ఎత్తైన యుద్ధక్షేత్రంలో తొలి వీరనారి!

సాయుధ దళాల్లో మహిళలకు సమానావకాశాలు మొదలయ్యాక.. ఆ ప్రయాణంలో మరో ముందడుగు పడింది. అత్యంత అననుకూల ప్రదేశంగా పేర్కొనే సియాచిన్‌లో విధులు నిర్వర్తించే అవకాశం అందుకున్న తొలి సైన్యాధికారిణిగా కెప్టెన్‌ శివ చౌహాన్‌ చరిత్ర సృష్టించారు.

Published : 04 Jan 2023 00:48 IST

సాయుధ దళాల్లో మహిళలకు సమానావకాశాలు మొదలయ్యాక.. ఆ ప్రయాణంలో మరో ముందడుగు పడింది. అత్యంత అననుకూల ప్రదేశంగా పేర్కొనే సియాచిన్‌లో విధులు నిర్వర్తించే అవకాశం అందుకున్న తొలి సైన్యాధికారిణిగా కెప్టెన్‌ శివ చౌహాన్‌ చరిత్ర సృష్టించారు...

సియాచిన్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమిది. సైనికులకు శత్రు రూపంలోనే కాదు.. వాతావరణపరంగానూ ఏ క్షణమైనా ఆపద ఎదురవొచ్చు. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఉంటుందా ప్రదేశం. అనుక్షణం మారే వాతావరణ పరిస్థితులు, ఏడాది పొడవునా గడ్డ కట్టించే చలి.. అక్కడ సర్వసాధారణం. శిక్షణలో ముందంజలో నిలిచిన వారికే అక్కడ పోస్టింగ్‌ ఇస్తారు. అలాంటి చోట మహిళా సైన్యాధికారి శివ చౌహాన్‌కి అవకాశమొచ్చింది. ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేశరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారీ వీరనారి. ఈవిడది రాజస్థాన్‌. చిన్న తనంలోనే నాన్న చనిపోయారు.

అమ్మే పెంచి పెద్ద చేసింది. సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసిన చౌహాన్‌.. 2021లో భారత సైన్యంలోని ఇంజినీర్‌ రెజిమెంట్‌లో నియమితులయ్యారు.

హిమాలయాల్లోని తూర్పు కారకోరం పర్వతశ్రేణిలో సియాచిన్‌ హిమనీ  నదం ఉంది. భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య నియంత్రణ రేఖ దీని వద్దే ముగుస్తుంది. ఆర్మీ ప్రత్యేక దళం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’కి చెందిన చౌహాన్‌.. సియాచిన్‌ హిమనీ నదంలోని కుమర్‌ పోస్ట్‌లో విధులు నిర్వర్తించనున్నారు. సియాచిన్‌లో 15,632 అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంది. అడుగు వేస్తే మంచులో కూరుకుపోయే ప్రమాదం.. వేగంగా వీచే చల్లగాలులు.. ఊపిరి తీసుకోవడమే ఇబ్బందయ్యే చోట పురుషులతో సమానంగా పని చేసేందుకు సిద్ధం అయ్యారామె. దీనికోసం ఎన్నో పరీక్షలు, కఠినమైన శిక్షణను పూర్తిచేసుకున్నారు. ‘గాజు తెరను బద్దలు కొట్టడం’ అనే క్యాప్షన్‌తో ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ బృందం ఆవిడ  నియామకాన్ని అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. దేశరక్షణ అవకాశం  ఎన్నో ఏళ్లు  ఎదురు చూసిన మహిళా సైనికులకే కాదు.. ఏ రంగంలోనైనా సత్తా చూపగలమనే అమ్మాయిలకూ ఇదీ గర్వించదగ్గ క్షణమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్