Eram Saeed: ఒకరికొకరం... అండా దండా

తొలిసారి తల్లవుతున్నారా... ఇక ఎన్నో సందేహాలు. ఏం తినాలి, ఏం తినకూడదు, పిల్లలు పుట్టాక... ఏం పెట్టాలి, ఏం పెట్టొద్దు, వాళ్లు పెరుగుతున్నప్పుడు... మాట వినడం లేదు, ఏ స్కూల్లో చేరిస్తే మంచిది...

Published : 14 May 2023 00:32 IST

తొలిసారి తల్లవుతున్నారా... ఇక ఎన్నో సందేహాలు. ఏం తినాలి, ఏం తినకూడదు, పిల్లలు పుట్టాక... ఏం పెట్టాలి, ఏం పెట్టొద్దు, వాళ్లు పెరుగుతున్నప్పుడు... మాట వినడం లేదు, ఏ స్కూల్లో చేరిస్తే మంచిది... ఇలా ఎన్నో ప్రశ్నలు... వీటికి సమాధానాలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోని అమ్మమ్మలూ, పెద్దమ్మలే చెప్పేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికగా ‘అమ్మల నెట్‌వర్క్‌’లు ఆ కొరత తీరుస్తున్నాయి. పిల్లల పెంపకం నుంచి వారి పెళ్లి సారె వరకూ అన్ని సందేహాలకూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.


మామ్స్‌ ఆఫ్‌ ఇండియా

బెంగళూరు కెమిస్ట్రీ లెక్చరర్‌ ‘ఎరుమ్‌ సయీద్‌’కి కవలలు. వారి పెంపకంలో తను పడిన ఇబ్బందులు మరెవరికీ ఎదురుకాకూడదని ఆమె తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ చర్చావేదికే ఇది. వేసవి శిబిరాల నుంచి స్ఫూర్తి కథనాల షేరింగ్‌ వరకూ, పిల్లల ఆహారం నుంచి ఆటలూ, ఆరోగ్యం వరకూ అన్నింటా తోటి అమ్మలకు అండగా నిలబడుతున్నారు.

1.5 లక్షలకు పైగా సభ్యులు, 14 రాష్ట్రాల్లో శాఖలు


మామ్మీ నెట్‌వర్క్‌

అమ్మయ్యాక బిడ్డ ఆరోగ్యం, ఆనందం కోసం చేయని ప్రయత్నా లుండవు. ఈ క్రమంలో వచ్చే సందేహాలను పంచుకునేందుకు ముగ్గురు స్నేహితురాళ్లు... తేజల్‌ బజ్జా, శ్రేయా లంబా, కిరణ్‌ అమ్లానీలు ప్రారంభించిన నెట్‌వర్క్‌ ఇది. పిల్లల దుస్తులూ, ఆటవస్తువుల కొనుగోలు నుంచి పంపకాల వరకూ... కిండర్‌ గార్డెన్‌ నుంచి కాలేజీ చదువుల వరకూ ఎన్నో విషయాలను పంచుకుంటారు.

25 వేలకు పైగా సభ్యులు


పాలిచ్చే తల్లులకోసం...

పుణెకు చెందిన ఆధునికా ప్రకాశ్‌ కలల రూపమే ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ సపోర్ట్‌ ఫర్‌ ఇండియన్‌ మదర్స్‌’. కొత్త అమ్మలకి సందేహాలు మొదలయ్యేది తల్లిపాలు ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచే మరి. ఆధునిక ఉద్యోగరీత్యా ఐర్లాండ్‌లో ఉన్నప్పుడే ప్రసవం కావడంతో... చిన్నారి ఆలనా పాలనా, ఇంట్లో పనులూ, నిద్రలేమి వంటివి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవట. వాటి నుంచి బయటపడటానికి అక్కడే ఓ కమ్యూనిటీలో చేరింది. ఆ అనుభవంతోనే ఇండియాకు వచ్చాక ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ఏర్పాటుచేసి.. ‘ఫ్రీడమ్‌ టు నర్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో ఉద్యమిస్తోంది. ‘తల్లిపాలు తాగడం బిడ్డ హక్కు.. బిడ్డకు పాలివ్వడం తల్లి హక్కు.. అయితే కొన్ని అపోహలు - మూఢనమ్మకాలతో ఈ హక్కుల్ని కాలరాస్తోంది సమాజం. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడాన్నీ తప్పు పడుతోంది. ఇవన్నీ కొత్తగా తల్లైన వారి మనసుల్లో నాటుకు పోతున్నాయి. తద్వారా పాలివ్వడం అనే సహజ ప్రక్రియ కాస్తా క్లిష్టంగా మారుతోంది. ఈ ఇబ్బందులను తొలగించే ప్రయత్నం మా నెట్‌వర్క్‌ చేస్తోంది. మా బృందంలో ఉన్న అమ్మలందరం వంతుల వారీగా 24/7 కొత్త తల్లులకు అందుబాటులో ఉంటాం’ అంటారామె. పదేళ్లుగా నడుస్తోందీ బృందం.

లక్షకు పైగా సభ్యులు


తెలుగు మామ్స్‌ నెట్‌వర్క్‌

‘సమస్య వచ్చినప్పుడు ఎవరితోనైనా చెప్పుకొంటే.. నవ్వుతారేమో, చులకనగా చూస్తారే మోనని జంకేదాన్ని. ఏదైనా వేదిక ఉంటే.. పేరు చెప్పకుండానే పంచుకోవచ్చు, పరిష్కారాలూ దొరుకుతాయి అనిపించింది. ఆ ఆలోచనతోనే 2019లో ‘తెలుగుమామ్స్‌ నెట్‌వర్క్‌’ను ఏర్పాటు చేశామంటారు ప్రదీప్తి విస్సంశెట్టి. ఇక్కడ మూడు, నాలుగు తరాల వారూ స్పందిస్తుంటారు. పిల్లల పెంపకం నుంచి కెరియర్‌ నిర్ణయాల వరకూ అన్నీ చర్చిస్తారు. అమ్మలు ప్రారంభించిన వ్యాపారాలకు మద్దతుగానూ నిలుస్తున్నారు.

28 వేలకు పైగా మంది సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్