Inspirational Stories: పల్లె యువతులు భద్రతా సిబ్బందిగా!

మార్చ్‌ఫాస్ట్‌.. డ్రిల్‌, యోగా అన్నింట్లోనూ ఆరితేరారు! ఆపద వస్తే కాపాడ్డానికి ముందుంటారు.. ప్రాణాలమీదకు వస్తే సీపీఆర్‌ అందించి దేవుళ్లు అవుతారు... ఇవన్నీ విని వీళ్లు ఏ పోలీసులో అయ్యుంటారులే అనుకొంటే పొరపాటు.

Published : 04 Mar 2023 00:31 IST

మార్చ్‌ఫాస్ట్‌.. డ్రిల్‌, యోగా అన్నింట్లోనూ ఆరితేరారు! ఆపద వస్తే కాపాడ్డానికి ముందుంటారు.. ప్రాణాలమీదకు వస్తే సీపీఆర్‌ అందించి దేవుళ్లు అవుతారు... ఇవన్నీ విని వీళ్లు ఏ పోలీసులో అయ్యుంటారులే అనుకొంటే పొరపాటు. వీళ్లంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటిసారి సెక్యురిటీ గార్డ్‌ శిక్షణ తీసుకుంటున్న 32 మంది మహిళలు..

ద్దరు చంటిపిల్లలు. మామగారికి పక్షవాతం. భర్త లైన్‌మెన్‌. ఇల్లు, ఆసుపత్రి ఖర్చులు. కుటుంబమంతా ఒకరి జీతంమీదే ఆధారపడాలి. తనకేమో బీటెక్‌ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. ప్రవళిక పరిస్థితి ఇది!

మల్లేశ్వరిది ఇంకో కథ! భర్త కిడ్నీ సమస్యలతో చనిపోయాడు. అతనికి సేవలు చేసి, ఆమె ఆరోగ్యమూ క్షీణించింది. అత్తింటివాళ్లు ఆదరించలేదు. దీంతో పుట్టింటికి చేరింది. ఇంటర్‌ కూడా పూర్తికాలేదు. కానీ ఎంత కష్టమైనా ఎవరి పైనా ఆధారపడొద్దన్నది ఆమె లక్ష్యం! అక్కడున్న 32 మంది అమ్మాయిలవీ ఇలాంటి కథలే.

పెళ్లైన వారికీ...

పెద్ద చదువులు చదివిన వాళ్లకే అవకాశాలు అంతంత మాత్రం. మరి చదువు పూర్తిచేయని వాళ్ల పరిస్థితేంటి? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారికి అవకాశాలు తక్కువ. ఇలాంటివారికి చేయూతనివ్వడానికి కేంద్రం దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద శిక్షణ అందిస్తోంది. ఈ ఏడాది పైలట్‌ ప్రాజెక్టు కింద మహిళలకూ సెక్యూరిటీ సూపర్‌వైజర్స్‌ విభాగంలో శిక్షణ ఇవ్వాలనుకుంది. తెలంగాణలో పైలట్‌ ప్రాజెక్టు కింద మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వారికి అవకాశం కల్పించారు. అలా సంగారెడ్డిలోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో ఈ జనవరి నుంచి శిక్షణ ప్రారంభమైంది. 32 మంది మహిళలు ఇందులో చేరారు. వారిలో 14 మంది వివాహితులు.

ఈపీఎఫ్‌ ఇస్తారు...

‘శిక్షణలో భాగంగా మార్చ్‌ఫాస్ట్‌, డ్రిల్‌, వ్యాయామాలుంటాయి. గ్రామీణ యువతులు.. పోషకాహార లోపంతో త్వరగా అలసిపోయేవారు. సెక్యూరిటీ విభాగమంటే దృఢంగా ఉండాలిగా! అందుకే పోషకాహారాన్ని అందిస్తున్నాం. కొందరికి చిన్న పిల్లలున్నారు. వాళ్లని విడిచి ఉండలేకపోతోంటే వెంట తెచ్చుకునే వీలు కల్పించాం. వాళ్లు మానసికంగా నిబ్బరంగా ఉండటమూ ప్రధానమే.. అందుకే యోగానీ నేర్పిస్తున్నాం. ఇప్పటికే రెండు నెలల శిక్షణ పూర్తైంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు శిక్షణ ఉంటుంది. వారాంతాల్లో ఇంటికి వెళ్లే అవకాశం కల్పించాం. ఉద్యోగం తప్పక చేయాలన్న నిబంధన ముందే పెట్టాం. నగరం, చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడ పనిచేయగలరన్నదీ వాళ్లనే ఎంచుకోమన్నాం. రూ.10-12 వేల జీతంతోపాటు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలూ ఉంటాయి’ అని చెబుతున్నారు మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్‌ సుగుణ. ఈ 32 మందిదీ ఒకే లక్ష్యం! తమ కాళ్లపై తాము నిలవాలని! ఈ శిక్షణతో మిగతావాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి!


ఆపదొస్తే ముందుంటారు..

ఇంటర్‌ పాసై 18-35 వయసులోపు వారిని, పేద కుటుంబాల మహిళలను ఈ శిక్షణకు ఎంపిక చేశారు. మూణ్నెళ్లు నివాసం, ఆహారం, యూనిఫాం వంటి వసతులన్నీ కల్పించి, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. సెక్యూరిటీ గార్డు, సూపర్‌ వైజర్‌ బాధ్యతలు, ఆపదవేళ స్పందించేలా, అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు పరిస్థితిని అదుపు చేయడం, ప్రజల్ని రక్షించడం, ఎవరైనా అనారోగ్యం పాలైతే ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడం, సీపీఆర్‌ వంటివి నేర్పిస్తున్నారు. తొక్కిసలాటలు, యాక్సిడెంట్ల సమయంలో స్పందించడం వంటివాటితోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌నీ నేర్పిస్తున్నారు.

- శివ, సంగారెడ్డి


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్