Hiresha Varma: లక్ష జీతం వదిలి.. పుట్టగొడుగులు పెంచుతావా అన్నారు!
చదివింది ఎంబీఏ.. ఐటీలో అనుభవం. కానీ వ్యాపారం చేస్తున్నది ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయంలో. పదేళ్ల కిందట కేదార్‌నాథ్ వరదల్లో నిరాశ్రయులైన ఎంతో మంది మహిళా రైతులకు ఉపాధి కల్పిస్తూ, ఎన్నో ఉత్తమ రైతు అవార్డులను గెలుచుకున్న హిరేష వర్మ.. హాన్ ఆగ్రోకేర్ సంస్థ ఛైర్మన్.. ఆమె స్ఫూర్తి కథనమిది..
చదివింది ఎంబీఏ.. ఐటీలో అనుభవం. కానీ వ్యాపారం చేస్తున్నది ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయంలో. పదేళ్ల కిందట కేదార్‌నాథ్ వరదల్లో నిరాశ్రయులైన ఎంతో మంది మహిళా రైతులకు ఉపాధి కల్పిస్తూ, ఎన్నో ఉత్తమ రైతు అవార్డులను గెలుచుకున్న హిరేష వర్మ.. హాన్ ఆగ్రోకేర్ సంస్థ ఛైర్మన్.. ఆమె స్ఫూర్తి కథనమిది..
మాది దిల్లీ. ఐటీలో ఉద్యోగం చేసేదాన్ని దాదాపు పదేళ్ల కింద కేదార్‌నాథ్‌లో పకృతి విపత్తు కారణంగా చాలా మందికి తినడానికి తిండి కూడా లేదు. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాను. బాధితులకు ఆహారం, దుస్తులు, అత్యవసర వస్తువులు అందించాను. చాలా మంది మహిళల భర్తలు వరదల్లో కొట్టుకుపోయారు. అక్కడి నుంచి వచ్చేసినా.. ఆ మహిళలు బతుకు బండిని ఎలా లాగుతారనే ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉండేది. దాని గురించి ఆ ప్రాంతంలో బాగా అధ్యయనం చేశా. అక్కడి వారికి వ్యవసాయం తప్ప మరే పనీ తెలియదు. అప్పుడు అక్కడ ఏ పంట అయితే లాభదాయకంగా ఉంటుందన్న విషయంలో చాలా మందితో పరిశోధనలు చేయించా. కొండ ప్రాంతాలు పుట్టగొడుగుల సాగుకు అనువుగా ఉంటాయనిపించింది. దాంతో లక్షల్లో ఆదాయం వచ్చే ఉద్యోగం మానేసి, వ్యవసాయం చేస్తానన్నా.. ఇంట్లో ఒప్పుకోలేదు. ‘ఎంబీఏ చదివి, ఏ మాత్రం అవగాహన లేని వ్యవసాయం ఎలా చేస్తావ’న్నారు. ఇది నాకోసం కాదు. దీనావస్థలో ఉన్న ఎందరో మహిళల కోసమని ఒప్పించి రంగంలోకి దిగాను.
నన్ను చూసి నవ్వారు..
మా ఇంట్లో వారితో సహా చాలా మంది నన్ను నమ్మలేదు. ఎవరూ నాకు మద్దతుగా నిలవ లేదు. అయినా నేను ఆగిపోలేదు. నాకసలు వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలియక పోవడంతో కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సొచ్చింది. 2015లో డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చిలో శిక్షణ తీసుకున్నా. రూ. 2,000 పెట్టుబడితో ప్రారంభించాను. తర్వాత ఆ ప్రాంత మహిళలకు దీనిపై నేనే శిక్షణ ప్రారంభించా. అంత మంచి ఉద్యోగాన్ని వదిలి వారి కోసం నేను ఈ పని చేస్తానంటే అక్కడి ప్రజలు కూడా నన్ను నమ్మలేదు. మొదట్లో ఉత్పత్తుల అమ్మకం కోసం నేను తెల్లవారుజామున మూడు గంటలకు మార్కెట్‌కు వెళ్లేదాన్ని. బటన్ రూపంలో ఉండే పుట్ట గొడుగుల్ని పెంచుతాం. ఈ బటన్ మష్రూమ్‌లను థాయ్‌లాండ్, జపాన్, చైనాలో ఎక్కువగా సాగు చేస్తారు. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు దాన్ని అగ్రోకేర్ ఉత్పత్తులతో భర్తీ చేస్తున్నాం. వాటిని పొడిగా కూడా మారుస్తారు. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. 2016లో దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.80 లక్షల రుణం తీసుకొని ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేశాను. ఆ తర్వాత రోజుకు 500 కిలోల దిగుబడి పెరిగింది. వీటన్నింటిని దేశవ్యాప్తంగా అమ్మేందుకు ‘హాన్ అగ్రోకేర్’ సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా సంస్థ టర్నోవర్ సంవత్సరానికి కోటిన్నర పైమాటే.. 2021లో ‘మష్రూమ్ లేడీ ఆఫ్ ఉత్తరాఖండ్’గా 2021లో జాతీయ పురస్కారం లభించింది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ 2022, ఉత్తమ ప్రగతిశీల రైతు లాంటి ఎన్నో అవార్డులను అందుకున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. వాటన్నింటికన్నా ఇప్పుడు 5,000 మంది మహిళలకు జీవనోపాధి కల్పించ గలగడం మరింత సంతోషంగా, తృప్తిగా అనిపిస్తుంది.
మా అగ్రోకేర్‌కి అనుబంధంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్‌లో దాదాపుగా 5,000 మంది మహిళలు పని చేస్తున్నారు. ఈ సంవత్సర ప్రారంభంలో నీతి అయోగ్ విడుదల చేసిన 75 మంది అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్ల సంకలనంలో హాన్ అగ్రోకేర్‌కి కూడా స్థానం దక్కింది. ఇందుకు గర్వంగా అనిపించింది.
మొదట్లో ఎంతో మంది వినియోగదారుల దగ్గర మోసపోయాను. కానీ నా మీద నేను నమ్మకాన్ని కోల్పోలేదు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను, అయినా స్థిరంగా నిలబడ్డాను. నేను ప్రతి మహిళకి చెప్పేది... మీమీద మీరు నమ్మకం పెట్టుకోండి... ఏ పనైనా ప్రణాళికా బద్ధంగా చేయండి. విజయం మీదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.