, స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని నావికాదళం ఈ దిశగా అడుగులు వేస్తోంది’ అంటున్నారు కమాండర్‌ గౌరీ మిశ్రా. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళలు అటు ఆపరేషనల్‌ డ్యూటీస్‌లోనూ, ఫ్రంట్‌లైన్‌ వార్‌షిప్స్‌లోనూ మగవాళ్లతో సమానంగా పనిచేస్తారు.

తండ్రి కోసం...

శిక్షణ పూర్తయిన వారిలో పఠాన్‌కోట్‌కు చెందిన 19 ఏళ్ల ఖుషీ పఠానియా ఉత్తమ మహిళా అగ్నివీర్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ ట్రోఫీని అందుకుంది. ఖుషీ తాత సుబేదార్‌ మేజర్‌గా దేశానికి సేవలు అందిస్తే ఆమె తండ్రి రైతు. మరొక అమ్మాయి.. పందొమ్మిదేళ్ల హిషా బాఘేల్‌ తనకెంతో ఇష్టమైన తండ్రి కలని నెరవేర్చడం కోసం యుద్ధభూమిలో అడుగుపెట్టనుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మొదటి మహిళా అగ్నివీర్‌ హిషా. రాజధాని రాయ్‌పూర్‌కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరిగార్కా గ్రామం ఆమెది. చిన్నప్పటి నుంచీ చదువులూ, ఆటపాటల్లో చురుగ్గా ఉండే హిషా బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసింది. ఆ సమయంలోనే ఎన్‌సీసీలో చేరింది. ఆమె తండ్రి సంతోష్‌ బఘెల్‌ ఆటో డ్రైవర్‌. హిషాని సాయుధ దళాల్లో చేరాలని ప్రోత్సహించేవారు. ఇల్లు గడవడం ఎంత కష్టంగా ఉన్నా... తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కనేవారాయన. దురదృష్టవశాత్తు 2016లో క్యాన్సర్‌ బారిన పడ్డాడాయన. అప్పటి నుంచి చికిత్స, పిల్లల చదువులకోసం బోలెడు ఖర్చులై చివరికి ఉపాధినిచ్చే ఆటోని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా సరే ఎప్పుడూ నిరాశపడలేదు. తన కూతురు లక్ష్యసాధనకు ఆటంకం రానివ్వలేదు. వైజాగ్‌లో జరిగిన అగ్నివీర్‌ ఎంపికల సందర్భంగా...ఫిజికల్‌ టెస్టుల్లో హిషా నెంబర్‌వన్‌గా నిలిచింది. ఆమె శిక్షణ చివరి దశలో ఉన్నప్పుడు ఆయన క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు. నేవీ యూనిఫాంలో హిషాను చూడాలనుకున్న ఆ తండ్రి కలకు...ఆటంకం కలగకూడదని ఆ విషయం ఆమెకు చెప్పలేదు కుటుంబ సభ్యులు. ఏప్రిల్‌ రెండోవారంలో ఇంటికి రానున్న హిషకు అప్పుడే ఈ విషయం చెప్పాలని నిర్ణయించకున్నారట ‘లక్ష్యాన్ని చేరుకున్న సంతోషంలో ఉంది. నాన్న కల కూడా అదే! ఈ ఆనంద క్షణాల్ని విషాదంగా ముగించాలని అనుకోవడం లేదు.’ అని చెబుతున్నాడు వాళ్ల అన్న కోమల్‌.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్