Jujjavarapu mounika: పాతే బంగారమాయె!

పాత వస్తువులని పరికించి చూడండి.. వాటితో   ముడిపడిన జ్ఞాపకాలు తాజాగా పలకరిస్తాయి. అద్భుత కళా నైపుణ్యంతో అచ్చెరువొందిస్తాయి. అలనాటి కళాఖండాలని దేశమంతటా తిరిగి సేకరించడమే కాదు వాటిని నేటి తరానికి తగ్గట్టుగా మార్చి వ్యాపారవ్తేతగా రాణిస్తున్న జుజ్జవరపు మౌనిక వసుంధరతో మాట్లాడారు.

Updated : 13 May 2023 04:39 IST

పాత వస్తువులని పరికించి చూడండి.. వాటితో ముడిపడిన జ్ఞాపకాలు తాజాగా పలకరిస్తాయి. అద్భుత కళా నైపుణ్యంతో అచ్చెరువొందిస్తాయి. అలనాటి కళాఖండాలని దేశమంతటా తిరిగి సేకరించడమే కాదు వాటిని నేటి తరానికి తగ్గట్టుగా మార్చి వ్యాపారవ్తేతగా రాణిస్తున్న జుజ్జవరపు మౌనిక వసుంధరతో మాట్లాడారు..

ఇంట్లో శుభకార్యముంటే నీళ్ల ఖర్చు ఎక్కువ కదాని.. గాబులు, గంగాళాలు బయటకు తీసేవారు నా చిన్నప్పుడు. ఇంట్లో రాజసాన్ని చూపించడానికి పందిరి మంచాలని ఉంచేవారు. రంగూన్‌ పెట్టెలున్నా, బర్మా పెట్టెలున్నా ఆ ఇంటికి నిండుదనమే. అమ్మ సారెగా తెచ్చుకున్న ఇత్తడి వస్తువులని చూసినప్పుడు ఆమె కళ్లలో మెరుపుని ఎప్పుడైనా గమనించారా? అవి జ్ఞాపకాలతో ముడిపడిన ఆస్తులు. వాటిని ఇప్పటి వారికి తెలియచేయాలనే విశాఖలో జస్ట్‌ జడ్జ్‌ పేరుతో ఎగ్జిబిషన్‌ షోరూం ఏర్పాటు చేశా. ఇక్కడ మంచం నుంచి కంచం వరకూ అలనాటి వస్తువులన్నీ ఉంటాయి. పైగా వాటిని వీటిని వినియోగించుకునేందుకు వీలుగా మార్పులు, చేర్పులు చేసి మరీ అందిస్తున్నా.

మా అమ్మ వస్తువులను చూసి..

మాది తణుకు దగ్గర కానూరు. నాన్న జేవీ రాయుడు ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారి. అమ్మ శ్రీదేవి. మావారు సిద్ధార్థ వెంకట్రామ్‌ పౌల్ట్రీ వ్యాపారి. నేను ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, బెంగళూరులో ఎంబీఏ ఫైనాన్స్‌ చేశా. తర్వాత క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలో రెండేళ్లు ఉద్యోగం చేశా. నా బాల్యమంతా మా పల్లెటూళ్లోనే సాగింది. పల్లె వాతావరణం, సంస్కృతి, సంప్రదాయాలు, ఉత్సవాలు అంటే భలే ఆసక్తి. మా ఇంట్లోని ఇత్తడి, రాగి వస్తువులు చూశాక పాతకాలం వస్తువులపై ఆసక్తి పెరిగింది. పండగలప్పుడు మూలపడేసిన వస్తువులను బయటకు తీసి వాటిని అందంగా అలంకరించేదాన్ని. ఊర్లో ఎవరైనా ఇత్తడి సామాన్లు అమ్ముతుంటే భిన్నంగా ఉన్నవి సేకరించేదాన్ని. ఇలా చదువుకునే రోజుల్లోనే వంద ఏళ్లనాటి ఇత్తడి, రాగితో చేసిన టిఫిన్‌ బాక్సులు, మర చెంబులు, దీపాలు, కిళ్లీ పెట్టెలు, ఆభరణాల పెట్టెలు, బర్మా, రంగం పెట్టెలు, గంగాళాలు వంటివి కొనుగోలు చేశా. వాటి కోసం మా ఊర్లో ఒక మండువా ఇంటినే నిర్మించుకున్నా.

నాలాంటి వారి కోసం..

చాలా మందికి వీటి విలువ తెలియదు. తెలిసీ కొనాలనుకొనేవారికి ఇవి దొరకవు. అలాంటివారికి ఉపయోగపడాలనే జస్ట్‌ జడ్జ్‌ను ఏర్పాటు చేశా. ఈ ఎగ్జిబిషన్‌ షోరూం ఆలోచన మూడేళ్ల కిందట వచ్చినా కొవిడ్‌ వల్ల ఆలస్యమైంది. 2021 నుంచి పది రాష్ట్రాలు తిరిగి చాలా వస్తువులు సమకూర్చా. దిల్లీ, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, చత్తీస్‌గఢ్‌ తిరిగి అపురూపమైన వస్తువులు సేకరించా. ఎంతోమందిని కలిశా. గ్రామీణులు, మధ్యవర్తులతో మాట్లాడా. తమిళనాడు నుంచి వందేళ్లనాటి గరుడ విగ్రహం, రాజస్థాన్‌ నుంచీ బోషాణాలు, అలమరాలు, కిటికీలు, ద్వార బంధాలు, మండువా తలుపులు, స్తంభాలు, అద్దాల బాక్సులు, ఇత్తడి కంచాలు, గ్లాసులు, రసం పాత్రలు, ఇడ్లీ పాత్ర, వంటసామగ్రి, సకినాలు చేసేవి, కొబ్బరి కోరు తీసేవి, పప్పు, నెయ్యి గిన్నెలు, చపాతి పెట్టుకునే పాత్రలు, అండాలు, డేగిసాలు, తపేలాలు.. ఇలా ఎంతో చరిత్ర కలిగినవన్నీ సేకరించా.

వినియోగించేందుకు వీలుగా..

పాడైన పాతవాటిని ఆధునిక వస్తువులతో మేళవించి కళాత్మకంగా తయారు చేస్తా. చిన్నపాటి మరమ్మతులు చేసి వాడుకునేందుకు వీలుగా మార్చి అందుబాటులో ఉంచా. రాజస్థాన్‌ నుంచి సేకరించిన తలుపులను బల్లలుగా మార్చా. రంగూన్‌ పెట్టెలను బల్లలుగా, అలమరాలుగా చేశా. కటకటాల తలుపులను బీరువాగా మార్చా. 200 ఏళ్లనాటి చెక్కలను చిన్నముక్కలుగా చేసి అలంకరణ వస్తువులుగా మార్చి అమ్ముతున్నాం. కొన్నిసార్లు అద్దెకూ ఇస్తున్నాం. చాలా హోటళ్లలో నాటి జ్ఞాపకాలను పెడుతున్నారు. ఈవెంట్‌ మేనేజర్లు వీటిని అద్దెకు తీసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కొందరు షోరూం నిర్వాహకులు వారి ఆభరణాలు, వస్త్ర దుకాణాల ఫొటోషూట్లు చేసుకోవడానికీ తీసుకెళ్తున్నారు. ఆటోమొబైల్‌ విడిభాగాలకూ డిమాండ్‌ ఎక్కువే. వీటి విలువని పాఠశాల విద్యార్థులకు చూపించి అవగాహన కల్పిస్తున్నా.

- రావివలస సురేష్‌, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్