పంచ్‌లు విసిరి... పతకాలు పట్టి!

ఈ అమ్మాయిలు కసిగా పంచ్‌ విసిరారంటే ప్రత్యర్థికి పట్టపగలు చుక్కలు కనిపించాల్సిందే.. దేశానికి పతకాలు క్యూ కట్టాల్సిందే! ఈ విజయాలు వాళ్లకి అంత తేలిగ్గా వచ్చినవేం కాదు. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుని సాధించినవి.

Updated : 25 Mar 2023 05:42 IST

ఈ అమ్మాయిలు కసిగా పంచ్‌ విసిరారంటే ప్రత్యర్థికి పట్టపగలు చుక్కలు కనిపించాల్సిందే.. దేశానికి పతకాలు క్యూ కట్టాల్సిందే! ఈ విజయాలు వాళ్లకి అంత తేలిగ్గా వచ్చినవేం కాదు. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుని సాధించినవి. ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 65 దేశాలకు చెందిన 300 మందితో తలపడి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు తెలుగమ్మాయి నిఖత్‌జరీన్‌ సహా మన దేశ క్రీడాకారిణులు..

మరో మేరీ!  

అబ్బాయిపై నమ్మకం ఉంచినట్టే ఆడపిల్లపైనా నమ్మకం ఉంచండి అని చెప్పే గెలుపు కథ నీతూది. ఆమెని గెలిపించడం కోసం ఆమె తండ్రి ఎంత కష్టపడ్డాడో అంతకంటే ఎక్కువగా అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనుకుంది 22ఏళ్ల నీతూ ..

హరియాణాలోని బాక్సర్ల ప్రాంతంగా పేరుగాంచిన భివానీ జిల్లాలో పుట్టింది నీతూ ఘాంఘాస్‌. తండ్రి జై భగవాన్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఇంట్లో ఉంటే తోబుట్టువులతో ఒకటే అల్లరి. నిరంతరం కొట్లాటలే. ఆ అల్లరి పిల్లని దారిలో పెట్టాలనుకున్నాడా తండ్రి. అందుకే 12 ఏళ్లకే బాక్సింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. మొదట్లో అన్నీ అపజయాలే. దాంతో నిరాశపడిన నీతూ ఆ క్రీడని వదిలేద్దామనుకుంది. కానీ తన కూతురిలో విజేతని గుర్తించిన ఆ తండ్రి మాత్రం ఉద్యోగానికి మూడేళ్లు సెలవుపెట్టాడు. ఆ సమయంలో కుటుంబాన్ని నడపడం కోసం వ్యవసాయం చేశాడు. ఉన్న కారుని అమ్మేసి... మరో ఆరు లక్షలు అప్పు చేశాడు. ఇవన్నీ కూతురిపైన నమ్మకంతోనే. ఐదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకున్న నీతూ వెనుతిరిగి చూడలేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో గెలిచిన బంగారు పతకంతో సహా రెండుసార్లు యూత్‌ఛాంపియన్‌గా గెలిచి ఆ విజయాలని తండ్రికే అంకితం ఇచ్చింది. మరో మేరీకోమ్‌ అని క్రీడాభిమానులు ముద్దుగా పిలుచుకొనే నీతూని గబ్బర్‌ షేర్నీని అంటారంతా. తాజా మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరింది నీతూ!

లక్ష్యం.. బంగారం!

‘హమ్మయ్యా.. ఈసారి పతకం రంగు మారింది! రెండు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లు, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలే సాధించేసరికి నాలోనే ఏదో సమస్య ఉందనుకున్నా. ఇప్పుడా బెంగ లేద’ని సంబరంగా చెబుతోంది లవ్లీనా బోర్గోహెయిన్స్‌! తాజా విమెన్స్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వెండి ఖాయం చేసుకొని బంగారు పతకం లక్ష్యంగా సాగుతోంది. అసోంలోని చిన్న పల్లె ఈమెది. తను ఒలింపిక్‌ పతకం సాధించేవరకూ గ్రామానికి రోడ్డు మార్గమూ లేదు. నాన్న చిరు వ్యాపారి. ‘ముగ్గురూ కూతుళ్లే అని ఊళ్లో వాళ్లంతా నాన్నని చూసి జాలిపడేవారు. అది చూసి అమ్మ వాళ్ల నోళ్లు మూయించేలా ఏదైనా సాధించి చూపమనేది. ఆ మాట నా మనసులో నాటుకుపోయింది’ అనే లవ్లీనా అక్కల స్ఫూర్తితో తనూ కిక్‌బాక్సింగ్‌ ఎంచుకుంది. కానీ దానికి ఒలింపిక్స్‌ అవకాశం లేదని బాక్సింగ్‌కి మారింది. జాతీయ స్థాయిలో మెరిసి, అంతర్జాతీయ అవకాశాల్ని దక్కించుకుంది. 2018, 2019 వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో కాంస్య పతకాలు గెలుచుకుంది. అయితే తన కల ఒలింపిక్స్‌ పతకం. 2020లో సరిగ్గా పోటీలకు ముందు అమ్మకు శస్త్రచికిత్స, తనేమో కొవిడ్‌ బారిన పడి శిక్షణకు వెళ్లలేకపోయింది. అయినా ఇంట్లోనే సాధన చేసి, కాంస్యం దక్కించుకుంది. గత ఏడాది ఏషియన్‌ ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం సాధించినా పొలంలో దిగి నాన్నకు సాయం చేస్తుంది. గ్యాస్‌ సిలిండర్లు మోస్తుంది. ఎవరైనా వారించినా.. ‘ఎంత ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదు కదా’ అని సమాధానమిచ్చే లవ్లీనా లక్ష్యం ఎప్పటికైనా ఒలింపిక్‌లో బంగారు పతకమేనట! 2020లో అర్జున, 21లో ఖేల్‌రత్న పురస్కారాలనూ అందుకుంది.

నాన్న మాటతో..

అసలే పెద్దగా మాట్లాడని తత్వం స్వీటీ బురాది! తోటివారితో విభేదాలొస్తే శాంతంగా పరిష్కరించుకోవడానికే ప్రయత్నించేదట. ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే చేతికి పనిచెప్పేదట. అప్పుడు వాళ్ల నాన్న నవ్వి.. ‘నువ్వు కబడ్డీలో కాదు బాక్సింగ్‌లో చేరాల్సింది’ అనేవారట. హరియాణాలోని హిసార్‌ ఈమెది. అక్కడ కబడ్డీలో చేరిన తొలి అమ్మాయి. ఆమెను వాళ్ల నాన్న ఇంజినీర్‌గా చూడాలనుకుంటే ఆమె మనసేమో కబడ్డీవైపు మళ్లింది. నేషనల్‌ ప్లేయర్‌ కూడా. తర్వాత నాన్నమాట సీరియస్‌గా తీసుకొని 2009లో బాక్సింగ్‌లో చేరింది. చేయలేవు అంటే చేసి చూపడం స్వీటీ తత్వం. మొదటి పోటీలో ఓడిపోతున్న తనతో ఆమె తమ్ముడు ‘పగలే చుక్కలు కనిపించాయా?’ అని గేలిచేస్తే తట్టుకోలేక ఆ కోపాన్నంతా ప్రత్యర్థిపై చూపి, గెలిచి చూపించింది. అది మొదలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు అనుసరించాయి. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు. అన్నింటినీ ఓపిగ్గా దాటుకుంటూ వచ్చింది. ‘కలల కోసం ఎంత కష్టమైనా పడే తీరు నాది. దీన్ని మాత్రం ఎందుకు వదిలేయాలనుకున్నా. 2024 ఒలింపిక్స్‌ లక్ష్యంగా పెట్టుకొన్నా’ అనే స్వీటీ ప్రతిపోటీనీ సాధించాలని కసిగా సాధనా చేసింది. ఫలితమే విమెన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్